భారత్‌ పరాక్రమం.. పాక్‌ పాదాక్రాంతం | India beat Pakistan by 89 runs | Sakshi
Sakshi News home page

భారత్‌ పరాక్రమం.. పాక్‌ పాదాక్రాంతం

Published Mon, Jun 17 2019 5:17 AM | Last Updated on Mon, Jun 17 2019 4:05 PM

India beat Pakistan by 89 runs - Sakshi

ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై భారత జెండా మళ్లీ సగర్వంగా ఎగిరింది. 27 ఏళ్లుగా సాగుతున్న సినిమానే టీమిండియా ఆటగాళ్లు దాయాదికి మళ్లీ చూపించారు. ఆటగాళ్లు మారినా, మైదానాలు మారినా విశ్వ వేదికపై మనల్ని ఓడించే సత్తా ఆ జట్టుకు లేదని మరోసారి నిరూపించారు. మ్యాచ్‌కు ముందు ఎన్ని అంచనాలు ఉన్నా, ‘మ్యాచ్‌ ఆఫ్‌ ద టోర్నీ’ అంటూ ఇరు దేశాల్లో హడావిడి చేసినా అసలు పోరుకు వచ్చే సరికి భారత్‌ బలం ముందు పాక్‌ ఏమాత్రం నిలబడలేదని ఈ మ్యాచ్‌ కూడా నిరూపించింది. రెండేళ్ల క్రితం చాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌ విజయాన్ని చూసి మురిసిపోతూ అదే ప్రదర్శనను పునరావృతం చేయాలని ఆశించిన పాకిస్తాన్‌కు గర్వభంగమైంది. సమష్టితత్వంతో చెలరేగిన కోహ్లి సేన వరల్డ్‌ కప్‌ ముఖాముఖీ పోరులో తమ ఆధిపత్యాన్ని 7–0కు పెంచుకొని ప్రత్యర్థికి అందనంత ఎత్తులో నిలిచింది.

వన్డే కెరీర్‌లో ఎన్ని శతకాలు బాదినా ప్రపంచకప్‌లో పాకిస్తాన్‌పై సెంచరీ అంటే ఆ కిక్కే వేరు... రోహిత్‌ శర్మ అదే జోష్‌తో ఆడటంతో భారత్‌ భారీ స్కోరుకు బాటలు పడ్డాయి. సహాయక పాత్రలో కెప్టెన్‌ కోహ్లి, ఓపెనర్‌గా వచ్చిన రాహుల్‌ కూడా ఒదిగిపోవడంతో ధావన్‌ లేని లోటు తెలియకుండా భారత్‌ దూసుకుపోయింది. పెద్ద లక్ష్యాలను ఛేదించడంలో పేలవ రికార్డు ఉన్న పాకిస్తాన్‌కు ఇది శక్తికి మించిన పనే అయింది. బుమ్రా, భువీ ఒక్క వికెట్‌ తీయకపోయినా... ఎవరినైనా ఓడించగల బౌలింగ్‌ మనకుందని చూపిస్తూ కుల్దీప్, హార్దిక్‌ పాండ్యా చెలరేగిపోయారు. అనూహ్య అవకాశాన్ని అద్భుతంగా వాడుకున్న విజయ్‌ శంకర్‌ కూడా వీరికి జత కలవడంతో ప్రత్యర్థి కుప్పకూలిపోయింది. మొత్తంగా భయపెట్టిన వర్షం సరైన సమయానికి పక్కకు తప్పుకోవడంతో భారత్‌ రికార్డు చెక్కు చెదరలేదు.   

మాంచెస్టర్‌: ప్రపంచకప్‌ టోర్నీ ప్రతిష్టాత్మక పోరులో భారత్‌ మరోసారి పైచేయి సాధించింది. ఆదివారం ఇక్కడి ఓల్డ్‌ ట్రఫోర్డ్‌ మైదానంలో జరిగిన పోరులో భారత్‌ 89 పరుగుల (డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం) తేడాతో పాకిస్తాన్‌పై ఘన విజయం సాధించింది. టాస్‌ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత్‌ 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 336 పరుగులు చేసింది. ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ రోహిత్‌ శర్మ (113 బంతుల్లో 140; 14 ఫోర్లు, 3 సిక్సర్లు) సెంచరీకి తోడు కోహ్లి (65 బంతుల్లో 77; 7 ఫోర్లు), కేఎల్‌ రాహుల్‌ (78 బంతుల్లో 57; 3 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. అనంతరం పాక్‌ 35 ఓవర్లు ముగిసేసరికి 6 వికెట్ల నష్టానికి 166 పరుగులు చేసింది. ఈ దశలో వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచిపోయింది. దాంతో డక్‌వర్త్‌–లూయిస్‌ ప్రకారం పాక్‌ లక్ష్యాన్ని 40 ఓవర్లలో 302 పరుగులుగా నిర్దేశించారు. పాక్‌ తర్వాతి 5 ఓవర్లలో మరో 46 పరుగులు జోడించి చివరకు 212 పరుగుల వద్ద ఆట ముగించింది. ఫఖర్‌ జమాన్‌ (75 బంతుల్లో 62; 7 ఫోర్లు, 1 సిక్స్‌) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో ఈనెల 22న అఫ్గానిస్తాన్‌తో ఆడుతుంది.   

టపటపా...
భారీ లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఏ దశలోనూ పాకిస్తాన్‌ గెలుపు దిశగా సాగలేదు. పేలవమైన ఆరంభం, మధ్య ఓవర్లలో స్పిన్‌ను సమర్థంగా ఎదుర్కోలేకపోవడం, ఒక్క బ్యాట్స్‌మన్‌ కూడా దూకుడుగా ఆడలేకపోవడంతో పాక్‌ సహజంగానే ఓటమిని ఆహ్వానించింది. తొలి పది ఓవర్లలో ఆ జట్టు 38 పరుగులే చేయగలిగింది. బాబర్‌ ఆజమ్‌ ఔటయ్యే సమయానికి చేయాల్సిన రన్‌రేట్‌ 8.46 పరుగులకు చేరిపోయింది. కొద్దిసేపటికే హార్దిక్‌ వరుస బంతుల్లో హఫీజ్‌ (9), షోయబ్‌ మాలిక్‌ (0)లను ఔట్‌ చేయడంతో ఆ జట్టుకు ఉన్న దారులు మూసుకుపో యాయి. ఆ తర్వాత మిగతా ఆటంతా లాంఛనమే అయింది. చివర్లో ఇమాద్‌ వసీమ్‌ (39 బంతుల్లో 46 నాటౌట్‌; 6 ఫోర్లు) కొద్దిగా ప్రతిఘటించాడు.  

భువీకి గాయం... విజయ్‌కు వికెట్‌...
‘3ఈ’ ప్లేయర్‌గా వరల్డ్‌ కప్‌ జట్టులోకి వచ్చిన విజయ్‌ శంకర్‌పై సగటు అభిమానికి మాత్రం పెద్దగా అంచనాలు లేవు. ధావన్‌ గాయంతో తుది జట్టులో అవకాశం దక్కించుకున్న అతను ఒత్తిడిలో ధాటిగా ఆడలేక బ్యాటింగ్‌లో పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. అయితే ప్రపంచకప్‌లో తొలి మ్యాచ్‌ ఆడుతున్న అతను, తొలి బంతికే వికెట్‌ తీసి వహ్వా అనిపించాడు. ప్రధాన పేసర్‌ భువనేశ్వర్‌ తన మూడో ఓవర్లో నాలుగు బంతులు వేసిన తర్వాత కండరాలు పట్టేయడంతో మైదానం నుంచి వెళ్లిపోయాడు. ఆ ఓవర్‌ను పూర్తి చేసేందుకు వచ్చిన శంకర్‌ తొలి బంతికే ఇమాముల్‌ హఖ్‌ (7)ను వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. అతను ఈ రకంగా వికెట్‌ తీయడం కెప్టెన్‌ కోహ్లితో సహా అందరినీ ఆశ్చర్యపరచింది. వారంతా అతడిని అభినందనలతో ముంచెత్తారు. గాయంతో భువీ రెండు మ్యాచ్‌లకు దూరమయ్యాడు.

అద్భుతం ఆ బంతి
పాక్‌ ఆశలన్నీ ఆ జట్టు టాప్‌ బ్యాట్స్‌మన్‌ బాబర్‌ ఆజమ్‌ (57 బంతుల్లో 48; 3 ఫోర్లు, 1 సిక్స్‌) పైనే ఉన్న దశలో కుల్దీప్‌ వేసిన బంతి ఒక్కసారిగా పాక్‌ పతనానికి శ్రీకారం చుట్టింది. ఆఫ్‌స్టంప్‌ మీదుగా పడిన బంతి అనూహ్యంగా టర్న్‌ తీసుకొని లోపలికి దూసుకొచ్చింది. బయటి వైపు ఆడేందుకు ప్రయత్నించిన బాబర్‌ పూర్తిగా అంచనా తప్పా డు. దాంతో బ్యాట్, ప్యాడ్‌ మధ్యనుంచి దూసుకుపోయిన బంతి బెయి ల్స్‌ను ఎగరగొట్టింది. బాబర్‌ షాక్‌లో ఉండిపోగా... టీమిండియా సంబరాలు చేసుకుంది. అతని తర్వాతి ఓవర్లోనే ఫఖర్‌ కూడా ఔట్‌ కావడంతో పాక్‌ పరిస్థితి మరింత దిగజారింది.

స్కోరు వివరాలు  
భారత్‌ ఇన్నింగ్స్‌: రాహుల్‌ (సి) బాబర్‌ (బి) రియాజ్‌ 57; రోహిత్‌ (సి) రియాజ్‌ (బి) హసన్‌ 140; కోహ్లి (సి) సర్ఫరాజ్‌ (బి) ఆమిర్‌ 77; పాండ్యా (సి) బాబర్‌ (బి) ఆమిర్‌ 26; ధోని (సి) సర్ఫరాజ్‌ (బి) ఆమిర్‌ 1; విజయ్‌ శంకర్‌ (నాటౌట్‌) 15; జాదవ్‌ (నాటౌట్‌) 9; ఎక్స్‌ట్రాలు 11; మొత్తం (50 ఓవర్లలో 5 వికెట్లకు) 336.

వికెట్ల పతనం: 1–136, 2–234, 3–285, 4–298, 5–314. బౌలింగ్‌: ఆమిర్‌ 10–1–47–3, హసన్‌ అలీ 9–0–84–1, వహాబ్‌ రియాజ్‌ 10–0–71–1, ఇమాద్‌ 10–0–49–0, షాదాబ్‌ 9–0–61–0, మాలిక్‌ 1–0–11–0, హఫీజ్‌ 1–0–11–0.

పాకిస్తాన్‌ ఇన్నింగ్స్‌: ఇమామ్‌ ఉల్‌ హఖ్‌ (ఎల్బీ) (బి) విజయ్‌ శంకర్‌ 7; ఫఖర్‌ జమాన్‌ (సి) చహల్‌ (బి) కుల్దీప్‌ 62; బాబర్‌ ఆజమ్‌ (బి) కుల్దీప్‌ 48; హఫీజ్‌ (సి) శంకర్‌ (బి) పాండ్యా 9; సర్ఫరాజ్‌ (బి) విజయ్‌ శంకర్‌ 12; షోయబ్‌ మాలిక్‌ (బి) పాండ్యా 0; ఇమాద్‌ (నాటౌట్‌) 46; షాదాబ్‌ (నాటౌట్‌) 20; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం (40 ఓవర్లలో 6 వికెట్లకు) 212.
వికెట్ల పతనం: 1–13, 2–117, 3–126, 4–129, 5–129, 6–165.  

బౌలింగ్‌: భువనేశ్వర్‌ 2.4–0–8–0, బుమ్రా 8–0–52–0, విజయ్‌ శంకర్‌ 5.2–0–22–2, హార్దిక్‌ పాండ్యా 8–0–44–2, కుల్దీప్‌ 9–1–32–2, చహల్‌ 7–0–53–0.  

రాణించిన రాహుల్‌
రాహుల్‌ ఆరంభంలో కొంత తడబడ్డా చివరకు అర్ధ సెంచరీతో భారీ స్కోరులో కీలక పాత్ర పోషించాడు. అతనికి ఆమిర్‌ వేసిన ఇన్నింగ్స్‌ తొలి ఓవర్‌ ‘మెయిడిన్‌’గా ముగిసింది. ఎదుర్కొన్న 11వ బంతికి తొలి ఫోర్‌ కొట్టిన రాహుల్‌... అనంతరం కొన్ని చక్కటి షాట్లు ఆడాడు.  సిక్సర్‌తో 69 బంతుల్లో అతని అర్ధ సెంచరీ పూర్తయింది. మరోసారి బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ప్రమోట్‌ అయిన హార్దిక్‌ పాండ్యా (19 బంతుల్లో 26; 2 ఫోర్లు, 1 సిక్స్‌) ఉన్నంత సేపు దూకుడుగా ఆడాడు. హసన్‌ ఓవర్లో అతను కొట్టిన ఫోర్, సిక్స్‌ హైలైట్‌గా నిలిచాయి. ధోని (1) మాత్రం ఎక్కువ సేపు నిలవలేకపోయా డు. ఈ రెండు వికెట్లు ఆమిర్‌కే దక్కాయి.  

విరాట్‌ జోరు
కోహ్లి నిలదొక్కుకునేందుకు కొంత సమయం తీసుకున్నాడు. సింగిల్స్‌ పైనే దృష్టి పెట్టి రోహిత్‌కు సహకరిస్తూ వచ్చాడు. అతను ఎదుర్కొన్న తొలి 39 బంతుల్లో ఒకే ఒక ఫోర్‌ ఉంది. రోహిత్‌ ఔటైన తర్వాతే విరాట్‌ దూకుడు పెంచి చకచకా బౌండరీలు బాదాడు. ఆమిర్‌ బౌలింగ్‌లో రెండు పరుగులు తీయడంతో 51 బంతుల్లో కెప్టెన్‌ హాఫ్‌ సెంచరీ మార్క్‌ను చేరుకున్నాడు. వ్యక్తిగత స్కోరు 57 వద్ద కోహ్లి వన్డేల్లో 11 వేల పరుగులు పూర్తి చేసుకోవడం విశేషం. వర్షం ఆగిన తర్వాత మరో బౌండరీ కొట్టిన అతని ఇన్నింగ్స్‌ ఆమిర్‌ బౌలింగ్‌లో ముగిసింది.

ఆ 20 బంతుల్లో...
ఊహించినంత ఎక్కువసేపు కాకపోయినా కొన్ని నిమిషాలు వర్షం మ్యాచ్‌కు కొంత అంతరాయం కలిగించింది. భారత ఇన్నింగ్స్‌లో 46.4 ఓవర్లు ముగిసిన తర్వాత వర్షం వల్ల ఆట ఆగిపోయింది. దాదాపు 40 నిమిషాల తర్వాత మళ్లీ ఆట మొదలైంది. వర్షానికి ముందే పాక్‌ ప్రతిఘటనతో భారత ఇన్నింగ్స్‌లో వేగం తగ్గింది. మిగిలిన 20 బంతుల్లో కోహ్లి ఔట్‌ కాగా... విజయ్‌ శంకర్‌ (15 నాటౌట్‌), కేదార్‌ జాదవ్‌ (9 నాటౌట్‌) ఆశించినంత వేగంగా ఆడలేకపోయారు. దాంతో మొత్తం 31 పరుగులు వచ్చాయి. చివరి పది ఓవర్లలో భారత్‌ 88 పరుగులు చేసింది.
 

కోహ్లిని ఔట్‌ చేసిన కోహ్లి
కోహ్లిని ఔట్‌ చేయడం పాక్‌ బౌలర్ల వల్ల కాకపోయినా కోహ్లి వల్లనే అవుతుంది... తాజా ఘటన దీనికి ఉదాహరణ. ఆమిర్‌ వేసిన బౌన్సర్‌ను కోహ్లి పుల్‌ చేయబోగా అది కీపర్‌ చేతుల్లో పడింది. అంతే...కోహ్లి వెంటనే తలవంచుకొని పెవిలియన్‌ వైపు బయల్దేరాడు. అప్పటికి అంపైర్‌ ఔట్‌గా కూడా ప్రకటించలేదు. రీప్లే చూస్తే కోహ్లి బ్యాట్‌కు బంతి తగల్లే దని తేలింది. అతని బ్యాట్‌ హ్యాండిల్‌ చివర కొంత లూజ్‌గా ఉండటం వల్ల వచ్చిన శబ్దంతో అతను ఔటైనట్లుగా భావించినట్లు అంచనా. నిజానికి భారత్‌కు ఒక రివ్యూ మిగిలే ఉంది. దానిని  విరాట్‌ వాడే ప్రయత్నం చేయకుండా తనంతట తాను వెళ్లిపోవడం విశేషం.


రోహిత్‌ సూపర్‌
టోర్నీ తొలి మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాపై సెంచరీ సాధించిన రోహిత్‌ మళ్లీ పాక్‌పై సత్తా చాటి శతకంతో చెలరేగాడు. పాక్‌పై అతనికి ఇది వరుసగా రెండో సెంచరీ కావడం విశేషం. ఆరంభంలో అతను హసన్‌ అలీ బౌలింగ్‌లో చెలరేగిపోయాడు. హసన్‌ తొలి రెండు ఓవర్లలో ఒక్కో ఫోర్‌ కొట్టిన రోహిత్, తర్వాతి ఓవర్లో మరో ఫోర్, సిక్స్‌ బాదాడు. స్పిన్నర్‌ షాదాబ్‌ తొలి ఓవర్లో వరుస బంతుల్లో 6, 4 కొట్టిన రోహిత్‌ 34 బంతుల్లోనే హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాతా అతని జోరు కొనసాగింది. హసన్‌ తర్వాతి స్పెల్‌లో కూడా మళ్లీ ఫోర్, సిక్స్‌ కొట్టిన భారత ఓపెనర్‌ 90ల్లోకి అడుగు పెట్టాడు. షాదాబ్‌ బౌలింగ్‌లో సింగిల్‌తో రోహిత్‌ సెంచరీ (85 బంతుల్లో) పూర్తయింది. ఆ తర్వాత వహాబ్‌ బౌలింగ్‌లో ఒంటికాలిపై బ్యాక్‌వర్డ్‌ స్క్వేర్‌లెగ్‌ దిశగా కొట్టిన ఫోర్‌ ఇన్నింగ్స్‌కే హైలైట్‌గా నిలిచింది. 38 ఓవర్లు ముగిసే సరికే రోహిత్‌ స్కోరు 136. అతని జోరు చూస్తే మరో డబుల్‌ సెంచరీ ఖాయమనిపించింది. అయితే హసన్‌ బౌలింగ్‌లో స్కూప్‌ ఆడేందుకు ప్రయత్నించి షార్ట్‌ ఫైన్‌లెగ్‌లో క్యాచ్‌ ఇవ్వడంతో అద్భుత ఇన్నింగ్స్‌ ముగిసింది. 140 పరుగులు చేసినా... తాను ఔటైన తీరు పట్ల రోహిత్‌ తనపై తానే తీవ్ర అసంతృప్తిని ప్రదర్శిస్తూ పెవిలియన్‌ చేరాడు.  

1 ప్రపంచ కప్‌లో పాక్‌పై ఏ జట్టుకైనా ఇదే అత్యధిక స్కోరు (336/5). ఇదే టోర్నీలో ఇంగ్లండ్‌ (334/9) నమోదు చేసిన రికార్డును భారత్‌ సవరించింది.

2 అత్యధిక వన్డేలు ఆడిన భారత క్రికెటర్ల జాబితాలో ద్రవిడ్‌ (340)ను దాటి ధోని (341) రెండో స్థానానికి చేరాడు. సచిన్‌ (463) టాపర్‌గా ఉన్నాడు.

3 ప్రపంచకప్‌ అరంగేట్రం మ్యాచ్‌లో తొలి బంతికే వికెట్‌ తీసిన మూడో బౌలర్‌ విజయ్‌ శంకర్‌. గతంలో హార్వే (ఆస్ట్రేలియా; పాక్‌పై 2003లో), మలాచీ జోన్స్‌ (బెర్ముడా; భారత్‌పై 2007లో) ఈ ఘనత సాధించారు.   

9 వన్డేల్లో 11 వేల పరుగులు పూర్తి చేసుకున్న తొమ్మిదో క్రికెటర్‌ కోహ్లి. సచిన్, గంగూలీ తర్వాత భారత్‌ నుంచి ఈ ఘనత సాధించిన మూడో బ్యాట్స్‌మన్‌.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement