గత ప్రపంచకప్ రన్నరప్ న్యూజిలాండ్ కీలక సమరంలో తమ సత్తా చాటింది. టోర్నీలో వరుసగా నాలుగు విజయాల తర్వాత నాలుగు పరాజయాలతో తమ పరిస్థితిని క్లిష్టంగా మార్చుకున్న కివీస్ ఆఖరి ఆటలో స్థాయికి తగ్గ ప్రదర్శనను కనబర్చి దాదాపు సెమీఫైనల్లోకి అడుగు పెట్టింది. చివరి మ్యాచ్‌లో శ్రీలంకను చిత్తు చేసిన ఆ జట్టు మరే జట్టుపై ఆధారపడకుండా తమ సెమీస్ అవకాశాలను తానే సృష్టించుకుంది.
కివీస్ గెలుపుతో పాకిస్తాన్ సెమీస్ ఆశలు చేజారాయి. సాంకేతికంగా, అంకెల ప్రకారం పాక్ పూర్తిగా, అధికారికంగా నిష్క్రమించకపోయినా... అసాధ్యమైన, ఊహకు కూడా అందని తరహాలో ఆ జట్టు తర్వాతి మ్యాచ్‌లో గెలవాల్సిన నేపథ్యంలో వాస్తవికంగా చూస్తే పాక్ ఆట ముగిసినట్లే!
బెంగళూరు: పదునైన బౌలింగ్, ఆపై దూకుడైన బ్యాటింగ్‌తో న్యూజిలాండ్ వరల్డ్‌కప్ లీగ్ దశను ఘనంగా ముగించింది. సెమీస్ అవకాశాలు నిలిచి ఉండాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన మ్యాచ్‌లో చెలరేగిన ఆ జట్టు తమ లక్ష్యాన్ని నిర్విఘ్నంగా పూర్తి చేసింది. గురువారం చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఐదు వికెట్ల తేడాతో శ్రీలంకను ఓడించింది.
టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన లంక 46.4 ఓవర్లలో 171 పరుగులకే ఆలౌటైంది. కుశాల్ పెరీరా (28 బంతుల్లో 51; 9 ఫోర్లు, 2 సిక్స్‌లు) అర్ధసెంచరీ సాధించాడు. 10 ఓవర్లలోపే 70/5 స్కోరుతో కుప్పకూలేందుకు సిద్ధమైన లంక... చివర్లో మహీశ్ తీక్షణ (91 బంతుల్లో 38 నాటౌట్; 3 ఫోర్లు) రాణించడంతో ఈ మాత్రం స్కోరైనా సాధించగలిగింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ ట్రెంట్ బౌల్ట్ (3/37)తో పాటు ఇతర కివీస్ బౌలర్లూ సత్తా చాటి ప్రత్యర్థిని పడగొట్టారు.
అనంతరం న్యూజిలాండ్ 23.2 ఓవర్లలో 5 వికెట్లకు 172 పరుగులు సాధించింది. కాన్వే (42 బంతుల్లో 45; 9 ఫోర్లు), రచిన్ రవీంద్ర (34 బంతుల్లో 42; 3 ఫోర్లు, 3 సిక్స్‌లు) తొలి వికెట్‌కు 74 బంతుల్లోనే 86 పరుగులు జోడించి విజయానికి పునాది వేయగా, మిచెల్ (31 బంతుల్లో 43; 5 ఫోర్లు, 2 సిక్స్‌లు) కీలక ఇన్నింగ్స్ ఆడాడు. ఈ ఫలితంతో న్యూజిలాండ్ సెమీస్‌కు చేర డం దాదాపుగా ఖాయం కాగా... కివీస్ ఓటమిపై ఆశలు పెట్టుకున్న పాక్, అఫ్గానిస్తాన్‌కు నిరాశ తప్పలేదు.
స్కోరు వివరాలు
శ్రీలంక ఇన్నింగ్స్: నిసాంక (సి) లాథమ్ (బి) సౌతీ 2; పెరీరా (సి) సాన్‌ట్నర్ (బి) ఫెర్గూసన్ 51; మెండిస్ (సి) రచిన్ (బి) బౌల్ట్ 6; సమరవిక్రమ (సి) మిచెల్ (బి) బౌల్ట్ 1; అసలంక (ఎల్బీ) (బి) బౌల్ట్ 8; మాథ్యూస్ (సి) మిచెల్ (బి) సాన్‌ట్నర్ 16; ధనంజయ (సి) మిచెల్ (బి) సాన్‌ట్నర్ 19; కరుణరత్నే (సి) లాథమ్ (బి) ఫెర్గూసన్ 6; తీక్షణ (నాటౌట్) 38; చమీర (సి) బౌల్ట్ (బి) రచిన్ 1; మదుషంక (సి) లాథమ్ (బి) రచిన్ 19; ఎక్స్‌ట్రాలు 4; మొత్తం (46.4 ఓవర్లలో ఆలౌట్) 171. వికెట్ల పతనం: 1–3, 2–30, 3–32, 4–70, 5–70, 6–104, 7–105, 8–113, 9–128, 10–171. బౌలింగ్: బౌల్ట్ 10–3–37–3, సౌతీ 8–0–52–1, ఫెర్గూసన్ 10–2–35–2, సాన్‌ట్నర్ 10–2–22–2, రచిన్ 7.4–0–21–2, ఫిలిప్స్ 1–0–3–0.
న్యూజిలాండ్ ఇన్నింగ్స్: కాన్వే (సి) ధనంజయ (బి) చమీర 45; రచిన్ (సి) ధనంజయ (బి) తీక్షణ 42; విలియమ్సన్ (బి) మాథ్యూస్ 14; మిచెల్ (సి) అసలంక (బి) మాథ్యూస్ 43; చాప్‌మన్ (రనౌట్) 7; ఫిలిప్స్ (నాటౌట్) 17; లాథమ్ (నాటౌట్) 2; ఎక్స్‌ట్రాలు 2; మొత్తం (23.2 ఓవర్లలో 5 వికెట్లకు) 172. వికెట్ల పతనం: 1–86, 2–88, 3–130, 4–145, 5–162. బౌలింగ్: మదుషంక 6.2–0–58–0, తీక్షణ 7–0–43–1, ధనంజయ 2–0–22–0, చమీర 4–1–20–1, మాథ్యూస్ 4–0–29–2.
ప్రపంచకప్‌లో నేడు
దక్షిణాఫ్రికా x అఫ్గానిస్తాన్
వేదిక: అహ్మదాబాద్
మధ్యాహ్నం 2 గంటల నుంచి స్టార్ స్పోర్ట్స్, హాట్‌స్టార్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
Comments
Please login to add a commentAdd a comment