పరువు కోసం... | India vs South Africa 3rd ODI Preview: Hosts eye clean sweep against struggling India | Sakshi
Sakshi News home page

పరువు కోసం...

Published Wed, Dec 11 2013 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 1:27 AM

పరువు కోసం...

పరువు కోసం...

సా. గం. 5.00 నుంచి
 టెన్ క్రికెట్‌లో ప్రత్యక్ష ప్రసారం
 
 దక్షిణాఫ్రికా పర్యటనకు ముందు జోరుమీదున్న భారత కుర్రాళ్లు ఊహించినట్లుగానే బౌన్సీ వికెట్లపై బోల్తా కొట్టారు. పచ్చిక పిచ్‌లపై దూసుకొచ్చే బుల్లెట్ బంతులను ఎదుర్కోలేక ఘోరంగా విఫలమయ్యారు. మూడు వన్డేల సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలుండగానే కోల్పోయారు. కనీసం ఆఖరి వన్డేలోనైనా గెలిస్తే ప్రపంచ నంబర్‌వన్ జట్టుకు పరువు దక్కుతుంది. టెస్టు సిరీస్‌కు ముందు కాస్త ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
 
 సెంచూరియన్: వరుసగా రెండు వన్డేల్లో పరాజయం పాలైన భారత్ జట్టు... కీలకమైన టెస్టు సిరీస్‌కు ముందు ఆత్మ విశ్వాసం కూడగట్టుకుంటుందా? ఇకనైనా బౌన్సీ వికెట్లపై సఫారీ బౌలర్ల జోరును అడ్డుకుంటుందా? వన్డే సిరీస్‌ను కోల్పోయినా... టెస్టుల్లోనైనా కనీస పోటీని ఇస్తుందా? ప్రస్తుతం భారత అభిమానుల్లో నెలకొన్న ప్రశ్నలు ఇవి.
 
 ఈ నేపథ్యంలో నేడు సెంచూరియన్‌లో జరగబోయే ఆఖరి వన్డేలో (డే నైట్) భారత్... దక్షిణాఫ్రికాతో అమీతుమీ తేల్చుకోనుంది. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి పోయిన పరువును కాస్త అయినా నిలుపుకోవాలని టీమిండియా భావిస్తుండగా... సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేయాలని సఫారీ జట్టు ప్రణాళికలు రచిస్తోంది. పచ్చిక, బౌన్సీ వికెట్లపై దక్షిణాఫ్రికా పేసర్లను ఎదుర్కోలేక చతికిలపడ్డ భారత యువ బ్యాట్స్‌మెన్ ఈ మ్యాచ్‌లో ఏ మేరకు రాణిస్తారన్నదే ఇప్పుడు ఆసక్తికర అంశం. తొలి రెండు మ్యాచ్‌ల్లో ఓటమిని మర్చిపోవాలంటే ఈ మ్యాచ్‌లో కచ్చితంగా ధోనిసేన గెలిచి తీరాలి.
 
 కుర్రాళ్లు నిలుస్తారా?  
 తొలి వన్డేలో బౌలర్లు విఫలం కావడంతో భారత్ భారీ లక్ష్యాన్ని (359) ఛేదించాల్సి వచ్చింది. కానీ కీలక సమయంలో బ్యాట్స్‌మెన్ సైతం విఫలం కావడంతో ఓటమి తప్పలేదు. అయితే రెండో వన్డేల్లో బౌలర్లు ఓ మేరకు రాణించినా.. బ్యాట్స్‌మెన్ మాత్రం ఒత్తిడిని జయించలేక పాత కథనే పునరావృతం చేశారు. 281 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఘోరంగా విఫలమయ్యారు. దీంతో మూడో వన్డేలో వీళ్లు ఏ మేరకు కుదురుకుంటారన్నదే ఇప్పుడు మిలియన్ డాలర్ల ప్రశ్న. రెండు మ్యాచ్‌ల్లోనూ స్టెయిన్ ఓపెనింగ్ స్పెల్‌తో భారత్‌ను ఘోరంగా దెబ్బతీశాడు. ఫలితంగా ధావన్, రోహిత్ శుభారంభానివ్వలేకపోయారు. అటు ఫస్ట్‌డౌన్‌లో కోహ్లి కూడా విఫలం కావడం టీమ్ మేనేజ్‌మెంట్‌ను ఆందోళనలో పడేసింది. రైనా, యువరాజ్, ఆల్‌రౌండర్‌గా జడేజా ఏమాత్రం ప్రభావం చూపకపోతున్నారు. చివర్లో ధాటిగా ఆడే ధోనికి అండగా నిలిచేవారు లేకపోవడం కూడా భారత్‌కు ప్రతికూలాంశంగా మారింది. రహానేకు అవకాశం వచ్చినా ఆకట్టుకోలేకపోయాడు. దీంతో రాయుడుకు డిమాండ్ పెరుగుతోంది.
 
 ఇక బౌలింగ్ విభాగానికొస్తే పేసర్లలో షమీ ఇంకా నేర్చుకునే దశలోనే ఉన్నా ఆకట్టుకుంటున్నాడు. వాండర్సర్, కింగ్స్‌మీడ్‌లో తన మార్కును చూపెడుతూ ఆరు వికెట్లు తీశాడు. కాబట్టి మూడో వన్డేలో కూడా అతనిపైనే కెప్టెన్ ఎక్కువ ఆశలు పెట్టుకున్నాడు. ఇషాంత్, ఉమేశ్ వికెట్లు తీయకపోయినా కనీసం పరుగులనూ కట్టడి చేయలేకపోతున్నారు. ప్రధాన స్పిన్నర్‌గా అశ్విన్ ప్రదర్శన అంతంతమాత్రంగానే ఉంది. ఈ పరిస్థితుల్లో జట్టులో మార్పులు ఉంటాయని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నా... ధోని మాత్రం పెద్దగా ఆసక్తి చూపడం లేదు.  
 
 కలిస్, స్టెయిన్‌లకు విశ్రాంతి?
 మరోవైపు దక్షిణాఫ్రికా అన్ని రంగాల్లో సమష్టిగా రాణిస్తోంది. ఓపెనర్లు డికాక్, ఆమ్లా పరుగుల వరద పారిస్తున్నారు. ఈ జోడిని విడదీసేందుకు ధోని చేస్తున్న ప్రయత్నాలు బెడిసి కొడుతుండటంతో భారత బౌలర్ల ఆత్మ విశ్వాసం దెబ్బతింటోంది. మిడిలార్డర్‌లో డివిలియర్స్, డుమిని వేగంగా ఆడుతుండగా, కలిస్, మిల్లర్‌లు రాణిస్తుండటంతో ప్రొటీస్ భారీ స్కోరు చేస్తోంది.
 
  బౌలింగ్‌లో స్టెయిన్ మెరుపు బౌలింగ్‌తో మ్యాచ్‌ను మలుపు తిప్పుతున్నాడు. సొట్‌సోబ్, ఫిలాండర్, మోర్కెల్, మెక్‌లారెన్ తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. జట్టులో ఎక్కువ మంది ఆల్‌రౌండర్లు ఉండటంతో డివియర్స్ భిన్నమైన ప్రణాళికలతో భారత్‌ను కట్టడి చేస్తున్నాడు. టెస్టు సిరీస్‌ను దృష్టిలో పెట్టుకుని మూడో వన్డేలో కలిస్, స్టెయిన్‌కు విశ్రాంతి ఇవ్వాలని మేనేజ్‌మెంట్ యోచిస్తోంది. ఒకవేళ స్టెయిన్ ఆడకపోతే భారత బ్యాట్స్‌మెన్‌కు కాస్త ఊరట దొరకొచ్చు.
 
 జట్లు (అంచనా):
 భారత్: ధోని, ధావన్, రోహిత్, కోహ్లి, యువరాజ్ / రహానే, రైనా, జడేజా, అశ్విన్, భువనేశ్వర్, ఇషాంత్/మోహిత్, షమీ.
 
 దక్షిణాఫ్రికా: డివియర్స్, ఆమ్లా, డికాక్, హెన్రీ డేవిడ్, డుమిని, మిల్లర్, మెక్‌లారెన్, పార్నెల్, తాహిర్, స్టెయిన్ / మోర్కెల్, ఫిలాండర్/ సొట్‌సోబ్.
 
 ‘దక్షిణాఫ్రికాలో పరిస్థితులు మా ఓటమికి కారణం కాదు. భారీ భాగస్వామ్యాలు నమోదు చేయలేక రెండు మ్యాచ్‌లు ఓడిపోయాం. రెండో వన్డే వేదిక డర్బన్‌లో పరిస్థితులు దాదాపుగా భారత్ తరహాలోనే ఉన్నా అర్థం చేసుకోలేకపోయాం.  ఆఖరి వన్డేలో గెలుస్తామనే నమ్మకం ఉంది. టెస్టుల గురించి ఇంకా ఏమీ ఆలోచించలేదు.’     
 - రోహిత్ (భారత్)
 
 ‘మూడో వన్డేలో కూడా మా జోరును కొనసాగిస్తాం.  కీలకమైన టెస్టులకు ముందు వన్డే సిరీస్ గెలవడంతో మానసికంగా పైచేయి సాధించాం. ఇక్కడి వాతావరణ పరిస్థితులకు భారత్ తొందరగా అలవాటు పడలేకపోయింది.     
 - మెక్‌లారెన్ (దక్షిణాఫ్రికా)
 
 మంగళవారం మొత్తం వర్షం కురిసింది. బుధవారం కూడా జల్లులు పడే అవకాశాలున్నాయి.  కాబట్టి మ్యాచ్‌కు అంతరాయం కలిగే అవకాశాలున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement