
దుబాయ్: టోర్నీ ఏదైనా... ప్రత్యర్థి ఎవరైనా ఆధిపత్యం మాత్రం తమదేనని భారత కబడ్డీ జట్టు మరోసారి చాటింది. దుబాయ్ మాస్టర్స్ టోర్నీలో భాగంగా దాయాది పాకిస్తాన్‌తో శుక్రవారం జరిగిన ఆరంభ మ్యాచ్‌లో ప్రపంచ చాంపియన్ భారత్ 36–20తో గెలిచి టోర్నీలో శుభారంభం చేసింది. ఆద్యంతం ఆధిపత్యం చలాయించిన భారత్... తొలి అర్ధభాగం ముగిసే సరికి 22–9తో స్పష్టమైన ఆధిక్యంలో నిలిచింది.
ఆ తర్వాత కూడా అదే జోరు కొనసాగించి సునాయాస విజయం సొంతం చేసుకుంది. కెప్టెన్ అజయ్ ఠాకూర్ 15 రైడ్ పాయింట్లతో చెలరేగి ఒంటి చేత్తో జట్టును గెలిపించాడు. భారత్ తమ తదుపరి మ్యాచ్‌లో శనివారం కెన్యాతో తలపడనుంది.