దాయాదిని దంచారు
టి20 ప్రపంచకప్‌లో భారత్ బోణి
7 వికెట్లతో పాక్‌పై ఘన విజయం
సమష్టిగా రాణించిన బౌలర్లు
మెరిసిన ఓపెనర్లు రైనా, కోహ్లిల నిలకడ
ఇంతకంటే మజా ఏముంటుంది... కిక్కిరిసిన స్టేడియంలో... టి20 ప్రపంచకప్ తొలి మ్యాచ్‌లో... చిరకాల ప్రత్యర్థిని చిత్తు చేయడంకంటే సంతోషం ఏముంటుంది..? ఓ వైపు స్టేడియం డ్రమ్స్ శబ్దంతో హోరెత్తుతుంటే... మరోవైపు పాక్ ఆటగాళ్ల గుండెల్లో భారత క్రికెటర్లు తమ ఆటతో దడ పెంచారు. ఆల్‌రౌండ్ నైపుణ్యంతో పాక్‌ను చిత్తుచేసిన ధోనిసేన టి20 ప్రపంచకప్‌లో అదిరిపోయే ఆటతీరుతో బోణీ చేసింది. ఏనాడూ ప్రపంచ కప్ మ్యాచ్‌ల్లో పాక్ చేతిలో ఓడిపోని రికార్డును కొనసాగించింది. కాకపోతే... మరీ మ్యాచ్ ఏకపక్షంగా సాగడంతో... వార్ వన్‌సైడ్ అయింది.
ఢాకా నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి
‘బౌలింగ్ విభాగంలోనే మేం మెరుగుపడాలి. ఓపెనర్లు కూడా మంచి ఆరంభాన్నివ్వాలి’ మ్యాచ్‌కు ముందు ధోని చేసిన ఈ వ్యాఖ్య కసి పెంచిందేమో! బౌలర్లు తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై చెలరేగిపోయారు. అద్భుతంగా బౌలింగ్ చేసి పాకిస్థాన్ లాంటి బలమైన జట్టును కూడా నియంత్రించి టి20 ప్రపంచకప్‌లో భారత్‌కు ఘనమైన ఆరంభాన్ని అందించారు. బౌలర్లు రాణించడం, ఓపెనర్ల సమయోచిత బ్యాటింగ్, మిడిలార్డర్ నిలకడ... ఇలా మొత్తం మీద భారత్ క్రికెటర్లు జట్టుగా రాణించడంతో... షేరే బంగ్లా స్టేడియంలో శుక్రవారం జరిగిన సూపర్-10 గ్రూప్-2 మ్యాచ్‌లో భారత్ ఏడు వికెట్ల తేడాతో పాకిస్థాన్‌ను ఓడించింది.
టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా... పాకిస్థాన్ 20 ఓవర్లలో 7 వికెట్లకు 130 పరుగులు మాత్రమే చేసింది. షెహ్‌జాద్ (17 బంతుల్లో 22; 2 ఫోర్లు), ఉమర్ అక్మల్ (30 బంతుల్లో 33; 2 ఫోర్లు), షోయబ్ మాలిక్ (20 బంతుల్లో 18; 1 ఫోర్, 1 సిక్సర్) ఓ మాదిరిగా ఆడారు. ఉమర్, మాలిక్ నాలుగో వికెట్‌కు 50 పరుగులు జోడించారు. భారత బౌలర్లు వరుస విరామాల్లో వికెట్లతో పాక్‌ను నియంత్రించారు. చివర్లో మఖ్‌సూద్ (11 బంతుల్లో 21; 2 ఫోర్లు, 1 సిక్సర్) వేగంగా ఆడటంతో పాక్‌కు ఆ మాత్రం స్కోరైనా వచ్చింది. భారత బౌలర్లలో అమిత్ మిశ్రా రెండు వికెట్లు తీయగా... భువనేశ్వర్, షమీ, జడేజా ఒక్కో వికెట్ పడగొట్టారు. భారత్ జట్టు 18.3 ఓవర్లలో మూడు వికెట్లు మాత్రమే కోల్పోయి 131 పరుగులు చేసి గెలిచింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ (21 బంతుల్లో 24; 1 ఫోర్, 2 సిక్సర్లు), ధావన్ (28 బంతుల్లో 30; 5 ఫోర్లు) తొలి వికెట్‌కు 54 పరుగులు జోడించి శుభారంభాన్నిచ్చారు.
ఈ ఇద్దరూ అవుటయ్యాక యువరాజ్ (1) నిరాశపరిచినా... కోహ్లి (32 బంతుల్లో 36 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్సర్), రైనా (28 బంతుల్లో 35 నాటౌట్; 4 ఫోర్లు, 1 సిక్సర్) నిలకడగా ఆడి విజయాన్ని పూర్తి చేశారు. ఈ ఇద్దరూ నాలుగో వికెట్‌కు అజేయంగా 50 బంతుల్లో 66 పరుగులు జోడించారు. పాక్ బౌలర్లలో అజ్మల్, గుల్, భట్టి ఒక్కో వికెట్ తీసుకున్నారు. అమిత్ మిశ్రాకు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది. ఈ విజయంతో భారత్ ఖాతాలో రెండు పాయింట్లు చేరాయి. తర్వాతి మ్యాచ్‌లో భారత్ జట్టు ఆదివారం వెస్టిండీస్‌తో తలపడుతుంది.
భారత బౌలర్ల క్రమశిక్షణ
భారత్ జట్టు స్పిన్నర్ అశ్విన్‌తో బౌలింగ్ ప్రారంభించింది. అయితే రెండో ఓవర్‌లో భువనేశ్వర్ కుమార్ బౌలింగ్‌లో కమ్రాన్ అక్మల్ లేని పరుగుకు ప్రయత్నించి రనౌట్ అయ్యాడు.ఎనిమిదో ఓవర్లో జడేజా బౌలింగ్‌లో హఫీజ్ ... భువనేశ్వర్‌కు క్యాచ్ ఇచ్చి అవుటయ్యాడు. తర్వాతి ఓవర్లో మిశ్రా అద్భుతమైన బంతితో షెహ్‌జాద్‌ను బోల్తా కొట్టించాడు.
ఉమర్, మాలిక్ కలిసి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ తర్వాతి మూడు ఓవర్లలో భారత బౌలర్లు పుంజుకొని కేవలం 8 పరుగులు మాత్రమే ఇచ్చి మాలిక్, అక్మల్‌లను అవుట్ చేశారు. చివర్లో మఖ్‌సూద్ వేగంగా ఆడి పాక్‌కు ఓ మాదిరి స్కోరు అందించాడు.లక్ష్యం చిన్నదే కావడంతో భారత ఓపెనర్లు ధావన్, రోహిత్ తొలి మూడు ఓవర్లు ఆచితూచి ఆడారు. భారత్ పవర్ ప్లే ఆరు ఓవర్లలో 38 పరుగులు చేసింది.
ఎనిమిదో ఓవర్లో గుల్ బౌలింగ్‌లో ఆఖరి బంతికి ధావన్ షార్ట్‌పిచ్ బంతిని భారీ షాట్ ఆడబోయి వెనుదిరిగాడు. అప్పటివరకూ నిలకడగా ఆడిన రోహిత్... పదో ఓవర్లో అజ్మల్ బంతిని కట్ చేయబోయి వికెట్ల మీదకు ఆడుకున్నాడు. 10 ఓవర్లలో భారత్ 2 వికెట్లకు 65 పరుగులు చేసింది. 11వ ఓవర్ తొలి బంతికే యువరాజ్‌ను భట్టి బౌల్డ్ చేశాడు. ఆ తర్వాత రైనా, కోహ్లి చకచకా బౌండరీలతో స్కోరు వేగం పెంచారు. ఈ ఇద్దరి నిలకడతో 15వ ఓవర్ ముగిసేసమయానికి భారత్ 3 వికెట్లకు 106 పరుగులు చేసింది. అదే జోరును కొనసాగించిన భారత్ మరో 9 బంతులు ఉండగానే మ్యాచ్‌ను ముగించింది.
స్కోరు వివరాలు
పాకిస్థాన్ ఇన్నింగ్స్: కమ్రాన్ అక్మల్ రనౌట్ 8; షెహ్‌జాద్ (స్టం) ధోని (బి) మిశ్రా 22; హఫీజ్ (సి) భువనేశ్వర్ (బి) జడేజా 15; ఉమర్ అక్మల్ (సి) రైనా (బి) షమీ 33; షోయబ్ మాలిక్ (సి) రైనా (బి) మిశ్రా 18; ఆఫ్రిది (సి) రైనా (బి) భువనేశ్వర్ 8; మఖ్‌సూద్ రనౌట్ 21; భట్టి నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (20 ఓవర్లలో 7 వికెట్లకు) 130.
వికెట్ల పతనం: 1-9; 2-44; 3-47; 4-97; 5-103; 6-114; 7-130.
బౌలింగ్: అశ్విన్ 4-0-23-0; భువనేశ్వర్ 3-0-21-1; షమీ 4-0-31-1; అమిత్ మిశ్రా 4-1-22-2; రవీంద్ర జడేజా 4-0-18-1; యువరాజ్ 1-0-13-0.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ శర్మ (బి) అజ్మల్ 24; శిఖర్ ధావన్ (సి) అజ్మల్ (బి) గుల్ 30; విరాట్ కోహ్లి నాటౌట్ 36; యువరాజ్ సింగ్ (బి) భట్టి 1; రైనా నాటౌట్ 35; ఎక్స్‌ట్రాలు 5; మొత్తం (18.3 ఓవర్లలో మూడు వికెట్లకు) 131.
వికెట్ల పతనం: 1-54; 2-64; 3-65.
బౌలింగ్: హఫీజ్ 3-0-14-0; జునైద్ 3-0-23-0; అజ్మల్ 4-0-18-1; గుల్ 3.3-0-35-1; ఆఫ్రిది 3-0-24-0; భట్టి 2-0-17-1.
టర్నింగ్ పాయింట్
ఈ మ్యాచ్‌లో భారత విజయానికి కారణం బౌలర్లు. ముఖ్యంగా ముగ్గురు స్పెషలిస్ట్ స్పిన్నర్లు పిచ్‌ను బాగా ఉపయోగించుకున్నారు. అశ్విన్, జడేజా, రైనా ముగ్గురూ కలిసి 12 ఓవర్లలో 63 పరుగులు మాత్రమే ఇచ్చి మూడు వికెట్లు తీసుకున్నారు.
టి20 ప్రపంచకప్‌లో నేడు
దక్షిణాఫ్రికా x శ్రీలంక
మధ్యాహ్నం గం. 3.00 నుంచి
ఇంగ్లండ్ x న్యూజిలాండ్
రాత్రి గం. 7.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్-1లో ప్రత్యక్ష ప్రసారం