
జస్ప్రీత్ బుమ్రా
ముంబై : వన్డే సిరీస్ కోల్పోయి కష్టాల్లో ఉన్న టీమిండియాకు మరో గట్టి దెబ్బ తగలనుంది. బొటన వేలి గాయంతో దూరమైన టీమిండియా పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్‌తో జరిగే తొలి మూడు టెస్టులకు సైతం దూరమయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సుదీర్ఘ ఇంగ్లండ్ పర్యటనలో ఉన్న కోహ్లి సేన మంగళవారం జరిగిన నిర్ణయాత్మక వన్డే మ్యాచ్‌లో 8 వికెట్లతో ఓడి సిరీస్‌ను కోల్పోయిన విషయం తెలిసిందే. టీ20 సిరీస్‌ను కోల్పోయిన ఇంగ్లండ్ వన్డే సిరీస్‌ను నెగ్గి బదులు తీర్చుకుంది. దీంతో రెట్టింపు ఉత్సాహంతో ఐదు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌కు సిద్దమవుతోంది.
ఇంగ్లండ్‌తో తొలి టీ20లో గాయపడ్డ బుమ్రా.. ఇంకా కోలుకోలేదని సమాచారం. ఇప్పటికే బుమ్రా గైర్హాజరితో టీమిండియా మూల్యం చెల్లించుకుంది. బౌలింగ్ విభాగంలో కుల్దీప్ మినహా ఇతరులు అంతగా ప్రభావం చూపలేకపోయారు. దీనికి బ్యాట్స్‌మన్ పేలవ ప్రదర్శన తోడవడంతో వన్డే సిరీస్‌ను కోల్పోయింది. ఇక ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే టెస్టు సిరీస్ కోసం భారత జట్టును నేడు బీసీసీఐ ప్రకటించనుంది.
లిమిటెడ్ ఫార్మట్‌లో రాణించిన కుల్దీప్ యాదవ్‌కు టెస్టుల్లో అవకాశం లభించనున్నట్లు తెలుస్తోంది. యోయో టెస్టు విఫలమవడంతో వన్టే, టీ20 సిరీస్‌లకు దూరమైన పేసర్ మహ్మద్ షమీ పునరాగమనం చేసే అవకాశం ఉంది. షమీ ఇటీవలనే యోయో టెస్టును విజయవంతంగా పూర్తిచేశాడు. దీంతో అతనికి జట్టులో చోటు ఖాయమని తెలుస్తోంది. టెస్ట్ రెగ్యూలర్ వికెట్ కీపర్ వృద్దీమాన్ సాహా గాయం నుంచి కోలుకోకపోవడంతో అతని స్థానంలో దినేశ్ కార్తీక్ పక్కా అని అందరూ భావించారు. కానీ సెలక్టర్లు యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం ఇంగ్లండ్ పర్యటనలోనే ఉన్న ఈ ఢిల్లీ ఆటగాడు 15 డిస్‌మిస్సల్స్‌తో కీపర్‌గా రాణించాడు. ఇదే జరిగితే పంత్ టెస్టుల్లో ఈ సిరీస్ ద్వారా అరంగేట్రం చేయనున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment