ఆసియా క్రీడల అథ్లెటిక్స్ విభాగంలో భారత్ బోణీ చేసింది. ఆసియా నంబర్‌వన్ షాట్‌పుటర్‌గా తనపై ఉన్న అంచనాలను నిలబెట్టుకుంటూ పంజాబీ బిడ్డ తేజీందర్‌పాల్ సింగ్ తూర్ బంగారు పతకంతో మెరిశాడు. 7 కేజీల 260 గ్రాముల బరువు ఉండే ఇనుప గుండును ఏకంగా 20.75 మీటర్ల దూరం విసిరి ఆసియా క్రీడల్లో కొత్త రికార్డుతో సత్తా చాటాడు. తాజా విజయంతో కలిపి మన స్వర్ణాల సంఖ్య ఏడుకు చేరగా... స్క్వాష్‌లో మరో మూడు కాంస్యాలు దక్కడంతో శనివారం నాలుగు పతకాలు భారత్ ఖాతాలో పడ్డాయి. మొత్తంగా 29 పతకాలతో భారత్ ఎనిమిదో స్థానంలో ఉంది.
జకార్తా: ఆసియా క్రీడల్లో వరుసగా ఏడో రోజు కూడా పతకాలు సాధించిన జట్ల జాబితాలో భారత్ నిలిచింది. 24 ఏళ్ల తేజీందర్‌పాల్ సింగ్ తూర్ విసిరిన గుండు బంగారాన్ని తెచ్చి పెట్టింది. పురుషుల షాట్‌పుట్‌లో తేజీందర్ స్వర్ణం సాధించడంతో అథ్లెటిక్స్‌లో మన ఖాతాలో మొదటి పతకం చేరింది. ఆరు ప్రయత్నాల్లో అత్యుత్తమంగా షాట్‌పుట్‌ను 20.75 మీటర్ల దూరం విసిరిన తేజీందర్ అగ్రస్థానంలో నిలిచాడు. ఈ ఈవెంట్‌లో ల్యూ యాంగ్ (19.52 మీటర్లు–చైనా), ఇవాన్ ఇవనోవ్ (19.40 మీటర్లు–కజకిస్తాన్) రజత, కాంస్యాలు గెలుచుకున్నారు.
ఐదో ప్రయత్నంలో...
ఆసియా క్రీడల్లో పతకం గెలుచుకునే క్రమంలో తేజీందర్ పాల్ ఆరేళ్ల క్రితం నాటి జాతీయ రికార్డును కూడా బద్దలు కొట్టాడు. 2012లో ఓంప్రకాశ్ కర్హానా 20.69 మీటర్లతో నెలకొల్పిన జాతీయ రికార్డును తేజీందర్ తెరమరుగు చేశాడు. శనివారం జరిగిన ఈవెంట్‌లో తేజీందర్ తొలి ప్రయత్నంలో 19.96 మీటర్లు గుండు విసరగా, రెండో ప్రయత్నంలో అది తగ్గి 19.15 మీటర్లకు చేరింది. మూడో ప్రయత్నం ‘ఫౌల్’గా తేలింది. నాలుగోసారి కూడా 19.96 మీటర్లే విసిరిన తేజీందర్... తర్వాతి ప్రయత్నంలో తన పవర్ చూపించాడు. రికార్డు స్థాయిలో 20.75 మీటర్లు గుండు దూసుకెళ్లింది. చివరిసారి అతను 20.00 మీటర్లకే పరిమితమయ్యాడు. అయితే దానిని అందుకోవడం ల్యూ వల్ల కాకపోగా...ఈసారి అతను ఫౌల్ చేశాడు. దాంతో భారత షాట్ పుటర్‌కు స్వర్ణం ఖాయమైంది.
హిమ దాస్ కొత్త రికార్డు...
అథ్లెటిక్స్‌లో మరో భారత జాతీయ రికార్డు బద్దలైంది. మహిళల 400 మీటర్ల పరుగు (క్వాలిఫయింగ్)లో హిమ దాస్ 51.00 సెకన్ల టైమింగ్ నమోదు చేసి ఫైనల్‌కు అర్హత సాధించింది. ఈ క్రమంలో 2004లో మన్‌జీత్ కౌర్ (51.05 సెకన్లు) నెలకొల్పిన రికార్డును హిమ చెరిపేసింది. హిమ దాస్‌తోపాటు భారత్‌కే చెందిన నిర్మల కూడా ఫైనల్‌కు అర్హత పొందింది. మహిళల 100 మీ. పరుగు సెమీఫైనల్‌కు ద్యుతీచంద్ అర్హత సాధించింది. హీట్స్‌లో ఆమె 11.38 సెకన్లలో పరుగు పూర్తి చేసి రెండో స్థానంలో నిలిచింది. ఇతర అథ్లెట్లలో మొహమ్మద్ అనస్, రాజీవ్ అరోకియా (400 మీ.), ఎం. శ్రీశంకర్ (లాంగ్‌జంప్), చేతన్ బాలసుబ్రహ్మణ్య (హైజంప్) కూడా ఫైనల్‌కు క్వాలిఫై అయ్యారు. అయితే మహిళల 10 వేల మీటర్ల పరుగులో సూరియా లోగనాథన్ (ఆరో స్థానం), సంజీవని బాబూరావు (9వ స్థానం), సరితా సింగ్ (హ్యామర్ త్రో–ఐదో స్థానం) విఫలమై నిరాశగా వెనుదిరిగారు.
గుండె నిబ్బరంతో...
తేజీందర్‌పాల్ తండ్రి కరమ్ సింగ్ గత రెండేళ్లుగా క్యాన్సర్‌తో బాధ పడుతున్నాడు. అయితే ఇలాంటి స్థితిలోనూ అతని కుటుంబం, సన్నిహితులు అండగా నిలిచి లక్ష్యం దిశగా తేజీందర్‌ను ప్రోత్సహించారు. తండ్రి ఆస్పత్రిలో ఉన్న సమయంలో దగ్గరుండి చూసుకోవాల్సిన అవసరం లేకుండా మిత్రులే అన్ని రకాలుగా సహకారం అందించారు. అతనిపై ఎలాంటి ఒత్తిడి లేకుండా, ఏకాగ్రత కోల్పోకుండా ప్రాక్టీస్ చేసే విధంగా అండగా నిలిచారు. ఈ నేపథ్యంలో తేజీందర్ సాధించిన స్వర్ణం అతడికి ఎంతో ప్రత్యేకమైంది. ‘నా గెలుపు వెనక ఎంతో మంది త్యాగం ఉంది.
ధర్మశాలలో ప్రాక్టీస్ కారణంగా ఇంటి కోసం, నాన్న కోసం సమయం కేటాయించలేకపోయాను. కానీ నా వాళ్ల కారణంగా ఈ గెలుపు సాధ్యమైంది. అందుకే నా జీవితంలో ఇది అతి పెద్ద విజయంగా భావిస్తున్నా. పతకంతో వెళ్లి నాన్నను కలుస్తా’ అని 6 అడుగుల 4 అంగుళాల ఎత్తు, 135 కేజీల బరువున్న తేజీందర్ ఉద్వేగంగా చెప్పాడు. గత ఏడాది జూన్‌లో జాతీయ అథ్లెటిక్స్ ఈవెంట్ ఫెడరేషన్ కప్‌లో 20.40 మీటర్ల దూరం షాట్‌పుట్ విసరడం తేజీందర్‌కు మంచి గుర్తింపు తెచ్చి పెట్టింది. కొద్ది రోజులకే ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో రజత పతకం సాధించి అతను సత్తా చాటాడు.
తుర్క్‌మెనిస్తాన్‌లో జరిగిన ఆసియా ఇండోర్ చాంపియన్‌షిప్‌లో కూడా రెండో స్థానంలో నిలిచాడు. అయితే ఈ ఏడాది కామన్వెల్త్ క్రీడల్లో 19.42 మీటర్ల దూరం మాత్రమే గుండు విసిరి ఎనిమిదో స్థానంలో నిలవడంతో తీవ్రంగా నిరాశ చెందిన తేజీందర్... ఇప్పుడు ఆసియా క్రీడల్లో స్వర్ణంతో లెక్క సరి చేశాడు. శనివారం ఈవెంట్‌లో 21 మీటర్లు దాటాలనే లక్ష్యంతో బరిలోకి దిగానన్న ఈ అథ్లెట్... గత కొన్నేళ్లుగా జాతీయ రికార్డును బద్దలు కొట్టాలనే ప్రయత్నం ఇప్పుడు నిజమైనందుకు సంతోషం వ్యక్తం చేశాడు.
9
ఆసియా క్రీడల చరిత్రలో పురుషుల షాట్‌పుట్ ఈవెంట్‌లో భారత అథ్లెట్‌కు స్వర్ణం లభించడం ఇది తొమ్మిదోసారి. గతంలో మదన్‌లాల్ (1951), పార్థుమన్ సింగ్ బ్రార్ (1954, 1958), జోగీందర్ సింగ్ (1966, 1970), బహదూర్ సింగ్ చౌహాన్ (1978, 1982), బహదూర్ సింగ్ సాగూ (2002) ఈ ఘనత సాధించారు.
హిమ
Comments
Please login to add a commentAdd a comment