ఢిల్లీలో 'తిప్పేశారు' | india won upon west indies at delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో 'తిప్పేశారు'

Published Sun, Oct 12 2014 1:17 AM | Last Updated on Sat, Sep 2 2017 2:41 PM

ఢిల్లీలో 'తిప్పేశారు'

ఢిల్లీలో 'తిప్పేశారు'

తొలి వన్డేలో ఓటమి... రెండో వన్డేలో కనీసం 300 చేసే అవకాశాన్ని చేజేతులా వదులుకున్నారు... అటు ప్రత్యర్థి వెస్టిండీస్ లక్ష్య ఛేదనలో దూసుకుపోతోంది... ఇక భారత్ ఓటమి ఖాయం. సిరీస్ కూడా చేజారినట్లే... ఇలాంటి స్థితిలో భారత బౌలర్లు అద్భుతం చేశారు. పోరాడితే ఫలితాన్ని తారుమారు చేయొచ్చని నిరూపిస్తూ జట్టుకు అద్భుత విజయాన్నందించారు. దీంతో ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో ధోని సేన వెస్టిండీస్‌ను ఓడించి ఐదు వన్డేల సిరీస్‌ను 1-1తో సమం చేసింది.

 న్యూఢిల్లీ: వెస్టిండీస్ లక్ష్యం 264 పరుగులు... స్కోరు 170/2... స్మిత్ సెంచరీకి చేరువయ్యాడు... జట్టులో ఎనిమిదో నంబర్ వరకు స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్. ఇలాంటి స్థితిలో భారత్ మ్యాచ్ గెలుస్తుందనే ఆశ సగటు క్రికెట్ అభిమానికి లేదు. కానీ బౌలర్లు మ్యాజిక్ చేశారు. మంచు కారణంగా స్పిన్నర్లకు బంతిపై పట్టు దొరకని పరిస్థితుల్లోనూ ప్రత్యర్థిని కట్టడి చేయగలిగారు. ఓవరాల్‌గా షమీ, జడేజా, మిశ్రా కలిసి... ఓడిపోతుందనుకున్న మ్యాచ్‌ను గట్టెక్కించారు.

ఫిరోజ్ షా కోట్ల మైదానంలో శనివారం జరిగిన రెండో వన్డేలో భారత్ 48 పరుగుల తేడాతో వెస్టిండీస్‌ను ఓడించింది. టాస్ నెగ్గి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన భారత జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లకు 263 పరుగులు సాధించింది. చాలా రోజుల తర్వాత విరాట్ కోహ్లి (78 బంతుల్లో 62; 5 ఫోర్లు) బ్యాట్‌ను ఝుళిపించగా.. సురేశ్ రైనా (60 బంతుల్లో 62; 5 ఫోర్లు; 2 సిక్సర్లు), కెప్టెన్ ధోని (40 బంతుల్లో 51 నాటౌట్; 5 ఫోర్లు; 1 సిక్స్) కూడా అర్ధ సెంచరీలతో చెలరేగారు.

టేలర్‌కు మూడు వికెట్లు పడ్డాయి. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన విండీస్ 46.3 ఓవర్లలో 215 పరుగులకు ఆలౌటయ్యింది. డ్వేన్ స్మిత్ (97 బంతుల్లో 97 పరుగులు; 11 ఫోర్లు; 2 సిక్సర్లు) ఒంటరి పోరాటం చేశాడు. పొలార్డ్ (50 బంతుల్లో 40; 1 ఫోర్; 3 సిక్సర్లు) మోస్తరుగా ఆడాడు. షమీకి నాలుగు వికెట్లు, జడేజాకు మూడు, మిశ్రాకు రెండు వికెట్లు దక్కాయి. మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ షమీకి దక్కింది. మూడో వన్డే మంగళవారం విశాఖపట్నంలో జరగాల్సి ఉంది.

 మెరిసిన కోహ్లి
 ఆరంభంలో విండీస్ పేసర్లు చెలరేగడంతో ఓపెనర్లు ధావన్ (1), రహానే (12)లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు. వన్‌డౌన్‌లో అంబటి రాయుడు (54 బంతుల్లో 32; 3 ఫోర్లు) ఆకట్టుకునే ప్రయత్నం చేసినా ఎక్కువసేపు నిలబడలేకపోయాడు. దీంతో భారత్ 20 ఓవర్లలోపే 74 పరుగులకు 3 వికెట్లు కోల్పోయింది. ఈ దశలో కోహ్లి, రైనాలు అద్భుతంగా ఆడారు. 14 పరుగుల వద్ద అవుటయ్యే ప్రమాదం నుంచి బయటపడ్డ రైనా... బెన్, రాంపాల్ బౌలింగ్‌లో రెండు అద్భుతమైన సిక్సర్లతో విరుచుకుపడ్డాడు.

కానీ రెండో ఎండ్‌లో కోహ్లి నెమ్మదిగా ఆడటంతో రన్‌రేట్ మందగించింది. నాలుగో వికెట్‌కు 105 పరుగులు జోడించాక వీరిద్దరు స్వల్ప వ్యవధిలో అవుటయ్యారు. చివర్లో వచ్చిన ధోని వేగంగా ఆడాడు. జడేజా (6) తొందరగా అవుటైనా... భువనేశ్వర్ (14 బంతుల్లో 18; 1 ఫోర్)తో కలిసి చకచకా పరుగులు రాబట్టాడు. చివరి 15 ఓవర్లలో 100 పరుగులు రావడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరు చేసింది.

 స్మిత్ ఒంటరిపోరు
 తొలి వికెట్‌కు  64 పరుగులు జోడించిన అనంతరం డారెన్ బ్రేవో (44 బంతుల్లో 26; 2 ఫోర్లు) వెనుదిరగ్గా డ్వేన్ స్మిత్ చెలరేగాడు. ఆరంభంలో నెమ్మదిగానే ఆడినా పొలార్డ్ నుంచి సహకారం అందడంతో జోరు పెంచాడు. 57 బంతుల్లో అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అటు పొలార్డ్ సిక్సర్లతో దూకుడు ప్రదర్శించినా మిశ్రా బౌలింగ్‌లో బౌల్డ్ అయ్యాడు. కోహ్లి వేసిన ఓవర్లో మూడు ఫోర్లు కొట్టిన స్మిత్.. సెంచరీకి చేరువవుతున్న తరుణంలో షమీ వేసిన బంతి ప్యాడ్లను తాకుతూ వికెట్లను ముద్దాడింది.

దీంతో విండీస్ తరఫున కీలక ఇన్నింగ్స్ ముగిసినట్టయ్యింది. 189/4 దగ్గర బంతిని మార్చగా అప్పటికి విండీస్ 59 బంతుల్లో 75 పరుగులు చేస్తే చాలు. అయితే బంతిని మార్చిన వెంటనే అమిత్ మిశ్రా రామ్‌దిన్ (3) వికెట్ పడగొట్టాడు. ఆ మరుసటి ఓవర్‌లో జడేజా రెండు వికెట్లు తీయడంతో ఇక కోలుకోలేకపోయింది. 26 పరుగుల వ్యవధిలోనే చివరి ఐదు వికెట్లు నేలకూలడంతో విండీస్ ఓటమి ఖాయమైంది.

 స్కోరు వివరాలు
 భారత్ ఇన్నింగ్స్: రహానే (సి) డ్వేన్ బ్రేవో (బి) స్యామీ 12; ధావన్ (బి) టేలర్ 1; రాయుడు (సి) స్యామీ (బి) బెన్ 32; కోహ్లి (సి) శామ్యూల్స్ (బి) రాంపాల్ 62; రైనా (సి) పొలార్డ్ (బి) టేలర్ 62; ధోని నాటౌట్ 51; జడేజా (బి) టేలర్ 6; భువనేశ్వర్ (సి) పొలార్డ్ (బి) డ్వేన్ బ్రేవో 18; షమీ నాటౌట్ 1; ఎక్స్‌ట్రాలు: 18; మొత్తం: (50 ఓవర్లలో 7 వికెట్లకు) 263.
 వికెట్ల పతనం: 1-4; 2-50; 3-74; 4-179; 5-196; 6-219; 7-248.
 బౌలింగ్: రాంపాల్ 8-0-47-1; టేలర్ 10-0-54-3; బెన్ 10-0-47-1; డ్వేన్ బ్రేవో 8-0-51-1; స్యామీ 4-0-14-1; శామ్యూల్స్ 5-1-21-0; రస్సెల్ 3-0-14-0; పొలార్డ్ 2-0-10-0
 వెస్టిండీస్ ఇన్నింగ్స్: స్మిత్ (బి) షమీ 97; డారెన్ బ్రేవో (బి) షమీ 26; పొలార్డ్ (బి) మిశ్రా 40; శామ్యూల్స్ (సి) కోహ్లి (బి) ఉమేశ్ యాదవ్ 16; రామ్‌దిన్ (సి) రైనా (బి) మిశ్రా 3; డ్వేన్ బ్రేవో (సి) ధావన్ (బి) షమీ 10; రస్సెల్ (స్లంప్డ్) ధోని (బి) జడేజా 4; స్యామీ (బి) జడేజా 1; రాంపాల్ (సి అండ్ బి) షమీ 16; టేలర్ (సి) భువనేశ్వర్ (బి) జడేజా 0; బెన్ నాటౌట్ 0; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (46.3 ఓవర్లలో ఆలౌట్) 215.
 వికెట్ల పతనం: 1-64; 2-136; 3-170; 4-183; 5-189; 6-195; 7-199; 8-199; 9-201; 10-215.
 బౌలింగ్: భువనేశ్వర్ 7-0-32-0; ఉమేశ్ 9-0-42-1; షమీ 9.3-0-36-4; జడేజా 9-0-44-3; మిశ్రా 10-2-40-2; కోహ్లి 2-0-20-0.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement