న్యూఢిల్లీ : పాటియాలాలో జరుగుతోన్న జాతీయ బాక్సింగ్ క్యాంపులోకి తన కోచ్ అనిల్ ధన్‌కర్‌ను అనుమతించాల్సిందిగా భారత మేటి బాక్సర్, ఆసియా క్రీడల విజేత అమిత్ పంఘాల్ భారత క్రీడా ప్రాధికార సంస్థ (సాయ్)ను కోరాడు. 52 కేజీల విభాగంలో వరల్డ్ నంబర్‌వన్ బాక్సర్ అయిన అమిత్ ఇదే విషయాన్ని క్రీడా మంత్రిత్వ శాఖ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు చెప్పాడు.
‘నేను కేవలం విజ్ఞప్తి మాత్రమే చేయగలను. సాయ్‌తో పాటు కేంద్రాన్ని కూడా కోరాను. వారి స్పందన కోసం వేచి చూస్తున్నా. ఇప్పటివరకు ఎవరూ దీనిపై స్పందించలేదు. వారి నిర్ణయం ఏదైనప్పటికీ నాకు కనీసం సమాధానం ఇవ్వాలి కదా. నా కోచ్ అనిల్ ఎన్‌ఐఎస్‌లో శిక్షణ పొందారు. ఆయన ‘ఐబా’ వన్ స్టార్ కోచ్. ఒలింపిక్స్ సన్నాహాల కోసం ఆయన అవసరం నాకెంతో ఉంది. ఒలింపిక్స్ క్వాలిఫయింగ్ పోటీలకు ముందు కూడా నేను ఇదే ప్రతిపాదన చేశాను. ఇప్పటికీ ఎలాంటి సమాధానం రాలేదు’ అని 24 ఏళ్ల అమిత్ అసంతృప్తి వ్యక్తం చేశాడు. ప్రపంచ చాంపియన్‌షిప్‌లో భారత్ తరఫున రజతం సాధించిన ఏకైక బాక్సర్‌గా అమిత్ ఘనత సాధించాడు.
Comments
Please login to add a commentAdd a comment