‘పసిడి’ వేట మొదలు...
♦ భారత్‌కు తొలి రోజే 14 స్వర్ణాలు
♦ దక్షిణాసియా క్రీడలు
గువాహటి: ఆతిథ్య దేశం భారత్ తొలి రోజే అదరగొట్టింది. దక్షిణాసియా క్రీడల్లో తమ ఆధిపత్యాన్ని మరోమారు చాటుకుంది. పోటీలు మొదలైన మొదటి రోజు శనివారం భారత్ ఏకంగా 14 స్వర్ణ పతకాలను సొంతం చేసుకుంది. రెజ్లింగ్‌లో ఐదు, సైక్లింగ్‌లో రెండు, వెయిట్‌లిఫ్టింగ్‌లో మూడు, స్విమ్మింగ్‌లో నాలుగు బంగారు పతకాలు లభించాయి. మరోవైపు శ్రీలంక నాలుగు స్వర్ణాలు దక్కించుకోగా, పాకిస్తాన్ ఖాతాలో ఒక పసిడి పతకం చేరింది.
మహిళల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో ప్రియాంక సింగ్ (48 కేజీలు),అర్చన తోమర్ (55 కేజీలు), మనీషా (60 కేజీలు)... పురుషుల ఫ్రీస్టయిల్ రెజ్లింగ్‌లో రవీంద్ర (57 కేజీలు), రజనీశ్ (65 కేజీలు) విజేతలుగా నిలిచి భారత్‌కు బంగారు పతకాలను అందించారు. ఫైనల్స్‌లో ప్రియాంక 4-0తో సుమిత్ర (నేపాల్)పై, అర్చన 4-0తో సుమా చౌదరీ (బంగ్లాదేశ్)పై, మనీషా 4-0తో కబిత (నేపాల్)పై గెలిచారు. రవీంద్ర 3-0తో బిలాల్ (పాకిస్తాన్)పై, రజనీశ్ 4-0తో నాదర్ (పాకిస్తాన్)పై విజయం సాధించారు.
స్విమ్మింగ్‌లో మహిళల 100 మీటర్ల బటర్‌ఫ్లయ్‌లో దామిని గౌడ, పురుషుల 100 మీటర్ల బ్రెస్ట్‌స్ట్రోక్‌లో సందీప్ సెజ్వాల్, మహిళల 200 మీటర్ల ఫ్రీస్టయిల్‌లో శివాని కటారియా స్వర్ణాలు దక్కించుకోగా... మహిళల 4ఁ100 మీటర్ల ఫ్రీస్టయిల్ రిలే రేసులో శివాని కటారియా, మాళవిక, మానా పటేల్, అవంతిక చవాన్‌లతో కూడిన భారత బృందానికి పసిడి పతకం లభించింది.
వెయిట్‌లిఫ్టింగ్‌లో మహిళల 53 కేజీల విభాగంలో హర్ష్‌దీప్ కౌర్ (171 కేజీలు), 48 కేజీల విభాగంలో మీరాబాయి చాను (169 కేజీలు), పురుషుల 56 కేజీల విభాగంలో గురురాజా (241 కేజీలు) అగ్రస్థానంలో నిలిచి స్వర్ణ పతకాలను సొంతం చేసుకున్నారు.
సైక్లింగ్‌లో పురుషుల 40 కిలోమీటర్ల వ్యక్తిగత టైమ్ ట్రయల్‌లో అరవింద్ పన్వర్... మహిళల 30 కిలోమీటర్ల వ్యక్తిగత టైమ్ ట్రయల్‌లో బిద్యాలక్ష్మి తురంగ్‌బమ్ ప్రథమ స్థానాన్ని సంపాదించి భారత్‌కు పసిడి పతకాలను అందించారు. తొలి రోజు పోటీలు ముగిశాక భారత్ ఖాతాలో 14 స్వర్ణాలు, ఐదు రజతాలు... శ్రీలంక ఖాతాలో నాలుగు స్వర్ణాలు, పది రజతాలు, ఏడు కాంస్యాలు ఉన్నాయి.