మహిళల జట్టు సంచలనం
తొలి టి20లో ఆసీస్‌పై మిథాలీ బృందం విజయం
* రాణించిన హర్మన్‌ప్రీత్
అడిలైడ్: ప్రపంచ చాంపియన్స్ ఆస్ట్రేలియా జట్టుకు భారత మహిళల క్రికెట్ జట్టు తమ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో షాక్ ఇచ్చింది. మూడు టి20ల సిరీస్‌లో భాగంగా మంగళవారం జరిగిన తొలి మ్యాచ్‌లో మిథాలీ రాజ్ సేన 5 వికెట్ల తే డాతో నెగ్గి 1-0 ఆధిక్యం సాధించింది. శుక్రవారం మెల్‌బోర్న్‌లో రెండో మ్యాచ్ జరుగుతుంది. టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 18.4 ఓవర్లలో 5 వికెట్లకు 140 పరుగులు చేసింది. ఆరంభంలో మెరుగ్గా రాణించిన బౌలర్లు 17 పరుగులకే రెండు వికెట్లు తీసి ఇబ్బంది పెట్టారు. అయితే ఓపెనర్ మూనీ (36 బంతుల్లో 36; 2 ఫోర్లు)తో పాటు చివర్లో హీలీ (15 బంతుల్లో 41నాటౌట్; 5 ఫోర్లు; 2 సిక్సర్లు) మెరుపులు మెరిపించడంతో పరుగులు వేగంగా వచ్చాయి.
లెగ్ స్పిన్నర్ పూనమ్ యాదవ్‌కు రెండు వికెట్లు దక్కాయి. అనంతరం ఆస్ట్రేలియాపై తమ అత్యధిక పరుగుల లక్ష్య ఛేదన కోసం బరిలోకి దిగిన భారత్ 18.4 ఓవర్లలో ఐదు వికెట్లకు 141 పరుగులు చేసి గెలిచింది. కెప్టెన్ మిథాలీ రాజ్ (4) రెండో ఓవర్‌లోనే అవుట్ కాగా... టాప్ ఆర్డర్ బ్యాట్స్‌వుమన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (31 బంతుల్లో 46; 6 ఫోర్లు; 1 సిక్స్), వేద క్రిష్ణమూర్తి (32 బంతుల్లో 35; 5 ఫోర్లు), మంధన (25 బంతుల్లో 29; 3 ఫోర్లు; 1 సిక్స్) విజయంలో కీలక పాత్ర పోషించారు. జొనాసెన్, షట్‌లకు రెండేసి వికెట్లు దక్కాయి.