
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్-2025లో శ్రీలంక మూడో విజయం నమోదు చేసింది. వెస్టిండీస్‌తో నిన్న (మార్చి 6) జరిగిన మ్యాచ్‌లో ఆ జట్టు 21 పరుగుల తేడాతో గెలుపొందింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక మాస్టర్స్.. కెప్టెన్ కుమరా సంగక్కర (42 బంతుల్లో 47) రాణించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 173 పరుగులు చేసింది. గుణరత్నే (64) అర్ద సెంచరీతో సత్తా చాటాడు.
వీరిద్దరు మినహా లంక ఇన్నింగ్స్‌లో ఒక్కరు కూడా చెప్పుకోదగ్గ స్కోర్ చేయలేదు. తిరుమన్నే (14), ఆఖర్లో చతురంగ (17 నాటౌట్) రెండంకెల స్కోర్లు చేయగలిగారు. జయసింఘే, ప్రసన్న, లక్మల్ డకౌట్లు కాగా.. తరంగ, జీవన్ మెండిస్ తలో పరుగు చేశారు. విండీస్ బౌలర్లలో ఆష్లే నర్స్ 3 వికెట్లు పడగొట్టగా.. టీనో బెస్ట్ 2, జెరోమ్ టేలర్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
అనంతరం 174 పరుగుల లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన వెస్టిండీస్ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 152 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఓపెనర్ డ్వేన్ స్మిత్ (49), లెండిల్ సిమన్స్ 37 (నాటౌట్) విండీస్‌ను గెలిపించేందుకు విఫలయత్నం చేశారు. వీరికి ఇతరుల నుంచి సహకారం లభించకపోవడంతో విండీస్ శ్రీలంక నిర్దేశించిన లక్ష్యాన్ని ఛేదించలేకపోయింది.
చాడ్విక్ వాల్టన్ డకౌట్, నర్సింగ్ డియోనరైన్ 14, జోనాథన్ కార్టర్ 17, ఆష్లే నర్స్ 2 పరుగులు చేసి ఔటయ్యారు. ఆఖర్లో దినేశ్ రామ్‌దిన్ (15 నాటౌట్) వేగంగా పరుగులు సాధించేందుకు ప్రయత్నించినా, అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. లంక బౌలర్లలో ఇసురు ఉడాన పొదుపుగా బౌలింగ్ చేయడంతో పాటు 2 వికెట్లు తీశాడు. చతురంగ డిసిల్వ, జీవన్ మెండిస్ తలో వికెట్ పడగొట్టారు.
ఈ గెలుపుతో న్యూజిలాండ్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి చేరింది. సచిన్ నేతృత్వంలోని భారత్ అగ్రస్థానంలో కొనసాగుతుంది. భారత్, శ్రీలంక తలో 4 మ్యాచ్‌ల్లో 3 విజయాలు సాధించినప్పటికీ.. మెరుగైన రన్‌రేట్ కారణంగా భారత్ టాప్ ప్లేస్‌లో ఉంది. లంక చేతితో ఓటమితో విండీస్ మూడో స్థానానికి పడిపోయింది.
విండీస్ ఇప్పటివరకు జరిగిన 3 మ్యాచ్‌ల్లో 2 విజయాలు సాధించింది. ఆసీస్, ఇంగ్లండ్ నాలుగు, ఐదు స్థానాల్లో ఉన్నాయి. ఈ రెండు జట్లు తలో 3 మ్యాచ్‌లు ఆడి చెరో మ్యాచ్‌లో గెలిచారు. ఈ టోర్నీలో ఇంగ్లండ్ ఇప్పటివరకు ఆడిన 3 మ్యాచ్‌ల్లో ఓటమిపాలై, చిట్ట చివరి స్థానంలో ఉంది.
Comments
Please login to add a commentAdd a comment