ఆసీస్ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కంటే టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినే అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తున్నాడని దక్షిణాఫ్రికా దిగ్గజం జాంటీ రోడ్స్ అన్నాడు. కోహ్లి ఆటను తాను ఎల్లప్పుడూ ఆస్వాదిస్తానని..అతడే బెస్ట్ క్రికెటర్ అని ప్రశంసలు కురిపించాడు. బాల్ టాంపరింగ్ వివాదం-నిషేధం అనంతరం.. ఇంగ్లండ్‌తో జరిగిన యాషెస్ సిరీస్‌లో స్మిత్ డబుల్ సెంచరీతో చెలరేగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) టెస్టు బ్యాట్స్‌మన్ ర్యాంకింగ్స్‌లో నంబర్ వన్ ర్యాంకుకు చేరుకున్నాడు. అదే విధంగా టెస్టు సెంచరీల్లో కూడా కోహ్లి అధిగమించిన సంగతి తెలిసిందే. తాజా ర్యాంకింగ్స్‌లోనూ స్మిత్ 937 పాయింట్లతో అగ్రస్థానంలోనే కొనసాగుతున్నాడు.
ఈ నేపథ్యంలో కోహ్లి-స్మిత్‌ల మధ్య పోలిక తెస్తూ జాంటీ రోడ్స్ స్మిత్ ఆట గురించి సంచలన వ్యాఖ్యలు చేశాడు. తను చేసిన చెత్త సెంచరీలను తాను ఇంతకు ముందెన్నడూ చూడలేదన్నాడు. ‘ విరాట్ ఆటను ఎంజాయ్ చేస్తా. కొంతమంది ఆటను చూస్తే వావ్..షాట్ ఎంత అద్భుతంగా ఉంది అనాలనిపిస్తుంది. కోహ్లి అదే కోవకు చెందినవాడు. కానీ స్టీవ్ స్మిత్ తన యాక్షన్, టెక్నిక్‌తో చెత్త సెంచరీలు చేశాడు. పరుగులు తీస్తూనే ఉన్నాడు గానీ అలాంటి ఆటను నేను ఇంతకుముందు చూడలేదు’ అని జాంటీ రోడ్స్ వ్యాఖ్యానించాడు.
కాగా ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్ల పరంగా చూస్తే తమ దేశ క్రికెటర్ స్టీవ్ స్మిత్ కంటే కూడా టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లినే గ్రేటెస్ట్ బ్యాట్స్‌మన్ అని ఆసీస్ దిగ్గజ ఆటగాడు షేన్ వార్న్ అభిప్రాయపడిన సంగతి తెలిసిందే. స్మిత్ కేవలం టెస్టు ఫార్మాట్‌లో మాత్రమే అత్యుత్తమ ఆటగాడని, కోహ్లి మూడు ఫార్మాట్లలో మేటి ఆటగాడు అని వార్న్ ప్రశంసలు కురిపించాడు. ఇక భారత మాజీ సారథి గంగూలీ.. కోహ్లి-స్మిత్ ప్రదర్శనను పోల్చడం తనకు ఇష్టం లేదని.. కోహ్లి ప్రపంచ అత్యుత్తమ ఆటగాడిగా పరిగణింపబడుతుండగా.. స్మిత్ రికార్డులు కూడా అతడి విలువను చాటుతున్నాయని పేర్కొన్న సంగతి తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment