న్యూఢిల్లీ:గత కొన్ని నెలలుగా తిరుగులేని విజయాలు సాధిస్తున్న విరాట్ కోహ్లి నేతృత్వంలోని భారత క్రికెట్ జట్టుపై మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ ప్రశంసలు కురిపించాడు. అదే సమయంలో కెప్టెన్ విరాట్ కోహ్లిని ప్రత్యేకంగా గంగూలీ అభినందించాడు. భారత క్రికెట్ జట్టు అత్యుత్తమ కెప్టెన్లలో విరాట్ ఒకడిగా ఖ్యాతిని అందుకునే అన్ని లక్షణాలు అతనిలో ఉన్నాయంటూ కితాబిచ్చాడు. అయితే రాబోయే కాలంలో విరాట్ కోహ్లికి కఠినమైన సవాల్ ఎదురుకానుందని గంగూలీ అభిప్రాయపడ్డాడు.
'ఇప్పటివరకూ ఓకే. కెప్టెన్ గా విరాట్ కోహ్లి అద్భుతమైన ఘనతను సొంతం చేసుకున్నాడు. భారత క్రికెట్ కెప్టెన్లలో కోహ్లి ఒక అత్యుత్తమ కెప్టెన్. అందులో ఎటువంటి సందేహం లేదు. రాబోయే 15 నెలల కాలం కోహ్లికి అత్యంత క్లిష్టం. దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా పర్యటనలతో పాటు మెగా ఈవెంట్ వరల్డ్ కప్ కూడా కోహ్లికి చాలా కీలకం. ఇక్కడ కూడా కోహ్లి నేతృత్వంలోని టీమిండియా అద్భుతమైన విజయాల్ని సాధించి సరైన మార్గంలో పయనిస్తుందనే ఆశిస్తున్నా. ఆ రకంగా ఆటగాళ్లని కోహ్లి సిద్ధం చేస్తున్నాడు. ప్రస్తుతం జట్టు ఎంపిక కూడా ఆయా సిరీస్ లను దృష్టిలో పెట్టుకునే జరుగుతుంది. త్వరలో న్యూజిలాండ్, శ్రీలంకలతో జరిగే సిరీస్ లను భారత జట్టు కచ్చితంగా కైవసం చేసుకుంటుంది. కాకపోతే దక్షిణాఫ్రికా పర్యటన కోహ్లికి చాలా ముఖ్యం. భారత జట్టుకు గట్టి పోటీనిచ్చే సామర్థ్యం దక్షిణాఫ్రికాకు ఉంది. అదే విరాట్ సేనకు అసలైన సవాల్'అని గంగూలీ విశ్లేషించాడు.
Comments
Please login to add a commentAdd a comment