ఒక ఆటగాడు అంతర్జాతీయ క్రికెట్‌లో తన తొలి టెస్టు మ్యాచ్ ఆడుతూ సెంచరీ సాధించడం అంటే గొప్ప ప్రదర్శనగా గుర్తించవచ్చు. ఎందుకంటే 143 ఏళ్ల టెస్టు చరిత్రలో 2,384 మ్యాచ్‌లు జరిగితే 108 మందికే ఇది సాధ్యమైంది. అదే జోరు కొనసాగించి రెండో టెస్టులోనూ శతకం బాదితే అద్భుతమని చెప్పవచ్చు. ఎందుకంటే కేవలం 9 మంది మాత్రమే ఈ జాబితాలో ఉన్నారు. ఇక అంతటితో ఆగకుండా మూడో టెస్టు మ్యాచ్‌లోనూ వందతో చెలరేగిపోతే ఆ సంచలనాన్ని మొహమ్మద్ అజహరుద్దీన్ అనవచ్చు. ఎందుకంటే తన తొలి మూడు టెస్టుల్లోనూ సెంచరీలు సాధించిన ఈ మాజీ కెప్టెన్ రికార్డును ఇప్పటికీ ఎవరూ సమం కూడా చేయలేకపోయారు. ఫలితంగా ఈ ఘనత సాధించిన ఏకైక బ్యాట్స్‌మన్‌గా ఇప్పటికీ అజహర్ కొనసాగుతున్నాడు.
ఇంగ్లండ్ క్రికెట్ జట్టు 1984–85 సీజన్‌లో ఐదు టెస్టుల సిరీస్ కోసం భారత్‌లో పర్యటించింది. భారత జట్టుకు సునీల్ గావస్కర్ కెప్టెన్‌గా వ్యవహరించాడు. ఈ సిరీస్‌కు అజహర్ ఎంపికయ్యాడు. తొలి రెండు టెస్టుల్లో అతనికి తుది జట్టులో స్థానం లభించలేదు. అయితే మూడో టెస్టులో సందీప్ పాటిల్ స్థానంలో అజ్జూను తీసుకున్నారు. 1984 డిసెంబర్ 31న మొదలైన ఈ టెస్టుతో అజ్జూ చరిత్ర సృష్టించాడు.
తొలి సెంచరీ (కోల్‌కతా)
ఈడెన్ గార్డెన్స్‌లో జరిగిన ఈ టెస్టులో అజహర్ ఐదో స్థానంలో వచ్చాడు. 322 బంతుల్లో 10 ఫోర్లతో 110 పరుగులు చేసి తన అరంగేట్రాన్ని ఘనంగా చాటాడు. అద్భుతంగా కెరీర్‌ను ఆరంభించిన అజహర్‌పై అందరి దృష్టీ పడింది. అన్ని వైపుల నుంచి ప్రశంసలు లభించాయి. తొలి ఇన్నింగ్స్‌లో భారత్ ఏడు వికెట్ల నష్టానికి 437 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ 276 పరుగులకే ఆలౌటైంది. అయితే వర్షం కారణంగా మ్యాచ్‌కు ఇబ్బంది కలగడంతో భారత్ రెండో ఇన్నింగ్స్‌లో అజహర్‌కు బ్యాటింగ్ చేసే అవకాశం రాలేదు. తుదకు ఈ టెస్టు ‘డ్రా’గా ముగిసింది.
రెండో సెంచరీ (మద్రాస్)
చిదంబరం స్టేడియం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత్ తొలి ఇన్నింగ్స్‌లో 272 పరుగులకు ఆలౌటైంది. అజహరుద్దీన్ 90 బంతుల్లో 6 ఫోర్లతో 48 పరుగులు చేశాడు. అనంతరం మైక్ గ్యాటింగ్ (207; 20 ఫోర్లు; 3 సిక్స్‌లు), గ్రేమ్ ఫ్లవర్ (201; 22 ఫోర్లు, 3 సిక్స్‌లు) డబుల్ సెంచరీలు సాధించారు. దాంతో ఇంగ్లండ్ 7 వికెట్లకు 652 పరుగుల భారీ స్కోరు వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. 380 పరుగుల భారీ లోటుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ చివరకు 412 పరుగులు చేసి ఆలౌటై ఇంగ్లండ్ ముందు 33 పరుగుల విజయలక్ష్యాన్ని పెట్టింది. తీవ్ర ఒత్తిడిలో పోరాడుతూ ఇక్కడ సాధించిన మరో శతకం అజహర్ అసలు సత్తాను చూపించింది. 218 బంతుల్లో అజహర్ 18 ఫోర్లతో 105 పరుగులు సాధించాడు. భారత్ 9 వికెట్లతో ఈ మ్యాచ్ ఓడినా... మన హైదరాబాదీ ప్రదర్శించిన బ్యాటింగ్ సొగసు, అతని మణికట్టు మాయాజాలం ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అభిమానులను తెచ్చిపెట్టింది. వరుసగా రెండో సెంచరీతో అజ్జూ తళుక్కుమన్నాడు.
మూడో సెంచరీ ( కాన్పూర్)
అజహర్‌కు ముందు ముగ్గురు బ్యాట్స్‌మెన్‌కు మాత్రమే తమ అరంగేట్రం తొలి రెండు టెస్టుల్లో సెంచరీలు సాధించిన గుర్తింపు ఉంది. తాజా ప్రదర్శనతో భారత అభిమానుల దృష్టి అజహర్‌పై నిలిచింది. అతను మూడో మ్యాచ్‌లోనూ శతకాన్ని అందుకోగలడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూశారు. గ్రీన్‌పార్క్ స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో అజహర్ అభిమానుల అంచనాలు వమ్ము చేయలేదు. చురుకైన బ్యాటింగ్‌తో మరో సెంచరీని తన ఖాతాలో వేసుకొని చరిత్ర సృష్టించాడు. మూడో స్థానంలో బ్యాటింగ్ చేసిన అజ్జూ 270 బంతుల్లో 16 ఫోర్లతో 122 పరుగులు చేసి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టాడు.
భారత్ 8 వికెట్లకు 553 పరుగులు చేసి తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. అనంతరం ఇంగ్లండ్ 417 పరుగులకు ఆలౌటైంది. మ్యాచ్ ఫలితం ‘డ్రా’గా ఖాయమైన నేపథ్యంలో రెండో ఇన్నింగ్స్‌లో దూకుడుగా ఆడిన అజహర్ 43 బంతుల్లోనే 5 ఫోర్లతో 54 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. అలా అతని వరుసగా మూడు సెంచరీల ప్రదర్శన క్రికెట్ చరిత్రలో నిలిచిపోయింది. మొత్తంగా 3 టెస్టుల్లో కలిపి అజహర్ 439 పరుగులు సాధించాడు. మూడో టెస్టులో వేటుపడ్డాక సందీప్ పాటిల్ మళ్లీ టెస్టు జట్టులోకి రాలేకపోయాడు. తన స్థానంలో వచ్చిన అజహర్ పాతుకుపోవడంతో పాటిల్ కెరీర్ అక్కడే ముగిసిపోయింది.
భారత్ తరఫున 15 మంది తమ తొలి టెస్టుల్లో సెంచరీలు చేయగా... అజహర్‌తో పాటు గంగూలీ, రోహిత్ శర్మ మాత్రమే తొలి రెండు టెస్టుల్లోనూ శతకాలు సాధించారు. అజహర్ అనూహ్యంగా ముగిసిన తన కెరీర్ చివరి టెస్టు (99వ)లోనూ సెంచరీ సాధించడం విశేషం.
–సాక్షి క్రీడా విభాగం
Comments
Please login to add a commentAdd a comment