పాక్ ఎల్బీడబ్ల్యూ..విజయం దిశగా భారత్
♦ 29 పరుగులకే 6 వికెట్లు
♦ ఎక్తా బిష్త్ విజృంభణ
డెర్బీ: భారత్ పాక్ మధ్య జరుగుతున్న మహిళా ప్రపంచకప్ లీగ్ మ్యాచ్‌లో భారత్ బౌలర్ ఎక్తా బిష్త్ దాటికి పాక్ టాప్ ఆర్డర్ కుప్పకూలింది. 29 పరుగులకే ఆరు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పాక్ బ్యాట్స్‌ఉమెన్‌లలో నలుగురు ఎల్బీడబ్య్లూ కావడం విశేషం. 170 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ మహిళల జట్టు ఒక్క పరుగుకే తొలి వికెట్ కోల్పోయింది. రెండో ఓవర్ నాలుగో బంతికి ఎక్తా బిష్త్ బౌలింగ్‌లో ఓపెనర్ అయేషా జఫర్ వికెట్ల ముందు దొరికిపోయింది. ఈ వికెట్ ప్రారంభమైన పాక్ పతనం 15 ఓవర్లకు ముగిసేసరికి 6 వికెట్లు కోల్పోయింది. భారత స్పిన్ బౌలర్ ఎక్తా బిష్త్ మూడు వికెట్లతో చెలరేగగా గోస్వామి, దీప్తీ శర్మ, జోషి తలో వికెట్ తీశారు.
అంతకు ముందు బ్యాటింగ్‌కు దిగిన భారత్ 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 169 పరుగులు చేసింది. భారత్ మహిళల్లో పూనమ్ రౌత్ (47), దీప్తీ శర్మ(28), సుష్మా వర్మ(33) లు రాణించారు. గత రెండు మ్యాచుల్లో అదరగొట్టిన శతక వీరమణి సృతి మందన(2), కెప్టెన్ మిథాలీ రాజ్(8) తీవ్రంగా నిరాశపర్చారు.