న్యూఢిల్లీ: సరిహద్దు వివాదం కారణంగా చైనా వస్తువులను బహిష్కరించాలంటూ మన దేశంలో అన్ని వైపుల నుంచి పిలుపు వస్తోంది. ఈ నేపథ్యంలో భారత వెయిట్‌లిఫ్టింగ్ సమాఖ్య (ఐడబ్ల్యూఎల్‌ఎఫ్) ఒక అడుగు ముందుకు వేసింది. చైనా తయారు చేసిన వెయిట్‌లిఫ్టింగ్ సెట్‌లను తాము ఇకపై వాడబోమని ప్రకటించింది. బార్‌బెల్స్, వెయిట్ ప్లేట్స్‌లతో కూడిన నాలుగు సెట్‌లను గతంలో ‘జెడ్‌కేసీ’ అనే చైనా కంపెనీకి ఆర్డర్ ఇచ్చి సమాఖ్య తెప్పించింది. ఇప్పుడు వాటిని పక్కన పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (సాయ్)కు ఐడబ్ల్యూఎల్‌ఎఫ్ ప్రధాన కార్యదర్శి సహదేవ్ యాదవ్ లేఖ రాశారు. ‘చైనా ఎక్విప్‌మెంట్‌ను మనం నిషేధించాల్సిందే. మున్ముందు కూడా ఆ దేశపు వస్తువులు ఏవీ వాడరాదని సమాఖ్య నిర్ణయం తీసుకుంది. ఇదే విషయాన్ని ప్రభుత్వానికి తెలియజేశాం. భవిష్యత్తులో భారత కంపెనీలు గానీ లేదా ఇతర దేశాల కంపెనీలు తయారు చేసిన ఎక్విప్‌మెంట్‌లు వాడతాం కానీ చైనా వస్తువులు మాత్రం ముట్టం’ అని యాదవ్ స్పష్టం చేశారు.
నాసిరకంగా ఉన్నాయి...
మరోవైపు నిషేధాన్ని సమర్థిస్తూనే భారత వెయిట్ లిఫ్టింగ్ జాతీయ కోచ్ విజయ్ శర్మ మరో కారణాన్ని కూడా చూపారు. ఎక్విప్‌మెంట్ నాసిరకంగా ఉండటం వల్లే పక్కన పడేస్తున్నామని ఆయన వెల్లడించారు. టోక్యో ఒలింపిక్స్‌లో చైనా వెయిట్స్‌నే వాడతారు కాబట్టి మరో ప్రత్యామ్నాయం లేక సన్నాహాల కోసం తాము గతంలో వాటికి ఆర్డర్ ఇచ్చామని, ఇప్పుడు ఇతర కంపెనీల ఎక్విప్‌మెంట్‌కు అలవాటు పడతామని కోచ్ చెప్పారు. ‘లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత లిఫ్టర్లు వాటిని వాడే ప్రయత్నం చేస్తే అవి ఏమాత్రం బాగా లేవని అర్థమైంది. దాంతో మూలన పడేశాం. మా లిఫ్టర్లంతా కూడా చైనా తయారీ వస్తువులను వాడేందుకు ఇష్టపడటం లేదు. ప్రస్తుతం స్వీడిష్ కంపెనీ ‘ఎలికో’కు చెందిన ఎక్విప్‌మెంట్‌తో సాధనకు సిద్ధమయ్యాం. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ టోర్నీలు ‘ఎలికో’తోనే నిర్వహిస్తారు. భారతీయ తయారీదారులతో సహా ప్రస్తుతం ఎన్నో ప్రత్యామ్నాయాలు అందుబాటులో ఉన్నాయి. ఇలాంటప్పుడు చైనా ఉత్పత్తులు అవసరం ఏముంది’ అని ఆయన ప్రశ్నించారు.
Comments
Please login to add a commentAdd a comment