బెంగళూరు: నగరంలోని చిన్నస్వామి స్టేడియం వేదికగా టీమిండియాతో అరంగేట్రపు టెస్టు ఆడుతున్న అఫ్గానిస్తాన్ విలవిల్లాడుతోంది.. శుక్రవారం తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన అఫ్గానిస్తాన్ పేకమేడలా కుప్పకూలింది. భారత బౌలర్ల విజృంభణకు ఏదశలోనూ తేరుకోని అఫ్గాన్ 27.5 ఓవర్లలో 109 పరుగులకే తమ తొలి ఇన్నింగ్స్‌ను ముగించింది. దాంతో అఫ్గాన్ ఫాలో ఆన్‌ను ఆడటానికి సిద్ధమైంది. భారత కెప్టెన్ అజింక్యా రహానే ఫాలో ఆన్ ఆడించాలని నిర్ణయించుకున్నాడు.
భారత బౌలరల్లో రవిచంద‍్రన్ అశ్విన్ చెలరేగి బౌలింగ్ చేశాడు. ఎనిమిది ఓవర్లలో నాలుగు వికెట్లు సాధించి అఫ్గానిస్తన్ పతనాన్ని శాసించాడు. అతనికి జతగా ఇషాంత్ శర్మ, రవీంద్ర జడేజాలు తలో రెండు వికెట్లతో మెరవగా, ఉమేశ్ యాదవ్‌కు వికెట్ దక్కింది. అఫ్గానిస్తాన్ ఆటగాళ్లలో మహ్మద్ నబీ(24)దే అత్యధిక స్కోరు కావడం గమనార్హం. షహజాద్(14), జావేద్ అహ్మదీ(1), రహ్మత్ షా(14), అఫ్సర్ జజాయ్(6), అస్గార్ స్టానిక్‌జాయ్(11) లు తీవ్రంగా నిరాశపరిచారు.
అంతకుముందు భారత జట్టు తన తొలి ఇన్నింగ్స్‌లో 474 పరుగులకు ఆలౌటైంది. 347/6 ఓవర్ నైట్ స్కోరుతో శుక్రవారం రెండో రోజు ఆటను కొనసాగించిన భారత్ మరో 127 పరుగులు జోడించి మిగతా నాలుగు వికెట్లను కోల్పోయింది. ఈ రోజు ఆటలో ఓవర్‌నైట్ ఆటగాడు అశ్విన్(7) ఆదిలోనే పెవిలియన్‌కు చేరగా, మరో ఓవర్‌నైట్ ఆటగాడు హార్దిక్ పాండ్యాతో కలిసి రవీంద్ర జడేజా ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క‍్రమంలోనే హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీ సాధించాడు. 83 బంతుల్లో 7 ఫోర్ల సాయంతో అర్థ శతకం పూర్తి చేసుకున్నాడు. అటు తర్వాత కాసేపటికి రవీంద్ర జడేజా(20) ఔట్ కావడంతో 436 పరుగుల వద్ద భారత్ ఎనిమిదో వికెట్‌ను నష్టపోయింది. ఆపై నాలుగు పరుగుల వ్యవధిలో హార్దిక్(71;94 బంతుల్లో 10 ఫోర్లు) సైతం పెవిలియన్ చేరాడు.
ఇక చివర్లో ఉమేశ్ యాదవ్(26 నాటౌట్; 21 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లు) బ్యాట్ ఝుళిపించడంతో భారత్ స్కోరు బోర్డు పరుగులు తీసింది. ఇషాంత్ శర్మ(8)తో కలసి ఆఖరి వికెట్‌కు ఉమేశ్ యాదవ్ 34 పరుగులు జత చేశాడు. ఆ తర్వాత తొలి ఇన్నింగ్స్‌ను ఆరంభించిన అఫ్గాన్ స్వల్ప విరామాల్లో వికెట్లు కోల్పోతూ వచ్చింది. 50 పరుగులకే సగం వికెట్లు కోల్పోయిన అఫ్గాన్.. మరో 59 పరుగులు జోడించి మిగతా వికెట్లను చేజార్చుకుంది. ఫలితంగా అఫ్గాన్ 365 పరుగుల వెనుబడింది.
Comments
Please login to add a commentAdd a comment