సచిన్ నిష్ర్కమణ తర్వాత టీమిండియా తొలి టెస్ట్
జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాతో బుధవారమిక్కడ వాండరర్స్ మైదానంలో ప్రారంభమైన తొలి టెస్టులో భారత్ బ్యాటింగ్ ఎంచుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మరో ఆలోచన లేకుండా బ్యాటింగ్ తీసుకున్నాడు. యువ ఆటగాళ్లను సత్తాకు ఈ టెస్టు పరీక్షగా నిలిచింది. దాదాపు ఏడాది కాలంగా యువ నామస్మరణతో హోరెత్తున్న టీమిండియాకు విదేశీ గడ్డపై సిసలైన పరీక్ష ఎదుర్కొంటోంది.
ఇప్పటికే దక్షిణాఫ్రికాలో వన్డే సిరీస్ కోల్పోయిన ధోని సేన టెస్టు సిరీస్లోనైనా పరువు కాపాడుకోవాలని భావిస్తోంది. సీనియర్ పేసర్ జహీర్ ఖాన్ చాలా కాలం తర్వాత జట్టులోకి రావడంతో భారత్ ఆత్మవిశ్వాసం పెరిగింది. ద్రవిడ్ వారసుడిగా పేరు గాంచిన ఛతేశ్వర్ పూజారా, అజింక్య రహానే, ఇషాంత్ శర్మ, మురళీ విజయ్ జట్టులోకి వచ్చారు.
24 ఏళ్ల పాటు భారత క్రికెట్‌కు పర్యాయపదంగా నిలిచిన సచిన్ టెండూల్కర్ రిటైర్మెంట్ తర్వాత తొలి సారి టెస్టు మ్యాచ్ బరిలోకి దిగిన భారత జట్టు ఏ మేరకు రాణిస్తోందని క్రికెట్ అభిమానులు ఎదురుచూస్తున్నారు. కాగా, సొంత గడ్డపై జోరు కొనసాగించాలని దక్షిణాఫ్రికా పట్టుదలతో ఉంది.