డీఆర్‌ఎస్ కోచ్ కావలెను!
పుణే టెస్టులో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో భారత జట్టు నాలుగు సార్లు ‘రివ్యూ’ను ఉపయోగించుకుంది. నాలుగు సార్లూ ఫలితం మనకు ప్రతికూలంగానే వచ్చింది. అదే ఆస్ట్రేలియా ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో ఒకే ఒక్కసారి రివ్యూ కోరింది. దానికి ఫలితం పొందడంలో సఫలమైంది. భారత్ బ్యాటింగ్ సమయంలో మూడింటిలో ఒకదాంట్లో మాత్రం విజయవంతమైంది. ఆస్ట్రేలియా రెండో ఇన్నింగ్స్‌లో జయంత్ బౌలింగ్‌లో మూడు బంతుల వ్యవధిలో రెండు సార్లు విఫల రివ్యూ కోరి భారత్ వాటిని కోల్పోయింది. కొద్దిసేపటి తర్వాత జడేజా బౌలింగ్‌లో స్మిత్ కచ్చితంగా అవుటయ్యే అవకాశం ఉన్నా... రివ్యూలు లేకపోవడంతో ఏమీ చేయలేకపోయింది.
భారీ లక్ష్య ఛేదన... సుదీర్ఘ ఇన్నింగ్స్‌లో రివ్యూ అవసరం మున్ముందు కూడా రావచ్చని భారత ఓపెనర్లు భావించలేదు. రివ్యూ జట్టు కోసం కాదు తమ కోసం అన్నట్లుగా విజయ్, రాహుల్ ప్రవర్తించారు. అవుట్ అయ్యే అవకాశం ఉందని అర్థమవుతున్నా అంపైర్ ఎల్బీ అని ప్రకటించగానే వీరిద్దరు నిర్లక్ష్యంగా రివ్యూ కోరారు. ఉన్న రెండు రివ్యూలు కూడా ఐదు బంతుల వ్యవధిలో వృథా అయిపోవడంతో ఆ తర్వాత సాహా, పుజారా అవుట్‌ల సమయంలో కనీసం ఆలోచించాల్సిన అవసరం కూడా లేకపోయింది. మన బ్యాటింగ్ వైఫల్యంతో ఇది పెద్దగా కనపడలేదు కానీ డీఆర్‌ఎస్ కోరడంలో మనం ఇంకా ఎంత వెనుకబడి ఉన్నామనేది మాత్రం అర్థమైపోయింది.
సాక్షి క్రీడా విభాగం : దాదాపు ఎనిమిదేళ్ల పాటు భారత్ అంపైర్ నిర్ణయ సమీక్షా పద్ధతి (డీఆర్‌ఎస్)ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఎట్టకేలకు గత ఇంగ్లండ్ సిరీస్ నుంచే దీనిని వాడేందుకు అంగీకారం తెలిపింది. ఇంగ్లండ్ సిరీస్‌లోనే మన డీఆర్‌ఎస్ సమస్యలు బయటపడినా... ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో పరిస్థితి మరీ ఇబ్బందికరంగా కనిపించింది. తుది ఫలితం చూస్తే ఇంతకంటే డీఆర్‌ఎస్ లేని రోజులే బాగున్నాయి అన్నట్లుగా టీమిండియాకు అనిపిస్తూ ఉంటుంది. టెస్టు క్రికెటర్ అయి ఉండీ కనీస అవగాహన, అంచనా లేకుండా గుడ్డెద్దు చేలో పడ్డట్లు మనోళ్లు సమీక్ష కోరడం జట్టు పరంగా చూస్తే పెద్ద తప్పే.
చివరి ఇన్నింగ్స్‌లో కోహ్లి తొందరగానే నిష్క్రమించాడు గానీ నిజంగానే అతను సమీక్షలో బయటపడగలిగే పరిస్థితి వచ్చి రివ్యూ అందుబాటులో లేకపోతే నంబర్‌వన్ బ్యాట్స్‌మన్ పరిస్థితి ఎలా ఉంటుంది? ‘ఏమో మన అదృష్టం పరీక్షించుకుందాం అని ప్రయత్నం చేయడం జట్టు ప్రయోజనాలను పణంగా పెట్టడమే. భారత్ డీఆర్‌ఎస్ వాడటంలో చాలా మెరుగుపడాలి’ అని స్పిన్ దిగ్గజం షేన్ వార్న్ అభిప్రాయపడ్డారు. ‘రివ్యూల విషయంలో భారత్ నన్ను షాక్‌కు గురి చేసింది.
చివరి ఇన్నింగ్స్‌లో ఎంతో జాగ్రత్తగా ఉండాలి. అసలు రాహుల్ దానికి ఎలా రివ్యూ కోరాడు’ అని రవిశాస్త్రి విమర్శించారు. ఇక రివ్యూ లేకపోవడంతో బతికిపోయిన ఆసీస్ కెప్టెన్ స్టీవ్ స్మిత్ వ్యాఖ్య కూడా పుండు మీద కారం చల్లేలా ఉంది. ‘భారత జట్టులో ఇద్దరు బ్యాట్స్‌మెన్ అంత తొందరగా రివ్యూ వాడుకోవడం మా అదృష్టం. ఇలాంటి వికెట్‌పై కచ్చితంగా రివ్యూ అవసరం పడుతుంది. కనీసం ఒకదానిని భద్రంగా దాచుకుంటేనే మంచిది’ అని స్మిత్ అన్నాడు.
నేర్చుకోవాల్సిన సమయం...
టెస్టు కెప్టెన్‌గా ఇప్పటికే ఘనమైన రికార్డుతో ఉన్న కోహ్లి డీఆర్‌ఎస్ విషయంలో మాత్రం తప్పటడుగులు వేస్తూనే ఉన్నాడు. ముఖ్యంగా బౌలింగ్/ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో కోహ్లి పూర్తిగా అంచనాలు తప్పుతున్నాడు. ఫీల్డింగ్ కెప్టెన్‌గా అతను ఇప్పటి వరకు 39 సార్లు రివ్యూ కోరగా 30 సార్లు ఫలితం భారత్‌కు ప్రతికూలంగా రావడం ఈ విషయాన్ని సూచిస్తోంది. తన స్పిన్నర్లు, కీపర్ సాహా మీద అతను చూపిస్తున్న అపార నమ్మకం ఫలితాన్నివ్వడం లేదు. ఎందుకంటే అశ్విన్, జడేజాల బౌలింగ్‌లో 24 సార్లు రివ్యూ కోరితే 18 సార్లు మనదే తప్పని తేలింది! సమీక్ష కోరితే కచ్చితంగా మన వైపే వస్తుందనే హామీ అయితే ఎవరూ ఇవ్వలేరు కానీ మ్యాచ్ గమనాన్ని బట్టి దానిని సమర్థంగా వాడుకోవడం కూడా కీలకం.
విజయ్, రాహుల్ నిర్ణయం పట్ల కోహ్లి కచ్చితంగా తీవ్ర కోపానికి గురయ్యే ఉంటాడని ఆసీస్ మాజీ కెప్టెన్ మైకేల్ క్లార్క్ అభిప్రాయపడ్డారు. వాస్తవానికి సాధ్యమైనంతగా అంపైర్ పొరపాట్లను తగ్గించి సరైన నిర్ణయం వెలువరించడమే డీఆర్‌ఎస్ ప్రధాన ఉద్దేశం. కానీ ఆటగాళ్లకు రివ్యూ కోరే అవకాశం ఇవ్వడంతో అంతా గందరగోళంగా మారుతోంది. ఇంతకంటే మెరుగైన పద్ధతి గురించి ఐసీసీ ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలా కాకుండా ఇది ఇలాగే కొనసాగితే భారత జట్టుకు ప్రాక్టీస్‌తో పాటు ప్రత్యేకంగా డీఆర్‌ఎస్ అవగాహనా తరగతులు కూడా నిర్వహించాల్సిన అవసరం వస్తుందేమో!