ఎవరెక్కడ?
రెండో వన్డే ఉ.గం. 6.30 నుంచి
సోనీసిక్స్‌లో ప్రత్యక్ష ప్రసారం
హామిల్టన్: ప్రపంచకప్ కోసం ప్రయోగాలు చేసే ఆలోచన లేదని న్యూజిలాండ్‌తో సిరీస్ ఆరంభంలోనే చెప్పిన కెప్టెన్ ధోని... ఆ ప్రపంచకప్ ఆడబోయే వాళ్లకు వీలైనంత ఎక్కువ అవకాశాలు ఇవ్వాలనే ఆలోచనలో ఉన్నాడు. కాబట్టి భారత బ్యాట్స్‌మెన్ జాబితాలో మార్పులు ఉండకపోవచ్చు. కాకపోతే... ఎవరు ఏ స్థానంలో ఆడాలనే విషయంలో మాత్రం స్పష్టత రాలేదు. న్యూజిలాండ్‌తో నేడు జరిగే రెండో వన్డేలో ఎవరెక్కడ ఆడతారో చూడాలి. ఈ మ్యాచ్‌లోనూ ఓడిపోతే ఇక సిరీస్ గెలవాలంటే చివరి మూడు మ్యాచ్‌లు గెలవాల్సి ఉంటుంది. కాబట్టి ధోనిసేన మీద కాస్త ఒత్తిడి ఉంది.
నాలుగైదు స్థానాల్లో...
ఓపెనర్లుగా ధావన్, రోహిత్... ఫస్ట్‌డౌన్‌లో విరాట్ కోహ్లి... ఆరో స్థానంలో ధోని... మరి మధ్యలో నాలుగు, ఐదు స్థానాల పరిస్థితి ఏమిటి? భారత్‌కు సమాధానం దొరకాల్సిన ప్రశ్న ఇదే. ప్రస్తుతానికి రహానే, రైనా, నాలుగు, ఐదు స్థానాల్లో ఆడుతున్నారు. నిజానికి ఇంతకాలం ఇది యువరాజ్ స్థానం. ఇప్పుడు తను లేకపోవడం వల్ల రైనా ఆ స్థానానికి వచ్చాడు. కానీ కుదురుకోలేకపోయాడు. ఇప్పుడు రహానేకు ఆ అవకాశం ఇచ్చారు. తొలి వన్డేలో విఫలమైనా... రహానే నైపుణ్యాన్ని తక్కువగా అంచనా వేయలేం. మరోవైపు నాలుగో స్థానంలో ఆడగల సత్తా రాయుడిలోనూ ఉంది. మరి ధోని ఏం చేస్తాడో..! రాయుడికి అవకాశం దక్కుతుందా..?
నోటితో చెప్పాల్సిన పని లేదు: కోహ్లి
కెరీర్ ఆరంభంలో మైదానంలో తన భావోద్వేగాలను ఎక్కువగా బయటకు ప్రదర్శించేవాడినని, దాని వల్ల చాలా తప్పిదాలు జరిగాయని కోహ్లి అన్నాడు. అయితే ఏదైనా చెప్పాలనుకుంటే నోటితోనే చెప్పాల్సిన పని లేదనే వాస్తవాన్ని ఇప్పుడు గుర్తించానని స్పష్టం చేశాడు. ప్రస్తుతం తాను చాలా పరిణతిని సాధించానన్నాడు. ‘తొలి మ్యాచ్‌లో బౌలరు నన్ను తీక్షణంగా చూశాడు. నేను నోటితో కాకుండా బ్యాట్‌తో సమాధానం చెప్పా. క్రీజులో ఉండటం ఎంత ప్రధానమో తెలుసుకున్నా, నేనేమీ 21 ఏళ్ల కుర్రాడిని కాదు. భావోద్వేగాన్ని ఆపుకోవడం తెలియకపోతే కెరీర్‌లో ముందుకెళ్లలేం’ అని కోహ్లి అన్నాడు.