విదర్భ 245/6  | Irani Cup: Sanjay and Wadkar Fifties Keep Vidarbha in Hunt | Sakshi
Sakshi News home page

విదర్భ 245/6 

Published Thu, Feb 14 2019 12:08 AM | Last Updated on Thu, Feb 14 2019 12:08 AM

Irani Cup: Sanjay and Wadkar Fifties Keep Vidarbha in Hunt - Sakshi

నాగ్‌పూర్‌: రంజీ చాంపియన్‌ విదర్భ... ఇరానీ కప్‌ మ్యాచ్‌లో రెస్టాఫ్‌ ఇండియాపై పైచేయి సాధించేందుకు పోరాడుతోంది. ప్రత్యర్థిని మోస్తరు స్కోరుకే కట్టడి చేసి, రెండో రోజు బుధవారం బ్యాటింగ్‌కు దిగిన ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌లో తడబడింది. ఓపెనర్లు కెప్టెన్‌ ఫైజ్‌ ఫజల్‌ (27), సంజయ్‌ రామస్వామి (166 బంతుల్లో 65; 9 ఫోర్లు) తొలి వికెట్‌కు 50 పరుగులు జోడించి శుభారంభం అందించినా, మిడిలార్డర్‌ బ్యాట్స్‌మన్‌ గణేశ్‌ సతీష్‌ (105 బంతుల్లో 48; 4 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించినా... రెస్టాఫ్‌ ఇండియా బౌలర్లు కృష్ణప్ప గౌతమ్‌ (2/33), ధర్మేంద్ర జడేజా (2/66) క్రమం తప్పకుండా వికెట్లు పడగొట్టి విదర్భకు కళ్లెం వేశారు.

కీలక సమయంలో యువ ఆటగాడు అథర్వ తైడె (15), మోహిత్‌ కాలె (1)లను స్వల్ప స్కోర్లకే ఔట్‌ చేసి దెబ్బకొట్టారు. 168 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయిన స్థితిలో వికెట్‌ కీపర్‌ అక్షయ్‌ వాడ్కర్‌ (96 బంతుల్లో 50 బ్యాటింగ్‌; 9 ఫోర్లు) అండగా నిలిచాడు. స్పిన్నర్లు ఆదిత్య సర్వతే (18), అక్షయ్‌ కర్నెవర్‌ (15 బ్యాటింగ్‌) తోడుగా జట్టు స్కోరును 200 దాటించాడు. దీంతో 245/6తో విదర్భ రోజును ముగించింది. రెస్టాఫ్‌ ఇండియా స్కోరుకు విదర్భ మరో 85 పరుగులు వెనుకబడి ఉంది. లోయరార్డర్‌ బ్యాటింగ్‌ ప్రతిభతోనే రంజీ ట్రోఫీ గెలిచిన ఆ జట్టు... ఈసారి ఏం చేస్తుందో చూడాలి. మూడు రోజుల ఆట ఉన్నందున ఈ మ్యాచ్‌లో ఫలితం తేలడం ఖాయంగా కనిపిస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement