
ఎన్నాళ్లకెన్నేళ్లకు..!
24 సంవత్సరాల తర్వాత ఇంగ్లండ్‌లో వన్డే సిరీస్ గెలిచిన భారత్
నాలుగో వన్డేలోనూ ధోనిసేన ఘన విజయం
3-0తో సిరీస్ కైవసం
శుక్రవారం ఆఖరి వన్డే
టెస్టుల్లో బంతిని ముట్టుకోవడానికి భయపడిన కుర్రాళ్లు.. వన్డేల్లో ఆ బంతినే వెంటాడి వెంటాడి బాదారు.ఘోర పరాభవాన్ని చవి చూసిన గడ్డపై... అదే ప్రత్యర్థిని కోలుకోలేని దెబ్బ కొట్టారు. అవమానంతో మౌనముద్ర దాల్చిన వాళ్లే... రొమ్మువిరిచి బెబ్బులిలా గర్జించారు. నాణ్యమైన ఆటతీరుకు సమష్టి మంత్రాన్ని జోడించి... దిగ్గజాలకూ సాధ్యంకాని ఘనతను సొంతం చేసుకున్నారు.రెండు పుష్కరాలుగా బ్రిటిష్ గడ్డపై ఊరిస్తున్న వన్డే సిరీస్ విజయాన్ని... మరో మ్యాచ్ మిగిలుండగానే సాధించారు.మంచినీళ్ల ప్రాయంగా పరుగులతో హోరెత్తించి... ఏకపక్ష విజయాలతో భవిష్యత్‌కు భరోసా ఇచ్చారు.
బర్మింగ్‌హామ్: ధావన్ (81 బంతుల్లో 97 నాటౌట్; 11 ఫోర్లు, 4 సిక్సర్లు) మీసం మెలేశాడు... తన బ్యాట్ పవరేంటో చూపడానికి... రహానే (100 బంతుల్లో 106; 10 ఫోర్లు, 4 సిక్సర్లు) శతకంతో గర్జించాడు... ఇంగ్లండ్ గడ్డపై ధోనిసేనకు ఈ విజయం ఎంత కీలకమో చెప్పడానికి... ఓవరాల్‌గా ఒకే ఒక్క మ్యాచ్... భారత జట్టులో చాలా సమస్యలకు పరిష్కారం చూపింది. ఇంగ్లండ్ టూర్ మొదలైనప్పట్నించీ కనీసం 50 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేయలేకపోయిన ఓపెనర్లు ఈ మ్యాచ్‌లో ఏకంగా 183 పరుగులు జోడించారు. అంటే ఓపెనింగ్ సమస్యకు పరిష్కారం చూపారు.
ఊరించే వికెట్‌పై ఇంగ్లండ్‌ను కట్టడి చేస్తూ... బౌన్సీ వికెట్లపై రాణించలేరనే అపవాదును తొలగించుకున్నారు బౌలర్లు. రైనా, రాయుడు రాణించడంతో రిజర్వ్ బెంచ్ సత్తా ఏంటో చూపెట్టారు. ఫలితంగా నాలుగో వన్డేలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన భారత్ 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ను చిత్తు చేసింది. దీంతో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌ను మరో వన్డే మిగిలి ఉండగానే 3-0తో కైవసం చేసుకుంది.
ఎడ్జ్‌బాస్టన్ మైదానంలో మంగళవారం జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 49.3 ఓవర్లలో 206 పరుగులకు ఆలౌటైంది. మొయిన్ అలీ (50 బంతుల్లో 67; 4 ఫోర్లు, 3 సిక్సర్లు), రూట్ (81 బంతుల్లో 44; 2 ఫోర్లు), మోర్గాన్ (58 బంతుల్లో 32; 3 ఫోర్లు)లు రాణించారు. ఓ దశలో 23 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన కుక్ సేనను రూట్, మోర్గాన్‌లు నాలుగో వికెట్‌కు 80 పరుగులు జోడించి ఆదుకున్నారు. అయితే ఈ ఇద్దరు కూడా 11 పరుగుల వ్యవధిలో అవుట్ కావడంతో ఇంగ్లండ్ 114 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి మరోసారి కష్టాల్లో పడింది. కానీ చివర్లో అలీ భారీ షాట్లతో రెండు కీలక భాగస్వామ్యాలతో చెలరేగాడు.
షమీ 3, భువనేశ్వర్, జడేజా చెరో రెండు వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ 30.3 ఓవర్లలో వికెట్ నష్టానికి 212 పరుగులు చేసి గెలిచింది. ఆరంభంలో కుదురుకోవడానికి కాస్త సమయం తీసుకున్న ధావన్ నెమ్మదిగా బ్యాట్ ఝుళిపించాడు. అండర్సన్ వేసిన ఐదో ఓవర్‌లో నాలుగు బౌండరీలు కొట్టి టచ్‌లోకి వచ్చాడు. రెండో ఎండ్‌లో రహానే కూడా చెలరేగాడు.
ఈ ఇద్దరు క్రమంగా జోరు పెంచడంతో పరుగుల వరద పారింది. ఈ జోడిని విడదీయడానికి ఇంగ్లండ్ బౌలర్లు ఎన్ని ప్రయత్నాలు చేసిన ఫలించలేదు. చివరకు కెరీర్‌లో తొలి సెంచరీ చేసిన రహానేను గుర్నీ అవుట్ చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఇద్దరు తొలి వికెట్‌కు 183 పరుగులు జోడించారు. తర్వాత కోహ్లి (1 నాటౌట్)తో కలిసి ధావన్ జట్టును విజయతీరాలకు చేర్చాడు. రహానేకు ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఇరుజట్ల మధ్య ఆఖరి వన్డే లీడ్స్‌లో శుక్రవారం జరుగుతుంది.
స్కోరు వివరాలు: ఇంగ్లండ్ ఇన్నింగ్స్: కుక్ (సి) రైనా (బి) భువనేశ్వర్ 9; హేల్స్ (బి) భువనేశ్వర్ 6; బ్యాలెన్స్ (సి) రహానే (బి) షమీ 7; రూట్ (సి) కులకర్ణీ (బి) రైనా 44; మోర్గాన్ (సి) రైనా (బి) జడేజా 32; బట్లర్ ఎల్బీడబ్ల్యు (బి) షమీ 11; అలీ (బి) అశ్విన్ 67; వోక్స్ రనౌట్ 10; ఫిన్ (బి) జడేజా 2; అండర్సన్ నాటౌట్ 1; గుర్నీ (బి) షమీ 3; ఎక్స్‌ట్రాలు 14; మొత్తం: (49.3 ఓవర్లలో ఆలౌట్) 206.
వికెట్ల పతనం: 1-15; 2-16; 3-23; 4-103; 5-114; 6-164; 7-194; 8-201; 9-202; 10-206
బౌలింగ్: భువనేశ్వర్ 8-3-14-2; ధావల్ కులకర్ణీ 7-0-35-0; షమీ 7.3-1-28-3; అశ్విన్ 10-0-48-1; జడేజా 10-0-40-2; రైనా 7-0-36-1.
భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) కుక్ (బి) గుర్నీ 106; ధావన్ నాటౌట్ 97; కోహ్లి నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు 8; మొత్తం: (30.3 ఓవర్లలో వికెట్ నష్టానికి) 212.
వికెట్ల పతనం: 1-183
బౌలింగ్: అండర్సన్ 6-1-38-0; గుర్నీ 6.3-0-51-1; ఫిన్ 7-0-38-0; వోక్స్ 4-0-40-0; అలీ 7-0-40-0.
1 వన్డేల్లో భారత్‌కు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్‌గా ధోని (91) అగ్రస్థానంలో నిలిచాడు. అతని నాయకత్వంలో భారత్ 162 వన్డేల్లో 91 గెలిచి 57 ఓడింది. ప్రస్తుత అంతర్జాతీయ కెప్టెన్లలో మూడు ఫార్మాట్లలోనూ (టెస్టు 27, వన్డే 91, టి20 27) తన జట్టుకు అత్యధిక విజయాలు అందించిన కెప్టెన్ ధోని ఒక్కడే.
1 33 వన్డేల్లో రహానేకు ఇది తొలి సెంచరీ
2 ఇంగ్లండ్ పర్యటనలో టెస్టులు, వన్డేల్లో సెంచరీ చేసిన రెండో భారత ఆటగాడు రహానే. 2002లో సచిన్ మాత్రమే దీనిని సాధించాడు.
50 ఇంగ్లండ్‌పై ఇది భారత్‌కు 50వ వన్డే విజయం
1 200కు పైగా లక్ష్యం ఉన్నప్పుడు 117 బంతుల ముందే ఛేదించడం భారత్‌కు ఇదే తొలిసారి.
తొలి మ్యాచ్‌తో పోలిస్తే ఇందులో మా ప్రదర్శన చాలా మెరుగుపడింది. ధావన్ ఫామ్‌లోకి వచ్చాడు. ఓపెనింగ్‌కు రహానే చక్కగా సరిపోతాడు. అయితే రోహిత్‌లో కూడా అపార నైపుణ్యం ఉంది.
- ధోని (భారత కెప్టెన్)