స్మృతి మంధన
కింబేర్లీ : ఐసీసీ మహిళల చాంఫియన్‌షిప్‌లో భాగంగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో భారత ఓపెనర్ స్మృతి మంధన సెంచరీతో కదం తొక్కారు. తొలి వన్డేలో 88 పరుగులతో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన ఈ లేడీ సూపర్ స్టార్ తాజా మ్యాచ్‌లో సైతం చెలరేగారు. మంధన135(129 బంతులు, 14ఫోర్లు, 1సిక్సు)కు తోడు వైస్‌కెప్టెన్ హర్మన్ ప్రీత్(55), వేదకృష్ణమూర్తి(51) మెరుపులు మెరిపించడంతో మిథాలీసేన ఆతిథ్య జట్టుకు 303 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్ధేశించింది.
టాస్ గెలిచిన ప్రొటీస్ జట్టు బౌలింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్‌కు దిగిన మిథాలీ సేనకు ఓపెనర్లు మంచి శుభారంభాన్నే అందించారు. 56 పరుగుల వద్ద భారత్ పూనమ్ రౌత్(20) క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగారు.మరి కొద్దిసేపటికి మిథాలీ (20) రిటర్న్ క్యాచ్‌గా అవుటయ్యారు. తర్వాత క్రీజులోకి వచ్చిన హర్మన్ ప్రీత్ కౌర్, మంధనలు ఆచితూచి ఆడుతూ భారత ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించారు. ఈ తరుణంలో 116 బంతులు ఎదుర్కొన్న మంధన 9 ఫోర్లతో సెంచరీ పూర్తి చేసుకున్నారు.
అనంతరం బ్యాటింగ్ వేగాన్ని పెంచిన ఈ లేడీ డాషింగ్ ఓపెనర్ జట్టుస్కోరు 241 పరుగుల వద్ద క్యాచ్ అవుట్‌గా వెనుదిరిగారు. దీంతో మూడో వికెట్‌కు నమోదైన 134 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. చివర్లో హర్మన్ 55(69 బంతులు, 2ఫోర్లు,1 సిక్సు), వేదకృష్ణమూర్తి 51(33 బంతులు, 6 ఫోర్లు, 1 సిక్సు)లు మెరుపులు మెరిపించారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లకు భారత మహిళలు మూడు వికెట్లు కోల్పోయి 302 పరుగులు చేశారు. ప్రొటీస్ మహిళా బౌలర్లలో కలాస్, లూస్, రైసిబ్‌లకు తలా ఓవికెట్ దక్కింది.
Comments
Please login to add a commentAdd a comment