న్యూఢిల్లీ: ఇటీవల భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన సౌరవ్ గంగూలీ.. డే అండ్ నైట్ టెస్టులకు విపరీతమైన ఆసక్తికనబరుస్తున్నాడు. తాను అధ్యక్ష బాధ్యతలు ప్రారంభించిన మరుక్షణమే కెప్టెన్ విరాట్ కోహ్లితో డే అండ్ నైట్ టెస్టుల గురించి అభిప్రాయం అడిగి తెలుసుకున్నాడు. అందుకు కోహ్లి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో గంగూలీ తన కార్యచరణను ముమ్మరం చేశాడు. త్వరలో బంగ్లాదేశ్‌తో జరగబోయే ద్వైపాక్షిక సిరీస్‌లో ఒక టెస్టు మ్యాచ్‌ను డే అండ్ నైట్ టెస్టుగా నిర్వహించడానికి బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు(బీసీబీ)కి బీసీసీఐ లేఖ రాసింది.
అందుకు కోల్‌కతా ఈడెన్ గార్డెన్‌లో జరిగే టెస్టు మ్యాచ్‌ను డే అండ్ నైట్ మ్యాచ్‌గా నిర్వహించాలని చూస్తున్నామని, అందుకు అభిప్రాయం చెప్పాలంటూ బీసీబీని కోరింది. అయితే దీనిపై బీసీబీ నుంచి ఎటువంటి హామీ రాలేదు. ‘ మేము బీసీసీఐ నుంచి లేఖను అందుకున్నాం. మా భారత పర్యటనలో ఒక టెస్టు మ్యాచ్‌ను డే అండ్ నైట్‌గా నిర్వహించాలనే ప్రపోజల్ అది. దీనిపై ఆలోచిస్తున్నాం. ఇంకా ఎటువంటి చర్చలు జరపలేదు. మరో రెండు-మూడు రోజుల్లో మా నిర్ణయాన్ని బీసీసీఐకి తెలుపుతాం’ అని బీసీబీ క్రికెట్ ఆపరేషన్స్ చైర్మన్ అక్రమ్ ఖాన్ తెలిపారు. భారత్-బంగ్లాదేశ్‌ల టెస్టు సిరీస్‌కు ముందు టీ20 సిరీస్ జరుగనుంది. నవంబర్3వ తేదీ నుంచి ఇరు జట్ల మధ్య తొలి టీ20తో సిరీస్ ఆరంభం కానుంది.
Comments
Please login to add a commentAdd a comment