గెలుపు దక్కుతుందా....! | India vs New Zealand 4th ODI Preview | Sakshi
Sakshi News home page

గెలుపు దక్కుతుందా....!

Published Tue, Jan 28 2014 2:08 AM | Last Updated on Sat, Sep 2 2017 3:04 AM

గెలుపు దక్కుతుందా....!

గెలుపు దక్కుతుందా....!

న్యూజిలాండ్ పర్యటనలో ఇంకా విజయం రుచి చూడని భారత్ తొలి గెలుపు అందుకోవాలని పట్టుదలగా ఉంది. తొలి రెండు వన్డేల్లో పోరాడి ఓడిన జట్టు అదే స్ఫూర్తితో మూడో మ్యాచ్‌లోనూ ఆకట్టుకుంది. అయితే సిరీస్‌ను డ్రా చేసుకుని మళ్లీ నంబర్‌వన్ ర్యాంక్‌కు రావాలంటే మిగతా రెండు మ్యాచ్‌ల్లో నెగ్గడం తప్పనిసరి. ఈ నేపథ్యంలో మంగళవారం జరిగే నాలుగో వన్డే భారత్‌కు కీలకంగా మారింది.
 
 హామిల్టన్: న్యూజిలాండ్‌తో గత మ్యాచ్‌లో ఓటమిని తప్పించుకొని ‘టై’గా ముగించగలిగిన ధోని సేన ఇప్పుడు మరో సవాల్‌కు సిద్ధమైంది. ఇరు జట్ల మధ్య ఇక్కడి సెడాన్ పార్క్‌లో నేడు నాలుగో వన్డే మ్యాచ్ జరగనుంది. ఐదు వన్డేల ఈ సిరీస్‌లో  కివీస్ ప్రస్తుతం 2-0 ఆధిక్యంలో ఉంది. సిరీస్‌లో విజయం సాధించే అవకాశం టీమిండియాకు లేకపోయినా మిగతా రెండు మ్యాచ్‌లు గెలిస్తే సిరీస్‌ను కాపాడుకునే స్థితిలో జట్టు ఉంది. 
 
జట్టు బ్యాటింగ్ మెరుగ్గా కనిపిస్తుండగా, కివీస్ పరిస్థితులకు తగినదిగా భావించిన భారత బౌలింగ్ మాత్రం పెద్దగా ప్రభావం చూపించలేకపోతోంది. అయితే గత మ్యాచ్ ప్రదర్శన అనంతరం మరో సారి అదే జట్టును ధోని కొనసాగించే అవకాశం ఉంది. మరో వైపు మూడో వన్డేలో అనూహ్యంగా విజయాన్ని కోల్పోయిన కివీస్ ఈ మ్యాచ్ గెలిచి సిరీస్‌ను అందుకోవాలని భావిస్తోంది. 
 
  రైనా ఇప్పుడైనా...
 కోహ్లి, ధోనిల అద్భుత ఫామ్‌ను మినహాయిస్తే... గత మ్యాచ్‌లో ఓపెనర్లు ఆకట్టుకున్నారు. ఇక రవీంద్ర జడేజా జోరుతో అతని బ్యాటింగ్ బెంగ కూడా తీరింది. అయితే రైనా ఫామ్ మాత్రం ఆందోళనకరంగా ఉంది. గత 30 ఇన్నింగ్స్‌లలో అతను ఒకే ఒక్క అర్ధ సెంచరీ చేశాడు. మరో వైపు రహానే చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడకపోయినా...అతనికి మరో అవకాశం ఖాయం. బౌలర్ల ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. షమీ, భువనేశ్వర్‌లపై రాణించాల్సిన ఒత్తిడి ఉంది. ఇక అశ్విన్ ఏ మాత్రం ప్రభావం చూపకపోయినా, గత మ్యాచ్‌లో బ్యాటింగ్ ప్రదర్శన అతని స్థానాన్ని పదిలం చేసింది. మూడో పేసర్‌గా ఆరోన్‌కు మరోసారి అవకాశం దక్కొచ్చు.
 
  మెకల్లమ్‌పై ఒత్తిడి...
 మరో వైపు న్యూజిలాండ్ జట్టులో బౌలర్ బెన్నెట్ స్థానంలో మిల్స్ వచ్చే అవకాశం ఉంది. ఆ జట్టు టాప్-4 బ్యాట్స్‌మెన్ మంచి ఫామ్‌లో ఉండి జట్టును నడిపిస్తున్నారు. ఆ పునాదిపైనే చివరి 15 ఓవర్లలో కివీస్ భారీగా పరుగులు సాధిస్తోంది. ఈ క్రమంలో అండర్సన్, రోంచి కీలక ఇన్నింగ్స్‌లు ఆడుతున్నారు. అయితే కెప్టెన్ బ్రెండన్ మెకల్లమ్ మాత్రం తన స్థాయిలో మెరుపులు చూపించలేకపోతున్నాడు. గత రెండు వన్డేల్లో అతను డకౌటయ్యాడు. 
 
  జట్ల వివరాలు (అంచనా): 
 భారత్: ధోని (కెప్టెన్), రోహిత్ శర్మ, ధావన్, కోహ్లి, రహానే, రైనా, జడేజా, అశ్విన్, ఆరోన్, షమీ, భువనేశ్వర్. 
 న్యూజిలాండ్: బ్రెండన్ మెక్‌కల్లమ్ (కెప్టెన్), గుప్టిల్, రైడర్, విలియమ్సన్, టేలర్, అండర్సన్, రోంచి, నాథన్ మెక్‌కల్లమ్, సౌతీ, మెక్లీనగన్, బెన్నెట్/మిల్స్. 
 
  పిచ్
 దాదాపు మూడో వన్డే తరహాలోనే నెమ్మదైన పిచ్ ఉంటుంది. రెండో ఇన్నింగ్స్‌లో బ్యాటింగ్ సమయంలో మరింత నెమ్మదించవచ్చు. అయితే వికెట్ ఎలా ఉన్నా లక్ష్యఛేదనకే ధోని మొగ్గు చూపే అవకాశం ఉంది. గత మూడు వన్డేల్లోనూ టాస్ గెలిచిన భారత్ ఫీల్డింగే ఎంచుకుంది. ఆసియా బయట జరిగిన గత 20 మ్యాచుల్లో టాస్ గెలిచిన ప్రతిసారీ భారత్ ఫీల్డింగ్ ఎంచుకోవడం విశేషం.
 
 ‘నాకు ఎక్కువ ఓవర్లు ఆడే అవకాశం రావడంతోనే గత మ్యాచ్‌లో బాగా బ్యాటింగ్ చేయగలిగాను. నేను వికెట్లు తీయడం లేదనేది వాస్తవం. అయితే ఇది  కొన్ని సార్లు జరుగుతూ ఉంటుంది. అయితే నా బౌలింగ్‌తో సంతృప్తిగా ఉన్నా. లెంగ్త్, స్పీడ్‌లో కొన్ని మార్పులు చేసుకున్నాను. ప్రాక్టీస్‌లో తప్పులు సరిదిద్దుకుంటున్నా. మేం అద్భుతంగా ఆడకపోయినా అన్ని మ్యాచ్‌లలో విజయానికి చేరువయ్యాం. భారత్ బయట ఎక్కడికి వెళ్లినా పెద్ద సంఖ్యలో భారత అభిమానులు మమ్మల్ని ప్రోత్సహించడం సంతోషంగా ఉంది’. -ఆర్. అశ్విన్, భారత బౌలర్ 
 
 ‘గత మ్యాచ్‌లాంటివి జరిగితే ప్రతీ ఆటగాడు ఉద్వేగభరిత స్థితిలో ఆడతాడు. అలాంటప్పుడు తప్పులు సహజం. అయితే వాటిని పునరావృతం చేయకుండా ప్రయత్నిస్తాం. నాలుగో వన్డేలో గెలిచి సిరీస్‌ను సాధించాలని జట్టు పట్టుదలగా ఉంది’. -ల్యూక్ రోంచి, న్యూజిలాండ్ వికెట్ కీపర్ 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement