పరుగు సాగాలి... | India v New Zealand, 2nd ODI: Rohit Sharma's 150th ODI | Sakshi
Sakshi News home page

పరుగు సాగాలి...

Published Thu, Oct 20 2016 12:13 AM | Last Updated on Mon, Sep 4 2017 5:42 PM

పరుగు సాగాలి...

పరుగు సాగాలి...

న్యూజిలాండ్‌తో రెండో వన్డే నేడు
 మరో విజయంపై భారత్ గురి
 

 
 కోహ్లి సారథ్యంలోని టెస్టు జట్టు న్యూజిలాండ్ ను క్లీన్‌స్వీప్ చేసింది. మరి ధోని కెప్టెన్సీలో వన్డే జట్టు క్లీన్‌స్వీప్ చేయొద్దా...? ఆటగాడిగా కోహ్లి అద్భుతమైన ఆటతీరుతో సహచరులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. మరి ధోని సహచరుల్లో స్ఫూర్తి నింపేలా పరుగులు చేయొద్దా..?
 
 గత రెండు రోజులుగా బాగా ఎక్కువగా వినిపించిన ప్రశ్నలు ఇవి. భారత క్రికెట్ ధోని చేతుల్లోంచి క్రమంగా కోహ్లి చేతుల్లోకి వెళ్లిపోతోంది. మరోవైపు ధోని వచ్చే ప్రపంచకప్ దాకా ఆడాలనే ఉద్దేశంతో ఉన్నాడు. ఈ నేపథ్యంలో న్యూజిలాండ్‌తో సిరీస్‌ను భారత్ క్లీన్‌స్వీప్ చేయడంతో పాటు ధోని కూడా ఓ గొప్ప ఇన్నింగ్‌‌స ఆడితే ఇలాంటి ప్రశ్నలు తలెత్తకుండా ఉంటాయి.
 
 విమర్శల సంగతి ఎలా ఉన్నా... తొలి వన్డేలో భారత ఆటతీరు చూసిన తర్వాత న్యూజిలాండ్ వన్డేల్లో కూడా కోలుకోవడం కష్టమే అని అర్థమవుతోంది. వాళ్ల ఆటతీరుకు సరిపోయే పిచ్‌పైనే ఆ జట్టు పూర్తిగా చేతులెత్తేసింది. మరి భారత్ శైలికి అనుకూలించే పిచ్‌పై ఆ జట్టు కనీసం పోటీ ఇవ్వగలుగుతుందా..!
 
 న్యూఢిల్లీ: టెస్టు సిరీస్‌లో ఘోరంగా ఓడిపోయినా... వన్డేల్లో న్యూజిలాండ్ బలమైన జట్టు కాబట్టి సిరీస్ ఆసక్తికరంగా సాగే అవకాశం ఉందనేది ధర్మశాల మ్యాచ్‌కు ముందు అంచనా. కానీ తొలి వన్డేలో ఆ జట్టు ఆడిన తీరు చూసిన తర్వాత ఇక వన్డే సిరీస్ కూడా ఏకపక్షమే అని అర్థమైపోతోంది.  నిజానికి ఓ సిరీస్‌లో ఏదీ కలిసిరాకపోతుంటే జట్టు ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతింటుంది. అలాంటి స్థితి నుంచి కోలుకోవాలంటే ఓ మంచి విజయం కావాలి. ఇప్పుడు న్యూజిలాండ్ లక్ష్యం ఇదే. ఫిరోజ్ షా కోట్ల మైదానంలో గురువారం (నేడు) జరిగే రెండో వన్డేలో భారత్‌పై గెలిస్తే ఈ సిరీస్ అభిమానుల్లో ఆసక్తి పెంచుతుంది. లేకపోతే ఇది కూడా కివీస్ క్రికెట్ చరిత్రలో ఓ సాధారణ సిరీస్‌లా మిగులుతుంది. మరి విలియమ్సన్ అండ్ కో పోరాడతారా..? లేక మరోసారి బ్యాట్లు ఎత్తేస్తారా..?
 
 మార్పులు లేకుండానే...
 తొలి వన్డేలో గెలిచిన భారత జట్టు రెండో వన్డేలోనూ మార్పులు లేకుండానే బరిలోకి దిగే అవకాశాలు ఉన్నారుు. జ్వరం కారణంగా రైనా అందుబాటులో లేనందున కేదార్ జాదవ్ తుది జట్టులో కొనసాగుతాడు. రోహిత్, రహానే ఓపెనింగ్ ఆడతారు. తొలి వన్డేల్లో ఈ ఇద్దరూ ఫర్వాలేదనిపించారు. కోహ్లి సూపర్ ఫామ్ కొనసాగుతూనే ఉంది. మనీశ్ పాండే, ధోని మాత్రం మరింత మెరుగ్గా ఆడాల్సి ఉంది. వికెట్ స్వభావం దృష్ట్యా ఈ మ్యాచ్‌లో భారత బ్యాటింగ్ లైనప్ సత్తా తెలిసే అవకాశం ఉంది.
 
  ఇక జాదవ్‌కు కూడా ఇది మంచి అవకాశం. పార్ట్ టైమ్ స్పిన్నర్ పాత్రను తొలి వన్డేలో సమర్థంగా పోషించిన జాదవ్... బ్యాటింగ్‌లోనూ రాణిస్తే తుది జట్టులో చోటు కోసం రేసులో ఉండొచ్చు. ఇక బౌలింగ్ విభాగంలో ధావల్ కులకర్ణి అందుబాటులో ఉన్నా తొలి వన్డే ఆడిన ఉమేశ్, బుమ్రాలనే కొనసాగించే అవకాశం ఉంది. మరిన్ని ప్రయోగాలు చేసే ముందు సిరీస్ గెలవడం ముఖ్యం కాబట్టి... రెండో వన్డేకు మార్పులు లేకుండానే ధోనిసేన బరిలోకి దిగే అవకాశం ఉంది.
 
 సీనియర్ల వైఫల్యం
 న్యూజిలాండ్‌ను ఈ పర్యటన ఆరంభం నుంచి సీనియర్ల ఫామ్ వేధిస్తోంది. ముఖ్యంగా రాస్ టేలర్, గప్టిల్ ఇద్దరూ జట్టుకు భారంగా మారారు. ఒకవేళ ఈ మ్యాచ్ కోసం ఈ ఇద్దరిలో ఎవరినైనా ఆపినా ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. అరుుతే తన ఫామ్ కూడా అంతంతమాత్రంగానే ఉన్నందున కెప్టెన్ విలియమ్సన్ ఇలాంటి నిర్ణయం తీసుకుంటాడా అనేది ప్రశ్నార్థకమే. లాథమ్ మినహా ఆ జట్టులో ఎవరూ బాగా ఆడటం లేదు. రోంచీ అడపాదడపా ఫర్వాలేదనిపిస్తున్నాడు. ఇక బౌలింగ్‌లోనూ ఆ జట్టు అంతంత మాత్రంగానే ఉంది. ఈ మ్యాచ్‌లో సౌతీకి జతగా బౌల్ట్ ఆడే అవకాశం ఉంది. కోట్ల పిచ్ బౌల్ట్ శైలికి బాగా సరిపోతుంది. ఏమైనా భారత్‌ను ఓడించాలంటే న్యూజిలాండ్ సర్వశక్తులూ ఒడ్డాలి.  
 
 జట్లు (అంచనా):  భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, రహానే, కోహ్లి, మనీశ్ పాండే, జాదవ్, పాండ్యా, అక్షర్, మిశ్రా, బుమ్రా, ఉమేశ్.
 
 న్యూజిలాండ్:  విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, లాథమ్, టేలర్, అండర్సన్, రోంచీ, నీషమ్, శాన్‌ట్నర్, బ్రేస్‌వెల్/బౌల్ట్, సౌతీ, సోధి.
 
 పిచ్, వాతావరణం
 వర్షం ప్రమాదం లేదు. మధ్యాహ్నం బాగా ఎండగా ఉన్నా... సాయంత్రం మంచు కురిసే అవకాశం ఉంది. సాధారణంగా ఫిరోజ్ షా కోట్ల పిచ్ స్వింగ్ బౌలింగ్‌కు, స్పిన్నర్లకు అనుకూలంగా ఉంటుంది.
 
 మ.గం. 1.30
  నుంచి
 స్టార్ స్పోర్‌‌ట్స-1లో ప్రత్యక్ష ప్రసారం

 
 150 రోహిత్ శర్మకు ఇది 150వ వన్డే మ్యాచ్
 12 ఫిరోజ్ షా కోట్లలో భారత్ 18 వన్డేలు ఆడితే 12 గెలిచి, 5 ఓడింది. ఓ మ్యాచ్ రద్దరుుంది.
 2 న్యూజిలాండ్‌తో ఈ వేదికలో ఆడిన రెండు వన్డేల్లోనూ భారత్ గెలిచింది.

 
 డీఆర్‌ఎస్ క్లాస్  
 అంపైర్ సమీక్షా నిర్ణయ పద్ధతి (డీఆర్‌ఎస్)పై ఉన్న సందేహాలను తొలగించేందుకు ఐసీసీ బుధవారం బీసీసీఐ ముందు ప్రత్యేక ప్రజెంటేషన్ ఇచ్చింది. బోర్డు అధ్యక్షుడు ఠాకూర్, కోచ్ అనిల్ కుంబ్లే దీనికి హాజరయ్యారు. ‘హాక్ ఐ’ ప్రతినిధులు సాంకేతికాంశాల గురించి  స్పష్టతనిచ్చారు.
 
 బ్యాటింగ్ ఆర్డర్ అనేది మ్యాచ్ పరిస్థితిని బట్టి మారుతుంది. ధోనికి కావలసినంత అనుభవం ఉంది. అతను ఎలాంటి పాత్రనైనా సమర్థంగా పోషించగలడు. హార్దిక్ పాండ్యా జట్టుకు సమతూకాన్ని తెచ్చాడు. అరుుతే ఓ కొత్త ఆటగాడిపై ఎక్కువ ఒత్తిడి పెంచకూడదు. అందుకే తనకు బ్యాటింగ్, బౌలింగ్ రెండు విభాగాల్లోనూ కావలసినంత స్వేచ్ఛను ఇస్తాం. ప్రస్తుతానికి ధావన్, రాహుల్ గాయాలతో ఉన్నందున రహానే ఓపెనర్‌గా కొనసాగుతాడు. చాంపియన్‌‌స ట్రోఫీ సమయానికి పరిస్థితిని బట్టి మార్పుల గురించి ఆలోచించవచ్చు.  - భారత కోచ్ అనిల్ కుంబ్లే
 
 బలమైన భారత జట్టుపై గెలవాలంటే మేం ఎక్కువ స్కోరు చేయాలి. జట్టులో బ్యాట్స్‌మన్ అందరూ సమష్టిగా రాణించాలి. భారత పర్యటన ఎప్పుడూ పెద్ద సవాలే. ఇక్కడి పరిస్థితులలో ప్రత్యర్థి చేసే చిన్న తప్పులను కూడా మనకు అనుకూలంగా మలచుకోవాలి. తొలి వన్డేలో మా స్థారుుకి తగ్గట్లుగా రాణించలేకపోయాం. రెండో వన్డేలో కుదురుకుంటాం.              
- న్యూజిలాండ్ బౌలర్ బౌల్ట్

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement