ఇక చాలు.. ఆపండి: గంగూలీ
లండన్: భారత క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లి, ప్రధాన కోచ్ అనిల్ కుంబ్లేల మధ్య చోటుచేసుకున్న వివాదాన్ని పెద్దది చేయకుండా ఇకనైనా ఫుల్ స్టాప్ పెడితే మంచిదంటూ బీసీసీఐ అడ్వైజరీ కమిటీ సభ్యుడు సౌరవ్ గంగూలీ సూచించాడు. ఎటువంటి పట్టింపులకు పోకుండా ప్రస్తుతం జరుగుతున్న చాంపియన్స్ ట్రోఫీ మీద దృష్టిపెడితే మంచిదంటూ కోహ్లి-కుంబ్లేలకు సుతిమెత్తగా హితబోధ చేశాడు.
ప్రతీరోజు కుంబ్లే-కోహ్లిల అంశమే ప్రధాన వార్తల్లో నిలుస్తుండటంతో గంగూలీ పెదవి విప్పాడు. 'ఇక వివాదానికి ఫుల్ స్టాప్ పెట్టి కలిసి పని చేయండి. ప్రస్తుతం చాంపియన్స్ ట్రోఫీపై దృష్టి పెడితే మంచిది. పట్టింపులకు పోవద్దు. వేరే విషయాలపై ఫోకస్ చేయకుండా.. గేమ్ గురించే ఆలోచించండి' అని గంగూలీ సూచించాడు.