54 పరుగులకే కూల్చేశారు..
బ్యాంకాక్: ఆసియాకప్ క్రికెట్ టోర్నీలో భాగంగా బంగ్లాదేశ్ మహిళలతో జరిగిన ఆరంభపు ట్వంటీ 20 మ్యాచ్లో భారత మహిళలు చెలరేగిపోయారు. బంగ్లాదేశ్ మహిళల్ని 54 పరుగులకే కూల్చేసి 64 పరుగుల తేడాతో ఘన విజయం సాధించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది.భారత క్రీడాకారిణుల్లో మిథాలీ రాజ్(49) తృటిలో హాఫ్ సెంచరీ కోల్పోగా, స్మృతీ మందనా(41) ఆకట్టుకుంది. ఈ జోడి తొలి వికెట్కు 70 పరుగుల భాగస్వామ్యాన్ని సాధించి భారత్ ను పటిష్ట స్థితికి తీసుకెళ్లింది. కాగా, ఆ తరువాత హర్మన్ ప్రీత్ కౌర్(19) మినహా ఎవరూ రాణించకపోవడంతో భారత్ గౌరవప్రదమైన స్కోరుకే పరిమితమైంది.
అయితే ఆపై 119 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ఆరంభించిన బంగ్లాదేశ్ 13 పరుగుకే మూడు వికెట్లను నష్టపోయి కష్టాల్లో పడింది.కాగా, సల్మా ఖాతున్(17), షాలియా షర్మిన్(18) మోస్తరుగా ఫర్వాలేదనిపించడంతో బంగ్లాదేశ్ 50 పరుగుల మార్కును దాటింది. వీరిద్దరూ అవుటైన తరువాత బంగ్లా కథ మళ్లీ మొదటికొచ్చింది. కనీసం క్రీజ్లో నిలుచునే ప్రయత్నం చేయకుండానే బంగ్లా క్రీడాకారిణులు క్యూకట్టేశారు. భారత మహిళల్లో పూనమ్ యాదవ్ మూడు వికెట్లు, గోస్వామి, అనుజా పాటిల్ తలో రెండు వికెట్లు సాధించారు. మన్షీ జోషి, ఏక్తా బిస్త్లకు చెరో వికెట్ దక్కింది.