పెర్త్: ఆస్ట్రేలియా పర్యటనలో ‘ఎ’ జట్టుపై రాణించిన భారత హాకీ టీం అసలు పోరులో చిత్తయింది. ఆస్ట్రేలియా ప్రధాన జట్టుతో బుధవారం జరిగిన తొలి టెస్టులో భారత్ 0–4తో కంగుతింది. ఆసీస్ తరఫున బ్లేక్ గోవర్స్ (15, 60వ నిమిషాల్లో), జెరెమీ హేవర్డ్ (20, 59వ నిమిషాల్లో) చెరో 2 గోల్స్ చేసి జట్టుకు ఘనవిజయాన్నిచ్చారు. ఆరంభంలో భారత ఆటగాళ్లే మెరుగ్గా ఆడారు. స్వల్ప వ్యవధిలో రెండు సార్లు ప్రత్యర్థి గోల్‌పోస్టే లక్ష్యంగా దూసుకెళ్లారు. కానీ స్కోరు చేయలేకపోయారు. తొలి క్వార్టర్ ఐదో నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ గోల్‌గా మలచలేకపోయాడు. మళ్లీ 12వ నిమిషంలో కూడా పెనాల్టీ కార్నర్ లభించినా హర్మన్‌ప్రీత్ విఫలమయ్యాడు. నీలకంఠ శర్మతో సమన్వయం కుదరక గోల్ అవకాశం మళ్లీ చేజారింది. క్షణాల వ్యవధిలో తొలిక్వార్టర్ ముగుస్తుందనగా గోవర్స్ అందివచ్చిన పెనాల్టీ కార్నర్‌ను గోల్‌గా మలిచి ఆసీస్‌కు శుభారంభాన్నిచ్చాడు.
రెండో క్వార్టర్ మొదలైన ఐదు నిమిషాలకే మరో పెనాల్టీ కార్నర్‌ను హేవర్డ్ గోల్‌గా మలిచాడు. దీంతో 2–0తో ఆసీస్ ఆధిక్యంలోకి దూసుకెళ్లడంతో ఒక్కసారిగా భారత శిబిరం ఒత్తిడిలో కూరుకుపోయింది. అయితే మూడో క్వార్టర్‌లో ఇరు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడటంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. ఆఖరి క్వార్టర్ ఆరంభంలో భారతే బాగా ఆడినా... మళ్లీ ఫినిషింగ్ ఆస్ట్రేలియాదే అయింది. కెప్టెన్ మన్‌ప్రీత్ సింగ్ గోల్ చేసేందుకు కదం తొక్కినా... ఆస్ట్రేలియన్ డిఫెండర్ డర్స్ అద్భుతంగా డైవ్ చేసి మన్‌ప్రీత్ షాట్‌ను నీరుగార్చాడు. 51వ నిమిషంలో పెనాల్టీ కార్నర్ లభిస్తే మరోసారి హర్మన్‌ప్రీత్ విఫలమయ్యాడు. కానీ ప్రత్యర్థి జట్టు నుంచి హేవర్డ్, గోవర్స్ ఇద్దరూ రెండో గోల్‌తో జట్టుకు విజయాన్ని అందించారు. రెండు మ్యాచ్‌ల సిరీస్‌లో ఇరు జట్ల మధ్య శుక్రవారం ఆఖరి పోరు జరుగనుంది.
Comments
Please login to add a commentAdd a comment