ఆట సమం... అటుపై వర్షం!
మాంచెస్టర్‌లో రెండో రోజు ఆరంభంలో భారత పేసర్ల జోరు... 34 పరుగుల వ్యవధిలో 3 వికెట్లు... మ్యాచ్‌పై పట్టు దొరికినట్లే అనిపించింది. కానీ రూట్, బట్లర్ పోరాడారు. దాంతో ఇంగ్లండ్‌కు కోలుకునే అవకాశం చిక్కింది. 36 ఓవర్ల ఆటలో ఇరు జట్లు సమఉజ్జీలుగా నిలిచిన వేళ... నేనున్నానంటూ మధ్యలో వానొచ్చింది. దాదాపు మూడున్నర గంటల పాటు ప్రభావం చూపించింది. ఫలితంగా శుక్రవారం ఆటలో ఎక్కువ భాగం వర్షార్పణమైంది.
రెండో రోజు మ్యాచ్‌కు వాన దెబ్బ
కేవలం 36 ఓవర్ల ఆట సాధ్యం
ఇంగ్లండ్ 237/6
భారత్‌పై 85 పరుగుల ఆధిక్యం
ఓల్డ్ ట్రాఫర్డ్: భారత్, ఇంగ్లండ్ నాలుగో టెస్టు మ్యాచ్‌కు వర్షం అడ్డంకిగా మారింది. భారీ వర్షం కారణంగా రెండో రోజు ఆట రెండు సెషన్లు కూడా సాగలేదు. శుక్రవారం ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 6 వికెట్ల నష్టానికి 237 పరుగులు చేసింది. జో రూట్ (94 బంతుల్లో 48 బ్యాటింగ్; 5 ఫోర్లు), జాస్ బట్లర్ (53 బంతుల్లో 22 బ్యాటింగ్; 2 ఫోర్లు) క్రీజ్‌లో ఉన్నారు. ఇయాన్ బెల్ (82 బంతుల్లో 58; 8 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ చేశాడు. ప్రస్తుతం ఇంగ్లండ్ 85 పరుగులు ముందంజలో ఉంది. రెండో రోజు ఇంగ్లండ్ 36 ఓవర్లలో 124 పరుగులు చేసింది.
వికెట్‌పై తేమ ఉండటంతో తొలి రోజులాగే రెండో రోజు ఉదయం కూడా పేస్ బౌలర్లు ప్రభావం చూపించారు. దాంతో తక్కువ వ్యవధిలో ఇంగ్లండ్ మూడు వికెట్లు కోల్పోయింది. భువనేశ్వర్ (3/47), ఆరోన్ (3/48)లకే ఆ వికెట్లు దక్కాయి. అయితే రూట్, బట్లర్ ఏడో వికెట్‌కు అభేద్యంగా 67 పరుగులు జోడించి ఆదుకున్నారు. ఇదే తరహా వాతావరణంలో శనివారం ఉదయం కూడా భారత బౌలర్లు చెలరేగితే ఇంగ్లండ్‌కు భారీ ఆధిక్యం దక్కకుండా నివారించవచ్చు. అప్పుడే ఈ మ్యాచ్‌లో టీమిండియా కోలుకునే అవకాశం ఉంది.
స్కోరు వివరాలు : భారత్ తొలి ఇన్నింగ్స్: 152
ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్: కుక్ (సి) పంకజ్ (బి) ఆరోన్ 17; రాబ్సన్ (బి) భువనేశ్వర్ 6; బాలెన్స్ (ఎల్బీ) (బి) ఆరోన్ 37; బెల్ (సి) ధోని (బి) భువనేశ్వర్ 58; జోర్డాన్ (సి) ఆరోన్ (బి) భువనేశ్వర్ 13; రూట్ (బ్యాటింగ్) 48; అలీ (బి) ఆరోన్ 13; బట్లర్ (బ్యాటింగ్) 22; ఎక్స్‌ట్రాలు 23; మొత్తం (71 ఓవర్లలో 6 వికెట్లకు) 237
వికెట్ల పతనం: 1-21; 2-36; 3-113; 4-136; 5-140; 6-170.
బౌలింగ్: భువనేశ్వర్ 18-6-47-3; పంకజ్ సింగ్ 17-2-79-0; ఆరోన్ 16-2-48-3; అశ్విన్ 13-1-28-0; జడేజా 7-0-21-0.
తొలి సెషన్: భారత్ జోరు
రెండో రోజు ఆట ప్రారంభమయ్యాక రెండో ఓవర్లోనే బెల్ 63 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే కొద్ది సేపటికే నైట్‌వాచ్‌మన్ జోర్డాన్ (13)ను అవుట్ చేసి భువనేశ్వర్ బ్రేక్ ఇచ్చాడు. మిడ్‌వికెట్‌లో ఆరోన్ చక్కటి క్యాచ్ అందుకోవడం విశేషం. మరో నాలుగు పరుగులకే ఇంగ్లండ్ జట్టు బెల్ వికెట్ కోల్పోయి ఇబ్బందుల్లో పడింది. ఈ వికెట్ కూడా భువీ ఖాతాలోకే వెళ్లింది. ఆ వెంటనే ప్రత్యర్థిని కోలుకోనీయకుండా ఆరోన్ అద్భుత బంతితో మొయిన్ అలీ (13)ని బౌల్డ్ చేశాడు. ఈ దశలో ఇంగ్లండ్, భారత్‌కంటే కేవలం 18 పరుగులు ముందంజలో ఉంది. అయితే రూట్, బట్లర్ లంచ్ వరకు మరో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడారు. మొత్తానికి ఈ సెషన్‌లో టీమిండియా ఆధిక్యం కనబరిచింది.
ఓవర్లు: 27, పరుగులు: 88, వికెట్లు: 3
రెండో సెషన్: రూట్, బట్లర్ నిలకడ
విరామం తర్వాత ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ జోరు పెంచారు. ధాటిగా ఆడి పరుగులు రాబట్టారు. 87 బంతుల్లో ఈ జోడి 50 పరుగులు చేర్చి పరిస్థితిని చక్కదిద్దింది. ఇంగ్లండ్ ఆధిక్యం 85 పరుగులకు చేరిన తర్వాత భారీ వర్షంతో మ్యాచ్‌కు అంతరాయం కలిగింది. సుదీర్ఘ సమయం పాటు వాన కురిసి ఆట ఆరంభం కాకపోవడంతో అంపైర్లు టీ విరామం ప్రకటించారు.
ఓవర్లు: 9, పరుగులు: 36, వికెట్లు: 0