
ఎప్పుడో స్వాతంత్య్రం సాధించిన కొత్తలో 1947లో తొలిసారి ఆస్ట్రేలియాలో భారత్ పర్యటన... ఆ తర్వాత మరో పదిసార్లు కంగారు గడ్డకు వెళ్లొచ్చాము... మొత్తంగా ఎనిమిది సార్లు ఓడితే, మరో మూడు సార్లు ‘డ్రా’ చేసుకొని రావడం తప్ప ఒక్కసారి కూడా సిరీస్ గెలుపు రుచి చూడలేదు. కానీ గత తరంలో దిగ్గజాలకు కూడా సాధ్యం కాని ఘనతను ఇప్పటి టీమిండియా చేసి చూపిస్తోంది.
ఆస్ట్రేలియాను వారి వేదికపైనే చిత్తు చేసి తొలిసారి సిరీస్ తమ ఖాతాలో వేసుకోబోతోంది. చివరి టెస్టుకు నేడు చివరి రోజు కాగా ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 3–1తో దర్జాగా పోరును ముగించాలని భారత్ లక్ష్యంగా పెట్టుకుంటే... ఆ 10 వికెట్లు కాపాడుకొని కనీసం ‘డ్రా’తోనైనా పరువు నిలబెట్టుకోవాలనేది ఆసీస్ ఆశ. నాలుగో రోజు వర్షం, వెలుతురులేమి కారణంగా 25.2 ఓవర్ల ఆట మాత్రమే జరగడంతో ఆసీస్ పోరాటం చివరి రోజుకు చేరింది.
చచ్చీ చెడి 300 పరుగుల మార్క్‌ను చేరిన ఆ జట్టు ఏకంగా 322 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యాన్ని కోల్పోయింది. 31 ఏళ్ల తర్వాత సొంతగడ్డపై ఫాలోఆన్ ఆడుతూ నాలుగు ఓవర్లే ఎదుర్కొన్న ఆ జట్టు ఆఖరి రోజు మొత్తం నిలబడి పరాజయం తప్పించుకుంటుందా లేక భారత బౌలర్లకు దాసోహమై తలవంచుతుందా చూడాలి. అయితే ‘డ్రా’ కోసం కూడా తమ ఆటతో పాటు నాలుగో రోజు తమను కాపాడిన వరుణుడి సహాయాన్ని కూడా కంగారూలు కోరుకుంటున్నారు.
సిడ్నీ: బోర్డర్–గావస్కర్ ట్రోఫీలో ఆద్యంతం ఆధిపత్యం కనబర్చిన భారత జట్టు సిరీస్‌కు ఘనమైన ముగింపు ఇచ్చేందుకు మరింత చేరువగా నిలిచింది. నాలుగో టెస్టులో కోహ్లి సేన చేతిలో ఓటమిని తప్పించుకునేందుకు పోరాడుతున్న ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ నష్టపోకుండా 6 పరుగులు చేసింది. చేతిలో 10 వికెట్లు ఉన్న ఆ జట్టు సోమవారం మొత్తం ఆడినా 316 పరుగుల లోటును అధిగమించి భారత్‌ను బ్యాటింగ్‌కు దించడం దాదాపుగా అసాధ్యం. కాబట్టి భారత్ సిరీస్ విజయం 2–1తోనా లేక 3–1తోనే అనేదే ఇక తేలాల్సి ఉంది. అంతకుముందు ఓవర్‌నైట్ స్కోరు 236/6తో ఆట కొనసాగించిన ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో 300 పరుగులకు ఆలౌటైంది. కుల్దీప్ యాదవ్ (5/99) ఐదు వికెట్లతో చెలరేగాడు. 322 పరుగుల ఆధిక్యం దక్కడంతో కోహ్లి ఆసీస్‌కు ‘ఫాలోఆన్’ ఇచ్చాడు. వెలుతురులేమితో నాలుగు ఓవర్లకే ఆట నిలిచిపోయింది.
మరో 64 పరుగులు...
వర్షం ఆగి ఆట మొదలైన తర్వాత తొలి వికెట్ కోసం భారత్‌కు ఎక్కువ సమయం పట్టలేదు. నాలుగో రోజు ఆరో బంతికే కమిన్స్ (25)ను షమీ బౌల్డ్ చేశాడు. కుల్దీప్ బౌలింగ్‌కు రాగానే తొలి ఓవర్లో రెండు ఫోర్లు కొట్టి హ్యాండ్స్‌కోంబ్ (111 బంతుల్లో 37; 5 ఫోర్లు) ఆధిపత్యం ప్రదర్శించే ప్రయత్నం చేసినా అది ఎంతో సేపు నిలవలేదు. బుమ్రా వేసిన బంతిని అతను వికెట్లపైకి ఆడుకున్నాడు. ఆ వెంటనే లయన్ (0)ను కుల్దీప్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. ఇక మరో వికెట్ తీసేందుకు ఎంతో సేపు లేదనిపించింది. అయితే ఆసీస్ చివరి జోడీ స్టార్క్ (55 బంతుల్లో 29 నాటౌట్; 3 ఫోర్లు), హాజల్‌వుడ్ (45 బంతుల్లో 21; 2 ఫోర్లు) భారత్‌ను కొంత అసహనానికి గురి చేసింది.
హాజల్‌వుడ్ ‘సున్నా’ వద్ద ఉన్నప్పుడు అతను ఇచ్చిన సునాయాస క్యాచ్‌ను మిడాన్‌లో విహారి వదిలేయడం కూడా ఆసీస్‌కు కలిసొచ్చింది. 14 ఓవర్ల పాటు క్రీజ్‌లో నిలిచిన వీరు పదో వికెట్‌కు 42 పరుగులు జోడించారు. ఎట్టకేలకు హాజల్‌వుడ్ ఎల్బీగా ఔట్ చేసి కంగారూ ఇన్నింగ్స్‌కు తెరదించిన కుల్దీప్ ఐదో వికెట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. బ్యాట్స్‌మన్ రివ్యూ చేసినా లాభం లేకపోయింది. నాలుగో రోజు ఆటలో ఆసీస్ మరో 64 పరుగులు జోడించి చివరి 4 వికెట్లు కోల్పోయింది. రెండో ఇన్నింగ్స్‌లోనూ ఆసీస్ ఓపెనర్లు తడబడినా... నాలుగు ఓవర్లలో ఎలాంటి ప్రమాదం లేకుండా వారు ఆటను ముగించారు.
భారత్ అసంతృప్తి
ఆసీస్ రెండో ఇన్నింగ్స్ నాలుగో ఓవర్లో బుమ్రా వేసిన షార్ట్ పిచ్ బంతి అనూహ్యంగా పైకి లేచింది. దానిని హారిస్ సరిగా ఆడలేకపోవడంతో బంతి అతని వేలికి బలంగా తాకింది. నిజానికి ఇక్కడ బ్యాట్స్‌మన్ వైఫల్యమే తప్ప బంతి సరిగా కనబడకపోవడం కాదు. ఆ సమయంలో మైదానంలోని ఎనిమిది ఫ్లడ్‌లైట్లు కూడా పని చేస్తున్నాయి. కానీ అంపైర్లు ఈ ఘటనను దృష్టిలో ఉంచుకొని వెలుతురు తగ్గిందంటూ టీ విరామానికి ముందు మైదానం వీడారు. నాలుగో రోజు భారత్ కెప్టెన్ కోహ్లి దృష్టంతా విజయంపైనే ఉంది. సిరీస్ సాధిస్తున్నా ఈ టెస్టు కూడా గెలవాలని అతను భావించాడు. అందుబాటులో ఉన్న సమయంలో 14 వికెట్లు పడగొట్టడమే టీమిండియా లక్ష్యం.
అందుకే తొలి ఇన్నింగ్స్‌లో ఆసీస్ ఆలౌట్ కాగానే మరో ఆలోచన లేకుండా ఫాలోఆన్ ఇచ్చేశాడు. కానీ రెండో ఇన్నింగ్స్ అర్ధాంతరంగా ముగియడం భారత్‌కు అసంతృప్తిని మిగిల్చింది. ఆట రద్దును అంపైర్లు ప్రకటించడానికి గంట ముందు అంపైర్లతో కోహ్లి, రవిశాస్త్రి సుదీర్ఘంగా దీనిపై చర్చించారు. షెడ్యూల్ సమయం ప్రకారం అప్పటి నుంచి ఇంకా 31 ఓవర్లు మిగిలే ఉన్నాయి. ఆదివారం ఆట చూద్దామని వచ్చిన స్థానిక అభిమానులు కూడా తీవ్ర నిరాశ చెందారు. చిన్న చినుకు పడినా, లైట్లు అందుబాటులో ఉన్నా కూడా లైట్ మీటర్ రీడింగ్ కాస్త తక్కువ చూపించినా సరే ఆటను నిలిపివేయవచ్చనే ఐసీసీ నిబంధనపై కూడా వారు అసహనం వ్యక్తం చేశారు. మైదానంలో తమ మొబైల్ ఫోన్ లైట్‌లు ఆన్ చేసి తమ అసంతృప్తిని ప్రదర్శించారు.
వాతావరణం ఆడుకుంది...
ఊహించినట్లుగానే సిడ్నీ మ్యాచ్‌కు నాలుగో రోజు వాన అడ్డంకిగా మారింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు వర్షం, వెలుతురు లేమి అంతరాయం కలిగించడంతో ఆసీస్ తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 21.2 ఓవర్లు, రెండో ఇన్నింగ్స్‌లో 4 ఓవర్ల ఆట మాత్రమే జరిగింది. వర్షం తగ్గకపోవడంతో మొదటి సెషన్ ఆట పూర్తిగా తుడిచి పెట్టుకుపోయింది. మూడు గంటల తర్వాత ఎట్టకేలకు రెండో సెషన్‌లో కూడా నిర్ణీత సమయంకంటే ఆలస్యంగా మొదలు కాగా... టీ విరామానికి ఎనిమిది నిమిషాల ముందే తగిన వెలుతురు లేక ఆటగాళ్లు మైదానం వీడారు. ఆ తర్వాత మరో బంతి పడలేదు. అంపైర్లు సుదీర్ఘ సమయం పాటు వేచి చూస్తూ పదే పదే తనిఖీలు చేసినా లాభం లేకపోయింది. మరోసారి చినుకులు పడటంతో ఆదివారం ఆట రద్దయింది.
Comments
Please login to add a commentAdd a comment