ఫైనల్లో పాక్పై భారత్ విజయం
బ్యాంకాక్:మహిళల ఆసియాకప్ ట్వంటీ 20 టోర్నీలో భారత్ విజేతగా నిలిచింది. ఆదివారం జరిగిన తుదిపోరులో పాకిస్తాన్పై భారత్ 17 పరుగుల తేడాతో గెలిచి ట్రోఫీని సాధించింది. భారత్ విసిరిన 122 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్తాన్ పోరాడి ఓడింది. పాక్ క్రీడాకారిణుల్లో అయేషా జాఫర్(15),జావిరియా ఖాన్(22), బిస్మా మరూఫ్(25) ఫర్వాలేదనిపించినా, మిగతా వారు విఫలం కావడంతో ఆ జట్టుకు ఓటమి తప్పలేదు.
దాదాపు పది ఓవర్ల వరకూ మ్యాచ్ పాక్ వైపు మొగ్గగా, చివరి ఓవర్లలో భారత్ పైచేయి సాధించి గెలుపును సొంతం చేసుకుంది. చివరి రెండు ఓవర్లలో పాకిస్తాన్ 32 పరుగులు చేయాల్సి రావడంతో అది వారికి కష్ట సాధ్యంగా మారింది. పాకిస్తాన్ 20.0 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 104 పరుగులే చేసి ఓటమి పాలైంది. భారత బౌలర్లలో ఏక్తా బిస్త్ రెండు వికెట్లు సాధించగా,అనూజా పటేల్,జులాన్ గోస్వామి, శిఖా పాండే,ప్రీతి బోస్లకు తలో వికెట్ దక్కింది.
అంతకుముందు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత ఓవర్లలో ఐదు వికెట్ల నష్టానికి 121 పరుగులు చేసింది. భారత ఓపెనర్ మిథాలీ రాజ్ ( 73 నాటౌట్;65 బంతుల్లో 7 ఫోర్లు1 సిక్స్) ఒంటరి పోరాటం చేసి జట్టు గౌరవప్రదమైన స్కోరు చేయడంలో పాలు పంచుకుంది. మరోవైపు మిథాలికీ జులాన్ గోస్వామి(17) కొద్దిపాటి సహకారం అందించి జట్టును కాపాడింది. భారత మిగతా క్రీడాకారిణుల్లోమందనా(6),మేఘనా(9), వేదా కృష్ణమూర్తి(2), కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్(5)లు ఘోరంగా విఫలమయ్యారు.
'ఆరే'సిన భారత్
ఇప్పటివరకే ఆరు ఆసియాకప్ మహిళా టోర్నీలు జరగ్గా ఆరింటిలో భారత్ విజేతగా నిలవడం విశేషం. 2004లో మహిళల వన్డే ఆసియాకప్ ఆరంభమైంది. అప్పట్నుంచి 2008 వరకూ నాలుగు వన్డే ఆసియాకప్లు జరగ్గా, ఆ తరువాత రెండు టీ 20 ఆసియాకప్లు జరిగాయి. చివరిసారి 2012లో జరిగిన మహిళల ఆసియాకప్ టీ 20 ఫైనల్లో పాక్పై భారత్ 19 పరుగుల తేడాతో గెలుపొందింది. నాలుగేళ్ల తరువాత అదే ఫలితాన్ని భారత్ పునరావృతం చేసింది.