
భారత 'గురి' కుదిరేనా?
నాలుగేళ్లకు ఒకసారి వచ్చే క్రీడా పండుగ వచ్చేసింది. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారజామున ఒలింపిక్స్ క్రీడలకు అధికారికంగా తెరలేచింది.
రియో డీ జనీరో: నాలుగేళ్లకు ఒకసారి వచ్చే క్రీడా పండుగ వచ్చేసింది. భారత కాలమాన ప్రకారం శనివారం తెల్లవారజామున ఒలింపిక్స్ క్రీడలకు అధికారికంగా తెరలేచింది. రియో ఒలింపిక్స్లో భాగంగా తొలి రోజు స్వర్ణం షూటర్ల ఖాతాలో చేరనుంది. అయితే ఈ విభాగంలో 11 వేర్వేరు ఈవెంట్లలో మొత్తం 12 మంది భారత్ షూటర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనుండగా, తొలి రోజు పురుషుల ఈవెంట్లో జీతూరాయ్(10 మీటర్ల ఎయిర్ పిస్టల్), మహిళల విభాగంలో అపూర్వ చండీలా, అయోనికా పాల్(10 మీటర్ల ఎయిర్ రైఫిల్)లు తమను పరీక్షించుకునేందుకు సిద్ధమయ్యారు.
భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మహిళల 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ ఈవెంట్‌లో తొలి స్వర్ణం ఖాయం కానుండగా, రాత్రి గం. 12.30 నిమిషాలకు షూటింగ్‌లో రెండో స్వర్ణం (పురుషుల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్) ఖాయమవుతుంది. 2008లో బీజింగ్‌లో అభినవ్ బింద్రా షూటింగ్‌లో స్వర్ణం సాధించిన తరువాత భారత్ కు ఈ విభాగంలో పసిడి దక్కలేదు. ప్రస్తుతం భారత షూటింగ్ బృందం మెరుగ్గా ఉండటంతో పతకంపై ఆశలు చిగురిస్తున్నాయి. తొలి రోజు నాలుగు స్వర్ణాల కోసం పోటీలు జరుగనుండగా, షూటింగ్‌లో రెండు పసిడి పతకాలకు ప్రధానంగా పోటీ జరుగనుంది.