యూఎస్లో రెండు టీ 20లు..
ముంబై: అమెరికాలో క్రికెట్ పై ఆదరణను మరింత పెంచేందుకు భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు(బీసీసీఐ) సిద్ధమైంది. యూఎస్లో రెండు అంతర్జాతీయ టీ 20లు నిర్వహించడానికి రంగం సిద్ధం చేసినట్టు బీసీసీఐ తాజా ప్రకటనలో స్పష్టం చేసింది. ఈ నెల 27, 28 తేదీల్లో ఫ్లోరిడాలోని సెంట్రల్ బ్రావార్డ్ రీజినల్ పార్క్లో వెస్టిండీస్-భారత్ క్రికెట్ జట్ల మధ్య రెండు టీ 20లను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ప్రస్తుతం అమెరికాలో క్రికెట్కు ప్రజాదరణ మెండుగా ఉండటంతో అక్కడ మ్యాచ్లు జరపడానికి నిశ్చయించినట్లు బీసీసీఐ అధ్యక్షుడు అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. యూఎస్ లో టీ 20 చాంపియన్ వెస్టిండీస్తో మ్యాచ్లు నిర్వహించే ప్రకటనను వెల్లడించడం చాలా సంతోషంగా ఉందని అనురాగ్ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
'అమెరికాలో ఉన్న క్రికెట్ అభిమానులకు అక్కడే మ్యాచ్లను స్వయంగా వీక్షించే అవకాశం రావడం నిజంగా గొప్ప అవకాశం. యూఎస్లో మరిన్ని వార్షిక క్రికెట్ ఈవెంట్స్ జరగడానికి ఈ రెండు మ్యాచ్ ల సిరీస్ కచ్చితంగా దోహదం చేస్తుంది' అని అనురాగ్ తెలిపారు. మరోవైపు బీసీసీఐ సెక్రటరీ అజయ్ షిర్కే మాట్లాడుతూ.. ప్రపంచంలో అభిమానులకు ఈ గేమ్ను మరింత చేరువగా చేర్చడమే తమ ఉద్దేశమన్నారు. వెస్టిండీస్ క్రికెట్ బోర్డుతో చర్చించిన తరువాత యూఎస్లో క్రికెట్ మ్యాచ్లను జరపడానికి సిద్దమైనట్లు షిర్కే పేర్కొన్నారు.