
‘రెండు’లోనే ముగించాలని...
►సిరీస్ విజయంపై భారత్ కన్ను
►తీవ్ర ఒత్తిడిలో శ్రీలంక
►నేటి నుంచి రెండో టెస్టు
►తుది జట్టులోకి రాహుల్
కొద్ది రోజుల క్రితం టీమిండియా నంబర్‌వన్ టెస్టు జట్టు హోదాలోనే శ్రీలంకలో అడుగు పెట్టింది. భారత్ ఆటపై అపార నమ్మకం ఉన్నా... సొంతగడ్డపై శ్రీలంక మరీ ఇంత పేలవంగా ఆడి తలవంచుతుందని కూడా ఎవరూ ఊహించలేదు. కానీ తొలి టెస్టులో ఆ జట్టు ప్రదర్శన ఇరు జట్ల మధ్య అంతరాన్ని భారీగా పెంచేసింది. అద్భుత ఫామ్‌లో ఉన్న టీమిండియాను లంక ఇక ముందు కూడా ఆపే అవకాశం కనిపించడం లేదు. అదే జరిగితే వరుసగా రెండో పర్యటనలోనూ సిరీస్ భారత్ సొంతమవుతుంది. రెండేళ్ల క్రితం తొలి టెస్టులో ఓడి ఆ తర్వాత వరుసగా రెండు విజయాలతో భారత బృందం సిరీస్‌ను తమ ఖాతాలో వేసుకుంది. నాటితో పోలిస్తే ఇప్పుడు మన జట్టు మరింత పటిష్టంగా మారగా, శ్రీలంక జట్టు మాత్రం ఎన్నడూ లేనంత బలహీనంగా కనిపిస్తోంది. పైగా కీలక ఆటగాళ్లు గాయపడటంతో తుది జట్టును ఎంచుకునే విషయంలో కూడా లంక తర్జనభర్జన పడుతోంది. ఈ నేపథ్యంలో ఆతిథ్య జట్టు ప్రత్యర్థికి ఏమాత్రం పోటీ ఇస్తుందో చూడాలి.
కొలంబో: శ్రీలంకతో తొలి టెస్టులో ఘన విజయం సాధించిన భారత్ సిరీస్ విజయంపై దృష్టి పెట్టింది. నేటి నుంచి ఇక్కడి సింహళీస్ స్పోర్ట్స్ క్లబ్‌లో ఇరు జట్ల మధ్య రెండో టెస్టు జరగనుంది. తొలి మ్యాచ్‌లో భారత్ 304 పరుగుల తేడాతో గెలిచింది. అనారోగ్యం నుంచి కోలుకున్న శ్రీలంక కెప్టెన్ దినేశ్ చండిమాల్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగుతుండగా... భారత జట్టులోకి లోకేశ్ రాహుల్ రావడం ఖాయమైంది.
అందరూ ఫామ్‌లో...
గాలే టెస్టులో భారత జట్టు టాప్–5 బ్యాట్స్‌మెన్ అంతా కనీసం అర్ధ సెంచరీ అయినా సాధించారు. వీరిలో ధావన్, పుజారా, కోహ్లి సెంచరీలతో చెలరేగారు. ఈ మ్యాచ్‌లో భారత్ రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 840 పరుగులను అతి వేగంగా 4.5 రన్‌రేట్‌తో సాధించింది. కాబట్టి బ్యాటింగ్ విషయంలో టీమిండియా ఏ రకంగా కూడా ఆందోళన చెందాల్సిన పని లేదు. అయితే తుది జట్టులో ఒక కీలక మార్పు జరగనుంది. ఓపెనర్ ముకుంద్ స్థానంలో రాహుల్ బరిలోకి దిగుతున్నట్లు కోహ్లి ఇప్పటికే ప్రకటించాడు. ఆస్ట్రేలియాతో సిరీస్‌లో ఏడు ఇన్నింగ్స్‌లలో ఆరు అర్ధ సెంచరీలు చేసిన అనంతరం ఆటకు దూరమయ్యాడు. ఇప్పుడు అతని రాక జట్టు బలాన్ని మరింత పెంచనుంది. బౌలింగ్ విభాగంలో గత మ్యాచ్‌లో భారత జట్టులో అందరూ వికెట్లు తీశారు. హార్దిక్ పాండ్యా కూడా తన తొలి మ్యాచ్‌లోనే ఆల్‌రౌండ్ ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. అయితే పిచ్ స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో భారత్ మూడో స్పిన్నర్‌ను ఆడించే ఆలోచన ఉంది. కుల్దీప్ యాదవ్‌ను జట్టులోకి తీసుకుంటే పాండ్యా తప్పుకోవాల్సి రావచ్చు. ఓవరాల్‌గా దుర్భేద్యంగా కనిపిస్తున్న భారత్‌ను నిలువరించాలంటే లంక తీవ్రంగా శ్రమించాలి.
హెరాత్ ఆడతాడా?
తొలి టెస్టులో పరాజయంతో పాటు కీలక ఆటగాళ్ల గాయాలు లంక మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీశాయి. గాయం కారణంగా ప్రధాన బ్యాట్స్‌మన్ అసెలా గుణరత్నే తప్పుకోవడం జట్టును బలహీనం చేసింది. అతని స్థానంలో తిరిమన్నె లేదా ధనంజయ డి సిల్వా బరిలోకి దిగుతారు. హెరాత్ గాయంతో గత టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్‌కే రాలేదు. అతని ఫిట్‌నెస్‌పై ఇంకా స్పష్టత లేకపోయినా... ఆడాలని లంక కోరుకుంటోంది. శ్రీలంక కూడా ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగాలని భావిస్తోంది. మరో లెఫ్టార్మ్ స్పిన్నర్ మలింద పుష్పకుమారకు తొలి టెస్టు ఆడే అవకాశం లభించవచ్చు. మరోవైపు కెప్టెన్, కీలక బ్యాట్స్‌మన్ చండిమాల్ తిరిగి రావడం మాత్రం ఊరటనిచ్చే అంశం. తొలి టెస్టులో ఘోర పరాభవంతో అన్ని వైపుల నుంచి జట్టుపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో మెరుగైన ప్రదర్శన ఇవ్వాలని లంక పట్టుదలగా ఉంది.
పిచ్, వాతావరణం
తొలి టెస్టుతో పోలిస్తే ఇక్కడి పిచ్ పొడిగా ఉంది. రెండు రోజుల పాటు మంచి బ్యాటింగ్ చేయవచ్చు. మూడో రోజు నుంచి స్పిన్‌కు బాగా అనుకూలిస్తుంది. మ్యాచ్ జరిగే రోజుల్లో చిరుజల్లులకు అవకాశం ఉంది.
► 31 ఈ మ్యాచ్‌తో భారత్ తరఫున కనీసం 50 టెస్టులు ఆడిన 31వ క్రికెటర్‌గా పుజారా గుర్తింపు పొందనున్నాడు
►28 రాహుల్ తుది జట్టులోకి వస్తే కెప్టెన్‌గా తుది జట్టు విషయంలో కోహ్లి తన ప్రత్యేకతను మరోసారి నిలబెట్టుకున్నట్లవుతుంది.
►వరుసగా 27 టెస్టుల్లో కనీసం ఒక్క ఆటగాడినైనా మార్చిన కోహ్లి... 28వ టెస్టులోనూ దానిని కొనసాగించనున్నాడు.
తుది జట్ల వివరాలు (అంచనా)
భారత్: కోహ్లి (కెప్టెన్), ధావన్, రాహుల్, పుజారా, రహానే, అశ్విన్, సాహా, జడేజా, పాండ్యా/కుల్దీప్, ఉమేశ్, షమీ.
శ్రీలంక: చండిమాల్ (కెప్టెన్), తరంగ, కరుణరత్నే, కుషాల్ మెండిస్, మాథ్యూస్, డిక్‌వెలా, ధనంజయ, పెరీరా, హెరాత్, పుష్పకుమార, ప్రదీప్.
►ఉదయం గం. 10.00 నుంచి సోనీ సిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం