
జడేజా హాఫ్ సెంచరీ..భారత్ ఆధిక్యం
ధర్మశాల: ఆస్ట్రేలియాతో జరుగుతున్న భారత ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా మరో హాఫ్ సెంచరీ సాధించాడు. మూడో టెస్టు తొలి ఇన్నింగ్స్ లో అర్ధ శతకం సాధించిన జడేజా.. చివరిదైన నాల్గో టెస్టు మొదటి ఇన్నింగ్స్ లో కూడా హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. భారత జట్టు కష్టాల్లో పడిన సమయంలో జడేజా 83 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్సర్లతో అర్ద శతకం సాధించాడు. దాంతో తిరిగి తేరుకున్న భారత్ జట్టు ఆధిక్యంలోకి దూసుకెళ్లింది.
248/6 ఓవర్ నైట్ స్కోరుతో సోమవారం ఇన్నింగ్స్ కొనసాగించిన భారత జట్టు నిలకడగా ఆడుతూ ఆసీస్ తొలి ఇన్నింగ్స్ స్కోరును లంచ్ లోపే అధిగమించింది. ఓవర్ నైట్ ఆటగాళ్లు జడేజా-వృద్ధిమాన్ సాహాలు బాధ్యతాయుతంగా ఆడి టీమిండియా పైచేయి సాధించడంలో ముఖ్య భూమిక పోషించారు. ఒకవైపు జడేజా దూకుడును కొనసాగిస్తే, సాహా మాత్రం ఆచితూచి ఆడుతున్నాడు. ఈ జోడి 96 పరుగుల విలువైన భాగస్వామ్యం నమోదు చేసిన తరువాత జడేజా(63;95 బంతుల్లో 4ఫోర్లు,4 సిక్సర్లు) ఏడో వికెట్ గా అవుటయ్యాడు. ఆసీస్ తన తొలి ఇన్నింగ్స్ లో 300 పరుగుల వద్ద ఆలౌటైన సంగతి తెలిసిందే.