
ఆసీస్ విజయలక్ష్యం 253
కోల్కతా: ఆస్ట్రేలియాతో ఇక్కడ జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా 253 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా ఆదిలో రోహిత్ శర్మ(7)వికెట్ ను కోల్పోయింది. ఆ తరుణంలో మరో ఓపెనర్ అజింక్యా రహానేకు జతకలిసిన కెప్టెన్ విరాట్ కోహ్లి ఇన్నింగ్స్ ను ముందుకు నడిపించాడు. గత మ్యాచ్ లో విఫలమైన వీరిద్దరూ తాజా మ్యాచ్ లో అర్థ శతకాలతో మెరిశారు. తొలుత కోహ్లి 60 బంతుల్లో 5 ఫోర్లు సాయంతో హాఫ్ సెంచరీ చేయగా, ఆపై రహానే 62 బంతుల్లో 6 ఫోర్లతో అర్థ శతకం సాధించాడు. ఈ క్రమంలోనే వీరిద్దరూ 102 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించిన తరువాత రహానే(55) రెండో వికెట్ గా అవుటయ్యాడు.
కాగా, ఆపై మనీష్ పాండే(3) మరోసారి నిరాశపరచగా, కేదర్ జాదవ్(24) ఫర్వాలేనిపించాడు. దాంతో భారాన్ని తనపై వేసుకున్న కోహ్లి స్కోరును ముందుకు తీసుకెళ్లాడు. అయితే సెంచరీ చేరువైన సమయంలో కోహ్లి(92) ఐదో వికెట్ గా అవుటయ్యాడు. అటు తరువాత హార్దిక్ పాండ్యా(20), భువనేశ్వర్ కుమార్(20) మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో భారత జట్టు 252 పరుగుల వద్ద ఆలౌటైంది. ఆసీస్ బౌలర్లలో కౌల్టర్ నైల్, రిచర్డ్ సన్ లు తలో మూడు వికెట్లు సాధించారు.