
ఫస్ట్ బ్యాటింగ్ టీమిండియాదే
కోల్కతా:ఆస్ట్రేలియాతో ఐదు వన్డేల సిరీస్ లో భాగంగా ఇక్కడ ఈడెన్ గార్డెన్ స్టేడియంలో జరుగుతున్న రెండో వన్డేలో టాస్ గెలిచిన టీమిండియా తొలుత బ్యాటింగ్ తీసుకుంది. టాస్ గెలిచిన టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లి మరో మాట లేకుండా ముందుగా బ్యాటింగ్ చేసేందుకు మొగ్గు చూపాడు. ఈ మ్యాచ్ లో భారత జట్టు ఎటువంటి మార్పులు లేకుండా గత జట్టుతోనే బరిలోకి దిగుతుంది. కాగా, ఆసీస్ మాత్రం రెండు మార్పులు చేసింది. ఆస్టన్ ఆగర్, కేన్ రిచర్డ్ సన్ లను ఆసీస్ తుది జట్టులోకి తీసుకుంది. ఈ క్రమంలోనే ఆడమ్ జంపా, ఫాల్కనర్లకు విశ్రాంతినిచ్చింది.
తొలి వన్డేలో విజయం ఇచ్చిన ఉత్సాహంతో ఉన్న భారత జట్టు మరోసారి ఆస్ట్రేలియాను చిత్తు చేసేందుకు సన్నద్ధమైంది. ఒకవైపు భారత్ అన్ని విధాలా పటిష్టంగా కనిపిస్తుండగా... ఆసీస్ ను మాత్రం సమస్యలు వేధిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లోనూ భారత్ గెలిస్తే సిరీస్‌పై పట్టు చిక్కినట్లే. అయితే అన్నింటికి మించి వర్షం మ్యాచ్‌కు అడ్డంకిగా మారవద్దని అభిమానులు కోరుకుంటున్నారు. గత మ్యాచ్‌లో భారత జట్టు విజయం సాధించినా... ఒక లోటు మాత్రం స్పష్టంగా కనిపించింది. ఓపెనర్‌గా అజింక్య రహానే సామర్థ్యంపై ఆ మ్యాచ్ మరోసారి సందేహాలు రేకెత్తించింది. శిఖర్ ధావన్ గైర్హాజరుతో శ్రీలంకపై చివరి వన్డేలో, చెన్నై వన్డేలో ఓపెనర్‌గా అవకాశం దక్కించుకున్న రహానే తన పాత్రకు న్యాయం చేయలేకపోయాడు. దూకుడుగా ఆడలేడంటూ అతనిపై గతంలో వచ్చిన విమర్శలకు రహానే మళ్లీ అవకాశం కల్పిస్తున్నాడు. ఈ మ్యాచ్‌లోనైనా అతను మెరుగ్గా ఆడాల్సి ఉంది.
టీమిండియా తుది జట్టు: విరాట్ కోహ్లి(కెప్టెన్), రోహిత్ శర్మ, అజింక్యా రహానే, మనీష్ పాండే, కేదర్ జాదవ్, ఎంఎస్ ధోని, హార్దిక్ పాండ్యా, భువనేశ్వర్ కుమార్, కుల్దీప్ యాదవ్, యజ్వేంద్ర చాహల్, జస్ప్రిత్ బూమ్రా
ఆసీస్ తుది జట్టు: స్టీవ్ స్మిత్(కెప్టెన్), డేవిడ్ వార్నర్, కార్ట్ రైట్, ట్రావిస్ హెడ్, గ్లెన్ మ్యాక్స్ వెల్, స్టోనిస్, మాథ్యూవేడ్, ఆస్టన్ ఆగర్, కేన్ రిచర్డ్సన్, పాట్ కమిన్స్, కౌల్టర్ నైల్