ఉత్సాహంలో ధోని బృందం (ఫైల్)
మ.గం. 2.00 నుంచి
టెన్ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారం
తొలి టెస్టు ప్రదర్శన తర్వాత భారత జట్టులో ఆత్మ విశ్వాసం ఒక్కసారిగా పెరిగింది. జట్టు బ్యాట్స్‌మెన్ అంతా అద్భుత ఫామ్‌లో ఉన్నారు. ప్రత్యర్థి స్టార్ బౌలర్లు చేతులెత్తేసిన చోట భారత పేసర్లు బాగా రాణించారు. బౌన్స్ ఉండే డర్బన్ పిచ్‌పై కూడా ఇదే జోరు కొనసాగించాలని వారు భావిస్తున్నారు. పిచ్ స్పిన్‌కు కూడా అనుకూలించే అవకాశం ఉండటం మరో బలం.
మరోవైపు మొదటి మ్యాచ్ దక్షిణాఫ్రికాకు షాక్ ఇచ్చింది. ఒక ఉపఖండపు జట్టుకు సిరీస్ కోల్పోకూడదంటే రెండో టెస్టులో కచ్చితంగా గెలవాల్సిన ఒత్తిడి. ఫామ్‌లో లేని ప్రధాన పేసర్, గాయంతో మరో కీలక బౌలర్ ఆడతాడో లేదో చెప్పలేని పరిస్థితి... నాణ్యమైన స్పిన్నర్‌లేమి... మైదానంలో గత రికార్డు అంతా ప్రతికూలం. ఇలా సొంతగడ్డపైనే ఆ జట్టు ఎదురుగా సవాల్ నిలిచింది.
డర్బన్: దక్షిణాఫ్రికా గడ్డపై తొలిసారి సిరీస్ నెగ్గి చరిత్ర సృష్టించే అవకాశం భారత్ ముందు నిలిచింది. తొలి టెస్టులో అద్భుత ప్రదర్శనతో దక్షిణాఫ్రికాను ఒత్తిడిలోకి నెట్టిన టీమిండియా అదే జోరు కొనసాగిస్తే చిరస్మరణీయ విజయం దక్కుతుంది. సిరీస్‌కు ముందు పెద్దగా ఆశలు లేని భారత్ ఒక్కసారిగా చెలరేగడంతో ఇప్పుడు సమీకరణాలు మారిపోయాయి. ఈ నేపథ్యంలో ఇక్కడి కింగ్స్‌మీడ్ మైదానంలో గురువారం నుంచి ఇరు జట్ల మధ్య రెండో, చివరి టెస్టు మ్యాచ్ జరగనుంది. భారత జట్టు అన్ని రంగాల్లో పటిష్టంగా కనిపిస్తుండగా, నంబర్‌వన్ హోదాకు తగ్గ ప్రదర్శన కనబరిస్తే సఫారీలకు కూడా మ్యాచ్‌పై పట్టు చిక్కవచ్చు. గత మ్యాచ్ హోరాహోరీగా సాగడంతో ఈ ‘బాక్సింగ్ డే’ టెస్టుపై ఒక్కసారిగా ఆసక్తి పెరిగింది.
జోరు కొనసాగిస్తారా...
జొహన్నెస్‌బర్గ్ టెస్టులో భారత జట్టు బ్యాటింగ్ ప్రదర్శన ఆకట్టుకుంది. ముఖ్యంగా పుజారా, కోహ్లిల బ్యాటింగ్ పదును ఏమిటో తెలిసింది. భారీగా పరుగులు చేయకపోయినా విజయ్ ఓపెనర్‌గా తన పాత్రను చక్కగా పోషించాడు. తనకు లభించిన అవకాశాన్ని రహానే కూడా ఉపయోగించుకున్నట్లే లెక్క. ముఖ్యంగా అతను మ్యాచ్‌ను మలుపు తిప్పిన రెండు రనౌట్లతో తన ఫీల్డింగ్ సత్తాను కూడా బయటపెట్టాడు. అయితే రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ మాత్రం ఆశించిన స్థాయిలో ఆడలేదు.
ఈ మ్యాచ్‌లో వారు కూడా రాణిస్తే బ్యాటింగ్‌కు తిరుగుండదు. బౌలింగ్‌లో చాలా కాలం తర్వాత జహీర్ ఖాన్ తన విలువేమిటో చూపించాడు. తాను చక్కటి స్పెల్స్ వేయడమే కాకుండా యువ బౌలర్లు ఇషాంత్, షమీలకు మార్గదర్శిగా నిలిచాడు. ఇషాంత్ వేగంతో ఆకట్టుకోగా, షమీ నిలకడ ప్రదర్శించాడు. స్పిన్నర్‌గా అశ్విన్ వైఫల్యం ఒక్కటే భారత్‌ను ఇబ్బంది పెట్టింది.
అయితే కింగ్స్‌మీడ్ మైదానం కొంత వరకు స్పిన్‌కు అనుకూలించే అవకాశం ఉండటంతో పాటు నాలుగు, ఐదు రోజుల్లో మరీ నెమ్మదించవచ్చు. ఇక్కడ జరిగిన గత ఐదు టెస్టుల్లో స్పిన్నర్లు 41 వికెట్లు పడగొట్టారు. ఇది అశ్విన్‌లో ఆశలు రేపుతోంది. గత మ్యాచ్ ప్రదర్శన చూస్తే అశ్విన్ స్థానంలో రవీంద్ర జడేజా లేదా మరో పేసర్‌గా ఉమేశ్ యాదవ్‌కు స్థానం దక్కవచ్చని అనిపించింది. కానీ డర్బన్ వికెట్‌ను బట్టి భారత తుది జట్టులో మార్పులు ఉండకపోవచ్చు. గత పర్యటనలో ధోని సేన ఇక్కడే టెస్టు మ్యాచ్ నెగ్గడం జట్టు సభ్యులలో స్ఫూర్తి నింపుతోంది. ఆ మ్యాచ్‌లో హర్భజన్ (6/80) ప్రదర్శన ఈ పిచ్ గురించి చెబుతుంది.
రికార్డు మారుస్తారా...
కింగ్స్‌మీడ్ మైదానం దక్షిణాఫ్రికాకు అంతగా అచ్చి రాలేదు. ఆ జట్టు ఆఖరి సారిగా ఇక్కడ ఆరేళ్ల క్రితం టెస్టు గెలిచింది. ఇక్కడ గత నాలుగు టెస్టుల్లో ఆ జట్టు ఓటమి పాలైంది. ఆ మ్యాచుల్లో దక్షిణాఫ్రికా కోల్పోయిన 80 వికెట్లలో 21 స్పిన్నర్లే పడగొట్టారు. జొహన్నెస్‌బర్గ్‌లో టెస్టును కాపాడుకున్న సఫారీలు సిరీస్ కోల్పోకూడదంటే ఈ మ్యాచ్‌లో మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. తొలి టెస్టు రెండు ఇన్నింగ్స్‌లలోనూ స్మిత్ రాణించాడు. వరుసగా విఫలమవుతూ వచ్చిన అల్విరో పీటర్సన్ గత ఇన్నింగ్స్ ప్రదర్శనతో స్థానం నిలబెట్టుకున్నాడు. ఇటీవల ఫామ్‌లో ఉన్న ఆమ్లా రెండు ఇన్నింగ్స్‌లలో అనూహ్య రీతిలో అవుట య్యాడు. ఈసారి అతను తన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఉంది. ఇక ఆల్‌రౌండర్ కలిస్ తన ఆఖరి టెస్టును చిరస్మరణీయం చేసుకునేందుకు అద్భుత ప్రదర్శన కనబర్చాల్సి ఉంది. ఈ మైదానంలో కలిస్ నాలుగు సెంచరీలు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్ ఆర్డర్‌లో డివిలియర్స్, డు ప్లెసిస్ సత్తా ఏమిటి గత మ్యాచ్‌లో తేలింది.
అయితే డుమిని వైఫల్యమే జట్టుకు ఇబ్బందిగా మారింది. స్టెయిన్ తన కెరీర్‌లో చెత్త ప్రదర్శనల్లో ఒకదానిని గత మ్యాచ్‌లో నమోదు చేశాడు. స్టెయిన్ విఫలమైనా ఫిలాండర్ మాత్రం చక్కగా బౌలింగ్ చేశాడు. గాయం నుంచి మోర్నీ మోర్కెల్ వేగంగా కోలుకున్నాడు. అతడిపై తుది నిర్ణయం మ్యాచ్‌కు ముందే తీసుకునే అవకాశం ఉన్నా... ప్రస్తుతానికి మాత్రం అతను ఆడటం దాదాపు ఖాయమైనట్లే. దక్షిణాఫ్రికా పెద్ద సమస్య స్పిన్నర్ ఇమ్రాన్ తాహిర్. అతడు భారత్‌పై ఏ మాత్రం ప్రభావం చూపలేడని తేలిపోయింది. అతని స్థానంలో లెఫ్టార్మ్ స్పిన్నర్ రాబిన్ పీటర్సన్ రావచ్చు. తమ దిగ్గజ ఆటగాడు జాక్ కలిస్‌కు విజయంతో వీడ్కోలు ఇవ్వాలని దక్షిణాఫ్రికా భావిస్తోంది.
జట్ల వివరాలు (అంచనా):
భారత్: ధోని (కెప్టెన్), శిఖర్ ధావన్, మురళీ విజయ్, పుజారా, కోహ్లి, రోహిత్ శర్మ, రహానే, అశ్విన్, జహీర్, ఇషాంత్ శర్మ, షమీ.
దక్షిణాఫ్రికా: స్మిత్ (కెప్టెన్), అల్విరో పీటర్సన్, ఆమ్లా, కలిస్, డివిలియర్స్, డుమిని, డు ప్లెసిస్, స్టెయిన్, ఫిలాండర్, మోర్కెల్, తాహిర్/రాబిన్ పీటర్సన్.
13 కింగ్స్‌మీడ్‌లో దక్షిణాఫ్రికా 39 టెస్టులు ఆడితే 13 గెలిచి, 13 ఓడింది. మరో 13 డ్రా అయ్యాయి. భారత్ 4 టెస్టులు ఆడి 1 గెలిచి 2 ఓడింది, 1 మ్యాచ్ డ్రాగా ముగిసింది.
1 మరో వికెట్ తీస్తే భారత పేస్ బౌలర్ ఇషాంత్ 150 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు.
47 దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ ఆమ్లా మరో 47 పరుగులు సాధిస్తే టెస్టు కెరీర్‌లో ఆరు వేల పరుగులు పూర్తి చేసుకుంటాడు.
120 డర్బన్ మైదానంలో జరిగిన చివరి ఐదు టెస్టుల్లో పేస్ బౌలర్లు తీసిన వికెట్ల సంఖ్య
దక్షిణాఫ్రికా గత ఐదేళ్లలో టెస్టుల్లో ఒక్క సిరీస్ కూడా ఓడిపోలేదు. ఉపఖండానికి చెందిన ఏ జట్టూ సఫారీ నేలపై టెస్టు సిరీస్ నెగ్గలేదు.
ఆ మ్యాచ్...
దక్షిణాఫ్రికా గడ్డపై భారత్ ఇప్పటి వరకు 2 టెస్టులు గెలిస్తే అందులో ఒకటి ఇదే మైదానంలో వచ్చింది. 2010-11 సిరీస్‌లో భారత్ 87 పరుగులతో సఫారీలను చిత్తు చేసింది. టాస్ ఓడిన భారత్ ముందుగా బ్యాటింగ్ చేసి తొలి ఇన్నింగ్స్‌లో 205 పరుగులకే పరిమితమైంది. లక్ష్మణ్ (38) టాప్ స్కోరర్ కాగా, స్టెయిన్ (6/50) చెలరేగాడు. ఆ తర్వాత హర్భజన్ (4/10), జహీర్ (3/36) చెలరేగడంతో దక్షిణాఫ్రికా 131 పరుగులకే కుప్పకూలింది. లక్ష్మణ్ (96) బ్యాటింగ్‌తో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో 228 పరుగులు చేసింది. 303 లక్ష్యంతో బరిలోకి దిగిన సఫారీలు 215 పరుగులకే కుప్పకూలారు. శ్రీశాంత్ (3/45), జహీర్ (3/57) రాణించారు.
తొలి టెస్టులో మా బ్యాటింగ్, బౌలింగ్ చాలా బాగున్నాయి. ఆ ప్రదర్శనతో మాలో ఆత్మ విశ్వాసం పెరిగింది. దానినే పునరావృతం చేస్తే డర్బన్ టెస్టులో మేం విజయం సాధించగలం’
- పుజారా, భారత బ్యాట్స్‌వ
‘కింగ్స్‌మీడ్‌లో మా రికార్డు బాగా లేదు. అయితే ఈ సారి దానిని మార్చాలని భావిస్తున్నాం. పిచ్‌లో ప్రతి రోజూ మార్పులు రావడమే ఇక్కడ సమస్య. ఒక మంచి భాగస్వామ్యంతో దానిని అధిగమించగలిగితే సమస్యే రాదు. ఈ సారి భారత బౌలర్లను సమర్థంగా ఎదుర్కొంటాం’
- గ్రేమ్ స్మిత్, దక్షిణాఫ్రికా కెప్టెన్