
దుబాయ్: చిరకాల ప్రత్యర్థులు కూతకు సిద్ధమయ్యారు. దుబాయ్ వేదికగా ఈనెల 22 నుంచి 30 వరకు జరిగే ఆరు దేశాల కబడ్డీ మాస్టర్స్ టోర్నమెంట్‌లో భారత్, పాకిస్తాన్ జట్లు ఒకే గ్రూప్‌లో పోటీపడనున్నాయి. ఇందులో దాయాది జట్లతో పాటు కెన్యా గ్రూప్ ‘ఎ’లో ఉన్నాయి. గ్రూప్ ‘బి’లో ఇరాన్, కొరియా, అర్జెంటీనా జట్లు రౌండ్ రాబిన్ లీగ్‌లో తలపడతాయి. అంతర్జాతీయ కబడ్డీ సమాఖ్య, స్టార్ నెట్‌వర్క్‌లు ఉమ్మడిగా ఈ టోర్నీ నిర్వహిస్తున్నాయి. మ్యాచ్‌లను స్టార్ స్పోర్ట్స్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుంది.
తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 9 గంటలకు మొదలవుతుంది. 22న జరిగే టోర్నీ తొలి మ్యాచ్‌లో భారత్, పాకిస్తాన్ పోటీపడతాయి. ఒక్కో గ్రూప్ నుంచి తొలి రెండు స్థానాల్లో నిలిచిన జట్లు సెమీస్‌కు అర్హత సాధిస్తాయి. 29న సెమీస్, 30న ఫైనల్స్ జరుగుతాయి.