
భారత్ శుభారంభం
తొలి మ్యాచ్‌లో శ్రీలంకపై విజయం
రాణించిన దేవిక, మిథాలీ
ప్రపంచకప్ క్వాలిఫయింగ్ టోర్నీ
కొలంబో: ఐసీసీ ప్రపంచకప్ మహిళల క్రికెట్ క్వాలిఫయింగ్ టోర్నమెంట్‌లో భారత్ శుభారంభం చేసింది. మంగళవారం జరిగిన గ్రూప్ ‘ఎ’ తొలి లీగ్ మ్యాచ్‌లో టీమిండియా 114 పరుగుల ఆధిక్యంతో ఘనవిజయం సాధించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లకు 259 పరుగులు చేసింది. ఓపెనర్ దీప్తి శర్మ ( 54; 4 ఫోర్లు, ఒక సిక్స్), దేవిక వైద్య (89; 11 ఫోర్లు), కెప్టెన్ మిథాలీ రాజ్ (70 నాటౌట్; 8 ఫోర్లు) అర్ధ సెంచరీలు సాధించారు. అనంతరం శ్రీలంక 50 ఓవర్లలో ఎనిమిది వికెట్లకు 145 పరుగులు చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో ఏక్తా బిష్త్, రాజేశ్వరి గైక్వాడ్ రెండేసి వికెట్లు తీశారు.
దక్షిణాఫ్రికాతో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో ఓడిపోయిన భారత్ ఈ మ్యాచ్‌లో మాత్రం ఆతిథ్య జట్టును తేలిగ్గా తీసుకోలేదు. తొమ్మిది పరుగుల వద్ద మోనా మేష్రమ్ (6) పెవిలియన్‌కు చేరుకున్నా... రెండో వికెట్‌కు దీప్తి శర్మ, దేవిక వైద్య 122 పరుగులు జోడించి భారత్‌కు గట్టి పునాది ఏర్పాటు చేశారు. దీప్తి అవుటయ్యాక మిథాలీతో కలిసి దేవిక 49 పరుగులు జతచేసింది. సెంచరీ దిశగా సాగుతున్న దశలో ప్రబోధిని బౌలింగ్‌లో దేవిక అవుటైంది.
ఈ దశలో క్రీజులో వచ్చిన హర్మన్‌ప్రీత్ కౌర్ (20; 3 ఫోర్లు)తో కలిసి మిథాలీ వేగంగా పరుగులు చేసి భారత స్కోరును 250 పరుగులు దాటించారు. ‘విజయంతో టోర్నీని ఆరంభించినందుకు ఆనందంగా ఉంది. మొదట్లో నెమ్మదిగా ఆడినా... దేవిక, దీప్తి భాగస్వామ్యంతో తేరుకున్నాం. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండటంతో వేగంగా స్కోరు చేశాం’ అని కెప్టెన్ మిథాలీ రాజ్ వ్యాఖ్యానించింది. ఇతర లీగ్ మ్యాచ్‌ల్లో దక్షిణాఫ్రికా 63 పరుగుల తేడాతో పాకిస్తాన్‌పై, బంగ్లాదేశ్ 118 పరుగుల తేడాతో పాపువా న్యూ గినియాపై, ఐర్లాండ్ 119 పరుగుల తేడాతో జింబాబ్వేపై గెలిచాయి.