నాటింగ్‌హామ్: లాంఛనం ముగిసింది... పెద్దగా ఇబ్బంది పడకుండానే పని పూర్తయింది... నాలుగో రోజు 34 బంతుల పాటు విసిగించిన ఇంగ్లండ్ ఆఖరి జోడీని... బుధవారం 17 బంతుల్లోనే భారత్ విడదీసింది. మూడో టెస్టును 203 పరుగుల భారీ తేడాతో వశం చేసుకుంది. ఈ విజయంతో 1–2తో నిలిచి సిరీస్‌పై ఆశలు సజీవంగా ఉంచుకుంది. రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ రాణించిన భారత కెప్టెన్ విరాట్ కోహ్లి (97, 103)కి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ దక్కింది. నాలుగో టెస్టు ఈ నెల 30 నుంచి సౌతాంప్టన్‌లో జరుగనుంది. ఐదో రోజు వర్ష సూచనల నేపథ్యంలో టీమిండియా విజయానికి వరుణుడు అడ్డుపడతాడేమోనని కొంత ఆందోళన రేగినా అదేమీ ప్రతిబంధకం కాలే దు. ఆల్‌రౌండర్ పాండ్యా వేసిన తొలి ఓవర్‌ను ఓవర్‌నైట్ బ్యాట్స్‌మెన్ జేమ్స్ అండర్సన్ (11) మెయిడెన్ ఆడాడు. తర్వాత షమీ ఓవర్‌ను ఆదిల్ రషీద్ (33 నాటౌట్) ఎదుర్కొన్నాడు. అశ్విన్ వేసిన మూడో ఓవర్ ఐదో బంతికి అండర్సన్... స్లిప్‌లో రహానేకు క్యాచ్ ఇవ్వడంతో ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌కు 317 పరుగుల వద్ద తెరపడింది. క్రితం రోజు స్కోరుకు ఆతిథ్య జట్టు 6 పరుగులు మాత్రమే జత చేయగలిగింది. అంతా కలిపి 10 నిమిషాల్లో తేలిపోయింది.
కేరళ వరద బాధితులకు అంకితం
వరుసగా రెండు టెస్టులు ఓడేసరికి జనం మాపై నమ్మకం కోల్పోయారు. కానీ మాపై మేం నమ్మకం పెట్టుకున్నాం. 2–0 నుంచి 1–2గా మారిన ఈ గణాంకాలు దాని ఫలితమే. ఈ విజయాన్ని కేరళ వరద బాధితులకు అంకితం చేస్తున్నాం. వారికిది నిజంగా కష్టకాలమే. భారత జట్టుగా మేం వారికి ఇస్తున్న చిన్న ఊరట ఇది.
–కోహ్లి
►2 ఈ గెలుపుతో భారత్‌కు అత్యధిక టెస్టు విజయాలు అందించిన కెప్టెన్స్ జాబితాలో కోహ్లి (22 విజయాలు) రెండో స్థానానికి చేరాడు. గంగూలీ (21 టెస్టు విజయాలు) రికార్డును అతను అధిగమించాడు. ధోని (27 విజయాలు) టాప్ ర్యాంక్‌లో ఉన్నాడు.
సన్నాహాల్లో సచినంతటోడు
క్రికెట్ పట్ల దృక్పథంలో విరాట్ కోహ్లిని మించినవారు లేరు. ఆటపై అవగాహన, సన్నాహాలు, ప్రణాళికలు, వర్తమానంలో ఆలోచించడంలో అతడు సచిన్ టెండూల్కర్‌కు సరితూగుతాడు. ప్రస్తుత పేస్ బౌలింగ్ దళం భారత క్రికెట్ చరిత్రలోనే ఉత్తమమైనది. ఈ జట్టు ప్రపంచ పర్యాటక జట్లలోనే అత్యుత్తమం.
–భారత కోచ్ రవిశాస్త్రి
Comments
Please login to add a commentAdd a comment