
కజాన్ : అరబ్ దేశాల చట్టాలు...మరీ ముఖ్యంగా ఆడవారికి సంబంధించిన చట్టాలు ఎంత కఠినంగా ఉంటాయో తెలిసిన విషయమే. మగ క్రీడాకారులు ఆటలు ఆడే సమయంలో ఆడవారు స్టేడియంలోకి రాకుడదనేది అటువంటి కఠిన చట్టాల్లో ఒకటి. 1979 విప్లవం సందర్భంగా వచ్చిన ఈ చట్టాన్ని ఎత్తివేయాలని ఇరాన్ మహిళలు కొంతకాలం నుంచి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కానీ ప్రభుత్వం నుంచి ఎటువంటి స్పందన లేదు. ఇలా అయితే లాభం లేదని, తమ నిరసనను ప్రపంచం మొత్తం తెలియజాలనుకున్నారు.
రష్యాలో జరుగుతున్న ‘ఫిఫా వరల్డ్ కప్’ను అందుకు వేదికగా ఎంచుకున్నారు. ఫిఫా షెడ్యూల్ ప్రకారం బుధవారం నాడు(అంటే ఈ రోజే) ఇరాన్, స్పెయిన్‌తో తలపడనుంది. తమ నిరసనను ప్రపంచం దృష్టికి తీసుకెళ్లడానికి ఇదే మంచి అవకాశం అని భావించారు ఇరానీ మహిళలు. అందుకే కజాన్ ఎరినాలో ‘ఆడవారిని నిషేధించకూడదు (#NoBan4Women), ‘ఇరానీ మహిళలు స్టేడియంలోకి వచ్చేందుకు మద్దతు తెలపండి’ (Support Iranian women to attend stadiums) అని రాసివున్న ప్లకార్డులను పట్టుకుని జనాల మధ్య నిల్చున్నారు.
అయితే ఇరానీ మహిళలు చేస్తున్న నిరసన గురించి ఆ దేశ ఫుట్‌బాల్ జట్టు కెప్టెన్ మసౌద్ షోజాయి ‘ఇరాన్ మహిళల సమస్యల గురించి చర్చించడానికి ఈ టోర్నమెంట్ సరైన వేదిక కాదు. మనమంతా ఒకే కుటుంబం...మన సమస్యల గురించి మనం మన ఇంటిలోపలో చర్చించుకోవాలి. కానీ మైదానంలో ఉన్నప్పుడు మనమంతా ఒకే దేశం. కాబట్టి ఈ విషయం గురించి మనం తర్వాత చర్చిద్దాం’ అని అన్నారు.
1979 విప్లవం తర్వాత ఇరాన్‌లో మహిళలను అన్ని క్రీడాకార్యక్రమాలకు హాజరవటాన్ని నిషేధించారు. అయితే ఈ నిషేధాన్ని ఎత్తివేయాలని కోరుతున్న వారిలో షౌజాయి కూడా ఉన్నారు.