పర్వేజ్ రసూల్
అగర్తల: రంజీ ట్రోఫీలో తమ చరిత్రలో తొలిసారి జమ్మూ కాశ్మీర్ జట్టు క్వార్టర్ ఫైనల్‌కు చేరింది. త్రిపురతో ఇక్కడ ముగిసిన చివరి మ్యాచ్‌ను ఆ జట్టు డ్రాగా ముగించింది. 228 పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్‌లో బరిలోకి దిగిన కాశ్మీర్ ఆట ముగిసే సరికి 2 వికెట్లకు 87 పరుగులు చేసింది. అర్ధ సెంచరీతో పాటు 7 వికెట్లు పడగొట్టిన పర్వేజ్ రసూల్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది. త్రిపురతో మ్యాచ్ డ్రా కావడంతో తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంతో కాశ్మీర్‌కు 3 పాయింట్లు దక్కాయి.
దీంతో పాయింట్ల పరంగా గోవా (24)తో సమానంగా నిలిచింది. లీగ్ దశలో ఇరు జట్లు నాలుగేసి విజయాలు సాధించాయి. దాంతో రన్ కోషెంట్ (చేసిన, ఇచ్చిన పరుగుల ఆధారంగా)ను పరిగణలోకి తీసుకున్నారు. గోవా (1.005)కంటే 0.001 పాయింట్లు ఎక్కువగా ఉన్న జమ్మూ కాశ్మీర్ (1.006) స్వల్ప తేడాతో ముందుకు దూసుకుపోయింది. 2000-01 సీజన్‌లో కాశ్మీర్ నాకౌట్ దశకు చేరినా అది అప్పటి రంజీ ఫార్మాట్ ప్రకారం ప్రిక్వార్టర్స్ మాత్రమే.
ముంబై సంచలన విజయం
వల్సాడ్: రంజీ ట్రోఫీలో క్వార్టర్ ఫైనల్ చేరాలంటే తప్పనిసరిగా నెగ్గాల్సిన మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ ముంబై సత్తా చాటింది. లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్లు ఇక్బాల్ అబ్దుల్లా (5/44), విశాల్ దభోల్కర్ (4/33) చెలరేగడంతో తమ చివరి లీగ్ మ్యాచ్‌లో ముంబై 27 పరుగుల తేడాతో గుజరాత్‌పై సంచలన విజయం సాధించింది.
175 పరుగుల విజయలక్ష్యం ముందుండగా, 67/3తో చివరి రోజు ఆట ప్రారంభించిన గుజరాత్ ఒక దశలో 134/4తో గెలుపు దిశగా పయనించింది. అయితే 12 పరుగులకే చివరి 6 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 147 పరుగులకే కుప్పకూలింది. అక్షర్ పటేల్ (65) తప్ప అంతా విఫలమయ్యారు. లక్నోలో రైల్వేస్‌తో జరిగిన ఆఖరి లీగ్ మ్యాచ్ డ్రాగా ముగియడంతో ఉత్తరప్రదేశ్ కూడా క్వార్టర్ ఫైనల్‌కు చేరుకుంది. వర్షం కారణంగా ఈ మ్యాచ్‌లో ఒక్క ఇన్నింగ్స్ కూడా పూర్తి కాకపోవడంతో ఇరు జట్లకు చెరో పాయింట్ కేటాయించారు. మరో వైపు గత ఏడాది ఫైనలిస్ట్ సౌరాష్ట్ర ఈ సారి క్వార్టర్ ఫైనల్‌కు కూడా చేరుకోలేకపోయింది. గత సీజన్‌లో సెమీ ఫైనల్ చేరిన సర్వీసెస్‌తో పాటు క్వార్టర్స్ వరకు చేరుకున్న జార్ఖండ్, బరోడా ఈ సారి లీగ్ దశను దాటలేకపోయాయి.
క్వార్టర్ ఫైనల్లో ఎవరితో ఎవరు
(జనవరి 8 నుంచి 12 వరకు)
1. ముంబై x మహారాష్ట్ర ( వాంఖడే స్టేడియం, ముంబై)
2. బెంగాల్ x రైల్వేస్ (ఈడెన్ గార్డెన్స్, కోల్‌కతా)
3. కర్ణాటక x ఉత్తరప్రదేశ్ (చిన్నస్వామి స్టేడియం, బెంగళూరు)
4. పంజాబ్ x జమ్మూ కాశ్మీర్ (మోతీబాగ్ స్టేడియం, వడోదర)
1, 2 మ్యాచ్‌ల విజేతల మధ్య తొలి సెమీ ఫైనల్ ఇండోర్‌లో... 3, 4 మ్యాచ్‌ల విజేతల మధ్య రెండో సెమీ ఫైనల్ మొహాలీలో ఈ నెల 18 నుంచి 22 వరకు జరుగుతాయి.
ఉప్పల్‌కు ‘ఫైనల్’ చాన్స్
హైదరాబాద్: రంజీ ట్రోఫీలో హైదరాబాద్ జట్టు ప్రదర్శన పేలవంగానే ఉన్నా మ్యాచ్‌ల నిర్వహణపరంగా నగరంలోని స్టేడియం మాత్రం బీసీసీఐ దృష్టిలో ప్రధాన వేదికగానే కనిపిస్తోంది. ఈ సీజన్‌లో రంజీ ఫైనల్ మ్యాచ్ కోసం ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియాన్ని ఎంపిక చేసినట్లు బోర్డు ప్రకటించింది. ఈ నెల 29నుంచి ఫిబ్రవరి 2 వరకు ఇక్కడ ఫైనల్ జరుగుతుంది. గతంలో ఒక సారి 2008-09 సీజన్‌లో ముంబై, ఉత్తరప్రదేశ్ జట్ల మధ్య కూడా రంజీ ట్రోఫీ ఫైనల్ ఉప్పల్‌లోనే జరిగింది. ఆ తర్వాత 2010 ఫిబ్రవరిలో వెస్ట్‌జోన్, సౌత్‌జోన్ మధ్య దులీప్ ట్రోఫీ ఫైనల్‌కు ఈ స్టేడియం ఆతిథ్యమిచ్చింది.