
కరువు తీరే సమయం!
మ. గం. 3.00 నుంచి
స్టార్ స్పోర్ట్స్ 1, దూరదర్శన్‌లలో ప్రత్యక్ష ప్రసారం
24 ఏళ్ల తర్వాత సిరీస్ విజయానికి చేరువలో భారత్
నేడు ఇంగ్లండ్‌తో నాలుగో వన్డే
జోరు మీదున్న ధోని సేన
తీవ్ర ఒత్తిడిలో కుక్ బృందం
రెండు పుష్కరాలుగా భారత క్రికెట్ అభిమాని కోరిక... ఎంతోమంది దిగ్గజాలకు అంద ని ఫలితం... గొప్ప సారథులకూ దక్కని ఘనత... వీటన్నింటినీ అందుకునే అవకాశం ధోనిసేనకు లభించింది. 24 ఏళ్లుగా ఇంగ్లండ్ గడ్డపై భారత్ ఒక్క వన్డే సిరీస్ కూడా గెలవలేదు. ఈసారి మరో రెండు మ్యాచ్‌లు మిగిలుండగానే.. 2-0 ఆధిక్యంలో ఉన్న ధోనిసేన... ఇక రెండింట్లో ఒక్కటి గెలిచినా చాలు. అయితే ఆఖరి మ్యాచ్‌లో ఒత్తిడిని ఎదుర్కొనేకంటే... నాలుగో వన్డేలో గెలిచి కల సాకారం చేసుకుంటేనే మేలు.
బర్మింగ్‌హామ్: వన్డే ప్రపంచ చాంపియన్ భారత్ ఈ ఫార్మాట్‌లో తమ సత్తా ఏమిటో ఇప్పటికే ఇంగ్లండ్‌కు రుచి చూపించింది. ఇదే ఉత్సాహంతో సిరీస్‌ను సొంతం చేసుకోవాలని ధోని సేన పట్టుదలగా ఉంది. మరో వైపు ఇంకా ఇంగ్లండ్ జట్టు టెస్టు మైకం నుంచి బయటపడినట్లు లేదు. సాంప్రదాయ శైలితోనే ఆడబోతూ గత రెండు మ్యాచ్‌ల్లో ఏ దశలోనూ ఆ జట్టు భారత్‌కు పోటీ ఇవ్వలేకపోయింది. ఈ నేపథ్యంలో నేడు (మంగళవారం) ఇక్కడి ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో ఇరు జట్ల మధ్య నాలుగో వన్డే జరగనుంది. సిరీస్‌లో రెండు వన్డేలు నెగ్గిన భారత్, ఈ మ్యాచ్ గెలిస్తే మరో వన్డే మిగిలుండగానే 3-0తో సిరీస్‌ను గెలుచుకుంటుంది.
విజయ్‌కి అవకాశం ఇస్తారా!
ఐసీసీ ర్యాంకింగ్స్‌లో మరోసారి నంబర్‌వన్‌గా నిలవడం నాలుగో వన్డేకు ముందు భారత్‌కు స్ఫూర్తినిచ్చే మరో అంశం. గత రెండు మ్యాచ్‌ల ప్రదర్శనను బట్టి చూస్తే భారత జట్టు చాలా పటిష్టంగా కనిపిస్తోంది. అటు బ్యాటింగ్, ఇటు బౌలింగ్‌తో పాటు ఫీల్డింగ్‌లో కూడా మన కుర్రాళ్లు చెలరేగిపోతున్నారు. ఓపెనర్‌గా రహానే గత వన్డేలో ఆకట్టుకున్నాడు. కోహ్లి, రైనా, రాయుడు, ధోనిలతో మిడిలార్డర్ పటిష్టంగా ఉండగా, ఆ తర్వాత ఆల్‌రౌండర్లు జడేజా, అశ్విన్‌లు ఉన్నారు. బౌలింగ్‌లో కూడా పేసర్లు భువనేశ్వర్, షమీ ప్రధాన పాత్ర పోషిస్తుండగా...మూడో వన్డేలో గాయపడిన మోహిత్ ఫిట్‌గా లేకపోతే ఉమేశ్‌కు అవకాశం ఇవ్వవచ్చు. సాధారణంగా వరుస విజయాల సమయంలో టీమిండియా తుది జట్టులో మార్పులు జరగవు. అయితే గాయపడిన ఓపెనర్ రోహిత్ శర్మ స్థానంలో మురళీ విజయ్‌ని హడావిడిగా భారత్‌నుంచి పిలిపించారు. ప్రపంచ కప్‌కు ముందు అందుబాటులో ఉన్న ప్రత్యామ్నాయాలను పరిశీలించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. కాబట్టి వరుసగా విఫలమవుతున్న శిఖర్ ధావన్ స్థానంలో విజయ్‌ని ఓపెనర్‌గా పరీక్షించే అవకాశం లేకపోలేదు.
అన్నీ కష్టాలే!
మరో వైపు ఇంగ్లండ్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉంది. గత 20 వన్డేల్లో ఆ జట్టు 12 ఓడింది. ఆ జట్టు ఆటగాళ్లలో ఒకరిద్దరు మినహా మిగతా వారెవరూ వన్డే ఫార్మాట్‌కు అనుగుణంగా తమను తాము మలచుకోలేకపోతున్నారు. ఓపెనర్‌గా హేల్స్ సత్తా చాటుతుండగా...మరో ఓపెనర్ కుక్ బ్యాటింగ్ అంతంత మాత్రంగానే ఉంది. టెస్టు సిరీస్‌లో తన నాయకత్వంపై విమర్శలు వచ్చిన సమయంలో 3-1తో సిరీస్ నెగ్గి సమాధానమిచ్చిన కుక్... ఇప్పుడు వన్డే సిరీస్ కోల్పోకూడదంటే తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అసలు భారత బ్యాటింగ్‌ను అడ్డుకునే బౌలింగ్ కానీ...భారత స్పిన్‌ను ఎదుర్కొనే సత్తా గానీ ఇంగ్లండ్‌కు లేనట్టే కనిపిస్తోంది.
వన్డే స్పెషలిస్ట్ మోర్గాన్ కూడా పెద్దగా ప్రభావం చూపలేకపోగా...కీపర్ బట్లర్ మాత్రం మంచి ఫామ్‌లో ఉన్నాడు. ఇక ఆ జట్టు బౌలింగ్ అయితే మరీ నాసిరకంగా ఉంది. ఒక్కరు కూడా భారత బ్యాట్స్‌మెన్‌కు పగ్గాలు వేయలేకపోతున్నారు. ఈ మ్యాచ్‌లో ఆల్‌రౌండర్ స్టోక్స్ స్థానంలో మరో స్పిన్నర్‌గా మొయిన్ అలీ జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. సిరీస్ గెలిచే అవకాశం ఎలాగూ లేకపోయినా, ఓడిపోకుండా ఉండాలంటే ఇంగ్లండ్ ఈ మ్యాచ్ నెగ్గడం తప్పనిసరి.
జట్ల వివరాలు (అంచనా):
భారత్: ధోని (కెప్టెన్), ధావన్/విజయ్, రహానే, కోహ్లి, రైనా, రాయుడు, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, షమీ, మోహిత్.
ఇంగ్లండ్: కుక్ (కెప్టెన్), హేల్స్, బెల్/బాలెన్స్, రూట్, మోర్గాన్, బట్లర్, వోక్స్, అలీ, ట్రెడ్‌వెల్, ఫిన్, అండర్సన్.
పిచ్
వాతావరణం
సాధారణంగా ఇక్కడి వికెట్ స్లోగా ఉండి స్పిన్నర్లకు అనుకూలిస్తుంది. ఇంగ్లండ్‌తో గత సిరీస్‌లో శ్రీలంక దీనిని సమర్థంగా వాడుకుంది. అయితే భారత్ దీనిని అనుకూలంగా మార్చుకోకూడదని భావిస్తున్న ఇంగ్లండ్... పిచ్‌పై కొంత గడ్డి ఉంచాలని కోరుతోంది. వాతావరణం అంతా బాగుంది. ఎలాంటి వర్ష సూచన లేదు. టికెట్ల అమ్మకం కూడా భారీగా సాగింది. పూర్తి మ్యాచ్ జరిగే అవకాశం ఉంది.
4 ఇక్కడ ఆడిన 7 మ్యాచుల్లో భారత్ 4 గెలిచింది.
1 మరో మ్యాచ్ గెలిస్తే అజహర్ (90)ను దాటి అత్యధిక వన్డే విజయాలు అందించిన భారత కెప్టెన్‌గా (91) ధోని నిలుస్తాడు.