మౌంట్ మాంగనీ: పురుషుల బాటలోనే భారత మహిళల క్రికెట్ జట్టు కివీస్ పని పట్టింది. అదే వేదికపై రెండో వన్డేలోనూ విజయం సాధించి 2–0తో సిరీస్‌ను గెలుచుకుంది. మంగళవారం ఇక్కడ జరిగిన మ్యాచ్‌లో భారత్ 8 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ మహిళలను చిత్తుగా ఓడించింది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన కివీస్ 44.2 ఓవర్లలో 161 పరుగులకే కుప్పకూలింది. కెప్టెన్ అమీ సాటర్‌వైట్ (87 బంతుల్లో 71; 9 ఫోర్లు) మినహా అంతా విఫలమయ్యారు. జులన్ గోస్వామి 3 వికెట్లతో ప్రత్యర్థిని కట్టడి చేయగా... ఏక్తా బిష్త్, పూనమ్ యాదవ్, దీప్తి శర్మ తలా 2 వికెట్లు పడగొట్టారు. అనంతరం భారత్ 35.2 ఓవర్లలో 2 వికెట్లకు 166 పరుగులు చేసింది. దూకుడుగా ఆడిన స్మృతి మంధాన (83 బంతుల్లో 90; 13 ఫోర్లు, 1 సిక్స్) వరుసగా రెండో సెంచరీ అవకాశాన్ని త్రుటిలో కోల్పోగా, కెప్టెన్ మిథాలీ రాజ్ (111 బంతుల్లో 63 నాటౌట్; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్ధ సెంచరీ సాధించింది. ఐసీసీ ఉమెన్ చాంపియన్‌షిప్‌లో భాగంగా జరిగిన ఈ మ్యాచ్‌లో విజయంతో భారత్ ఖాతాలో 2 పాయింట్లు చేరాయి. ఇరు జట్ల మధ్య చివరి వన్డే శుక్రవారం హామిల్టన్‌లో జరుగుతుంది.
కట్టడి చేసిన ఏక్తా...
కెప్టెన్ సాటర్‌వైట్ పోరాటం మినహా కివీస్ ఇన్నింగ్స్‌లో చెప్పుకోవడానికేమీ లేదు. భారత బౌలింగ్ ముందు ఆ జట్టు పూర్తిగా తడబడింది. ఇన్నింగ్స్ తొలి ఓవర్లోనే సుజీ బేట్స్ (0)ను జులన్, ఆ వెంటనే డెవిన్ (7)ను శిఖా ఔట్ చేసి జట్టుకు శుభారంభం అందించారు. ఆ తర్వాత పరుగులు తీయడంలో ఇబ్బంది పడటంతో పాటు స్వల్ప విరామాల్లో ఆ జట్టు వికెట్లు కోల్పోయింది. ముఖ్యంగా ఏక్తా బిష్త్ 8 ఓవర్లలో 14 పరుగులే ఇచ్చి ప్రత్యర్థిని కట్టి పడేసింది. తన వరుస ఓవర్లలో ఆమె డౌన్ (15), కెర్ (1)లను పెవిలియన్ పంపించింది. మరో వైపు ఓపిగ్గా ఆడిన సాటర్‌వైట్ 71 బంతుల్లో అర్ధసెంచరీ పూర్తి చేసుకుంది. ఆ తర్వాత జోరు పెంచి దీప్తి శర్మ ఓవర్లో వరుసగా మూడు ఫోర్లు కొట్టిన ఆమెను పూనమ్ ఔట్ చేయడంతో కివీస్ పతనం మరింత వేగంగా సాగిపోయింది.
భారీ భాగస్వామ్యం...
స్వల్ప లక్ష్య ఛేదనలో భారత్ 15 పరుగులకే 2 వికెట్లు కోల్పోయింది. జెమీమా రోడ్రిగ్స్ (0) డకౌట్ కాగా, కొద్ది సేపటికే దీప్తి శర్మ (8) కూడా వెనుదిరిగింది. అయితే ఆ తర్వాత భారత్‌ను కివీస్ నిరోధించలేకపోయింది. మరో వికెట్ పడకుండా స్మృతి, మిథాలీ జట్టును జట్టును విజయపథంలో నడిపించారు. చక్కటి షాట్లతో అలరించిన స్మృతి 54 బంతుల్లోనే హాఫ్ సెంచరీ మార్క్‌ను అందుకుంది. ఇందులోనే 8 ఫోర్లు ఉండటం విశేషం. కెప్టెన్ మిథాలీరాజ్ ఆరంభంలో కొంత తడబడ్డా ఆ తర్వాత నిలదొక్కుకుంది. ఈ క్రమంలో అర్ధ సెంచరీ పూర్తి చేసుకునేందుకు ఆమెకు 102 బంతులు అవసరమయ్యాయి. ఆ తర్వాత వీరిద్దరు చకచకా లక్ష్యం వైపు దూసుకుపోయారు. కెర్ వేసిన 36వ ఓవర్లో భారీ సిక్స్ కొట్టి కెప్టెన్ మ్యాచ్‌ను ముగించింది. స్మృతి, మిథాలీ మూడో వికెట్‌కు అభేద్యంగా 151 పరుగులు జోడించారు.
మన మహిళలదే సిరీస్
Published Wed, Jan 30 2019 1:35 AM | Last Updated on Wed, Jan 30 2019 1:35 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment