
న్యూఢిల్లీ: ఐపీఎల్–12 ఫైనల్ నిర్వహణ వేదిక మారింది. షెడ్యూల్ ప్రకారం మే 12న చెన్నైలో జరగాల్సిన ఈ మ్యాచ్‌ను హైదరాబాద్‌లోని ఉప్పల్ మైదానానికి తరలించారు. చెన్నై చెపాక్ స్టేడియంలో మూడు స్టాండ్ల వినియోగానికి సంబంధించి అనుమతులు పొందడంలో తమిళనాడు క్రికెట్ సంఘం (టీఎన్‌సీఏ) విఫలం కావడంతో మార్పు తప్పనిసరైనట్లు సీఓఏ చీఫ్ వినోద్ రాయ్ తెలిపారు. ఈ పరిణామం డిఫెండింగ్ చాంపియన్, స్థానిక జట్టైన చెన్నై సూపర్ కింగ్స్ అభిమానులను కొంత నిరాశ పర్చేదే.
అయితే, పాయింట్ల పట్టికలో తొలి రెండు స్థానాల్లో నిలవడం ద్వారా చెన్నై క్వాలిఫయర్–1ను సొంత మైదానంలో ఆడే అవకాశం ఉంది. గతేడాది విజేత జట్టుకు చెందిన మైదానం అయినందున క్వాలిఫయర్–1 వేదికను మార్చే వీలు లేకపోయింది. మరోవైపు ఎలిమినేటర్, క్వాలిఫయర్–2లకు వైజాగ్ ఆతిథ్యం ఇవ్వనుంది. దీనికితోడు మూడు జట్లతో కూడిన మహిళల మినీ ఐపీఎల్‌కు మే 6 నుంచి 10వ తేదీ మధ్య జైపూర్ ఆతిథ్యం ఇవ్వనుంది. ట్రయల్ బ్లేజర్స్, సూపర్ నోవాస్‌కు తోడు కొత్తగా వెలాసిటీ జట్టు ఇందులో పాల్గొననుంది.