స్వదేశంలో భారత్ తిరుగులేని ఆటకు మరో సిరీస్ బహుమతిగా దక్కింది. ఏమాత్రం చేవ లేని దక్షిణాఫ్రికా బ్యాటింగ్ సునాయాసంగా తలవంచడంతో నాలుగో రోజే రెండో టెస్టు విజయం టీమిండియా ఖాతాలో చేరింది. భారత్ చేతిలో తొలిసారి ఫాలోఆన్ ఆడిన సఫారీలు పేలవ ప్రదర్శనతో 67.2 ఓవర్లలోనే 10 వికెట్లు సమరి్పంచుకొని ప్రత్యర్థికి తమపై అతి పెద్ద విజయాన్ని అందించారు.
ఉమేశ్ యాదవ్, జడేజా చెరో మూడు వికెట్లతో దక్షిణాఫ్రికా పతనాన్ని శాసించగా, అటువైపు ఒక్క బ్యాట్స్‌మెన్ కూడా తన జట్టును ఆదుకోలేకపోయాడు. ఫలితంగా ప్రపంచ ఛాంపియన్ షిప్ పాయింట్ల పట్టికలో కోహ్లి సేన మరింత పైపైకి దూసుకుపోయింది. అన్నింటికి మించి సొంతగడ్డపై వరుసగా 11 సిరీస్ విజయాలతో కొత్త ప్రపంచ రికార్డును సృష్టించింది.
పుణే: నిర్దాక్షిణ్యమైన ఆటతో విరుచుకు పడుతున్న భారత జట్టు దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌ను మరో మ్యాచ్ మిగిలి ఉండగానే సొంతం చేసుకుంది. ఆదివారం ఇక్కడ ముగిసిన రెండో టెస్టులో టీమిండియా ఇన్నింగ్స్, 137 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. మ్యాచ్ మూడో రోజు శనివారం ఆట ముగిసే సమయానికి 326 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం సాధించిన భారత్ మళ్లీ బ్యాటింగ్ చేయడంపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు.
అయితే ఆదివారం ఉదయం కెప్టెన్ కోహ్లి ప్రత్యరి్థని ఫాలోఆన్ ఆడించేందుకు సిద్ధమయ్యాడు. దాంతో రెండో ఇన్నింగ్స్ బరిలోకి దిగిన దక్షిణాఫ్రికా 67.2 ఓవర్లలో 189 పరుగులకే కుప్పకూలింది. డీన్ ఎల్గర్ (72 బంతుల్లో 48; 8 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా... బవుమా (63 బంతుల్లో 38; 4 ఫోర్లు, సిక్స్), ఫిలాండర్ (72 బంతుల్లో 37; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు) కొద్దిగా పోరాడారు. అజేయ డబుల్ సెంచరీ సాధించిన కోహ్లికి ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు దక్కింది. ఇరు జట్ల మధ్య సిరీస్‌లో చివరిదైన మూడో టెస్టు ఈ నెల 19 నుంచి రాంచీలో జరుగుతుంది.
ఎల్గర్ మినహా...
ఫాలోఆన్‌లో దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌ను కూడా పేలవంగా ప్రారంభించింది. ఇషాంత్ బౌలింగ్‌లో రెండో బంతికే వికెట్ల ముందు దొరికిపోయిన మార్క్‌రమ్ (0) ‘సిల్వర్ పెయిర్’తో (రెండు ఇన్నింగ్స్‌లలో తాను ఆడిన రెండో బంతికే ఔట్ కావడం) టెస్టును ముగించాడు. అతను రివ్యూ చేసే సాహసం చేయకపోగా... ఆ తర్వాత రీప్లేలో అది నాటౌట్‌గా కనిపించింది. రెండో ఓవర్లోనే ‘సున్నా’కే బ్రూయిన్ ఇచ్చిన క్యాచ్‌ను కోహ్లి స్లిప్‌లో వదిలేశాడు. అయితే కొద్ది సేపటికే అదే ఉమేశ్ బౌలింగ్‌లో బ్రూయిన్ (8) లెగ్ సైడ్‌లో ఆడగా... కీపర్ సాహా అత్యద్భుత క్యాచ్ అందుకున్నాడు. నాలుగో స్థానంలో బ్యాటింగ్‌కు దిగిన కెప్టెన్ ప్లెసిస్ ఎక్కువ భాగం డిఫెన్స్‌కే పరిమితం కాగా... మరోవైపు ఎల్గర్ మాత్రం కొన్ని చక్కటి షాట్లతో జట్టుకు పరుగులు అందించే ప్రయత్నం చేశాడు.
షమీ వేసిన ఒక ఓవర్లో అతను మూడు ఫోర్లు కొట్టడం విశేషం. చివరకు ప్లెసిస్ (54 బంతుల్లో 5) అడ్డంకిని అశ్విన్ తొలగించాడు. చేజారిపోతున్న క్యాచ్‌ను సిల్లీ పాయింట్ వరకు వెళ్లి నాలుగో ప్రయత్నంలో సాహా అందుకున్నాడు. అప్పటి వరకు ఓపిగ్గా ఆడిన ఎల్గర్ కూడా భారీ షాట్‌కు ప్రయతి్నంచి వెనుదిరిగాడు. లంచ్ తర్వాత జడేజా బౌలింగ్‌లో గుడ్డిగా బ్యాట్ ఊపి డి కాక్ (5) పెవిలియన్ చేరగా, జడేజా వేసిన మరో చక్కటి బంతికి బవుమా కూడా అవుటయ్యాడు. తర్వాతి ఓవర్లో ముత్తుసామి (9)ని షమీ అవుట్ చేశాడు.
మళ్లీ ఆ ఇద్దరే...
తొలి ఇన్నింగ్స్‌లో 109 పరుగుల భాగస్వామ్యంతో భారత్‌ను ఇబ్బంది పెట్టిన ఫిలాండర్, కేశవ్ మహరాజ్ (65 బంతుల్లో 22; 3 ఫోర్లు) మరోసారి చికాకు పరిచారు. వచ్చీ రాగానే జడేజా ఓవర్లో వరుస బంతుల్లో రెండు సిక్సర్లు బాది ఫిలాండర్ దూకుడుగా కనిపించగా, మహరాజ్ సహకరించాడు. మహరాజ్ ఇచి్చన క్యాచ్‌ను స్లిప్‌లో పుజారా వదిలేయడం కూడా వీరికి కలిసొచి్చంది. ఆ తర్వాత వీరిద్దరు మరింత జాగ్రత్తగా, సమన్వయంతో ఆడటంతో పార్ట్‌నర్ షిప్ 50 పరుగులు దాటింది. అయితే టీ విరామం తర్వాత సఫారీ ఇన్నింగ్స్‌ను ముగించేందుకు భారత్‌కు ఎంతో సమయం పట్టలేదు. ఈ జోడీని చివరకు ఉమేశ్ విడదీశాడు. లెగ్ దిశగా వెళుతున్న బంతిని ఆడిన ఫిలాండర్...కీపర్ సాహాకు క్యాచ్ ఇచ్చాడు. అదే ఓవర్లో రబడ (4) కూడా వెనుదిరగ్గా...మరో రెండు బంతులకే మహరాజ్‌ను ఎల్బీగా అవుట్ చేసిన జడేజా దక్షిణాఫ్రికా ఆటను ముగించాడు.
‘సూపర్ మాన్... వృద్ధిమాన్’
దక్షిణాఫ్రికా రెండో ఇన్నింగ్స్‌లో హైలైట్‌గా నిలిచిన అంశం వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా ప్రదర్శన. బ్యాట్స్‌మెన్ లెగ్‌సైడ్ దిశగా ఆడిన రెండు బంతులను అతను చూడచక్కటి రీతిలో క్యాచ్‌లు అందుకున్నాడు. లెగ్‌స్టంప్ బయటపడిన బంతిని షాట్ ఆడితే దాదాపుగా బౌండరీ అనుకోవాల్సిందే. అది క్యాచ్‌గా మారడానికి చాలా తక్కువ శాతమే అవకాశం ఉంటుంది. కానీ సాహా మాత్రం వాటిని అలా పోనివ్వలేదు. ఈ రెండు క్యాచ్‌లు ఉమేశ్ యాదవ్ బౌలింగ్‌లోనే వచ్చాయి. డి బ్రూయిన్ ఇచి్చన క్యాచ్ నిజంగా అనూహ్యం. ఎడమవైపు దూకుతూ అతను పట్టిన తీరుకు అభినందనల వర్షం కురిసింది. కెపె్టన్ కోహ్లి ముద్దుతో సాహాకు తన ఆనందాన్ని వ్యక్తపరిచాడు. కీలక భాగస్వామ్యానికి ముగింపు పలికిన ఫిలాండర్ క్యాచ్ కూడా అలాంటిదే. అందుకే ఉమేశ్ కూడా తాను సాహాకు పార్టీ ఇవ్వాల్సి ఉందంటూ సరదాగా వ్యాఖ్యానించాడు.
►11 స్వదేశంలో భారత్‌కు వరుసగా ఇది 11వ టెస్టు సిరీస్ విజయం. ఇది కొత్త రికార్డు. గతంలో ఆస్ట్రేలియా రెండు సార్లు (1994–2001, 2004–2008 మధ్య కాలంలో) వరుసగా 10 సిరీస్‌లు గెలుచుకుంది. 2013 ఫిబ్రవరిలో ఆ్రస్టేలియాపై 4–0తో సిరీస్ గెలవడంతో భారత్ విజయప్రస్థానం మొదలైంది. భారత్ సొంతగడ్డపై చివరిసారిగా 2012లో ఇంగ్లండ్ చేతిలో టెస్టు సిరీస్ ఓడింది.
►1 దక్షిణాఫ్రికాపై భారత్‌కు ఇదే అతి పెద్ద విజయం. 2010 కోల్‌కతా టెస్టులో భారత్ ఇన్నింగ్స్, 57 పరుగులతో గెలిచింది.
►30 కోహ్లి నాయకత్వంలో భారత్‌కు ఇది 30వ టెస్టు విజయం. కెప్టెన్ గా తొలి 50 టెస్టుల తర్వాత సాధించిన అత్యధిక విజయాలు చూస్తే కోహ్లికి మూడో స్థానం దక్కుతుంది. స్టీవ్ వా 37 టెస్టులు గెలుచుకోగా, రికీ పాంటింగ్ 35 టెస్టుల్లో విజయం అందించాడు. కోహ్లి కెపె్టన్‌గా వ్యవహరించిన 50 టెస్టుల్లో భారత్ 10 టెస్టులు ఓడి మరో 10 ‘డ్రా’ చేసుకుంది.
కెప్టెన్ గా నాపై ఎంతో బాధ్యత ఉంది. డబుల్ సెంచరీ చేయాలనుకొని బరిలోకి దిగితే అది సాధ్యం కాదు. ఐదు సెషన్లు పట్టుదలగా బ్యాటింగ్ చేయాలని అనుకుంటే డబుల్ సెంచరీ నడిచొస్తుంది. గతంలో వ్యక్తిగత మైలురాళ్ల గురించి ఆలోచించేవాడిని. అయితే జట్టు ప్రయోజనాల గురించి ఆలోచిస్తే మాత్రం ఎలాంటి ఒత్తిడి దరి చేరదని అర్థమైంది. కెరీర్ ఆరంభంలో విమర్శలకు సమాధానం ఇవ్వాలని ఆడేవాడిని. ఇప్పుడు నేనున్న స్థితిపై సంతృప్తిగా ఉన్నా. జట్టును విజయం సాధించే స్థితిలో నిలపడం ఒక్కటే నేను ఆలోచిస్తాను.
పరుగులు చేయడాన్ని ఆస్వాదిస్తాను కానీ అవి జట్టు విజయానికి పనికొస్తే అంతకంటే ఆనందం లేదు. మా ప్రస్థానం మొదలైనప్పుడు టెస్టుల్లో 7వ ర్యాంక్‌లో ఉన్నాం. పైకి ఎదగడమే లక్ష్యంగా పెట్టుకున్నాం. ప్రాక్టీస్‌లో తీవ్రంగా శ్రమించాలని, కొన్ని వ్యక్తిగత త్యాగాలు కూడా చేయక తప్పదని నిర్ణయించుకున్నాం. గత మూడు, నాలుగేళ్లుగా దాదాపు అదే జట్టు ఉండటం అదృష్టం. తమ ఆటను మెరుగపర్చుకునేందుకు వారిలో కనిపించే ఉత్సాహం, తపన నిజంగా అద్భుతం. టెస్టు చాంపియన్íÙప్‌ను దృష్టిలో ఉంచుకొని చూస్తే ప్రతీ మ్యాచ్‌కు ప్రాధాన్యత ఉంది. కాబట్టి మూడో టెస్టులో కూడా విజయంపైనే దృష్టి. మేమెవ్వరం హాయిగా విశ్రాంతి తీసుకోమని మాత్రం కచ్చితంగా చెప్పగలను.
–విరాట్ కోహ్లి, భారత కెప్టెన్
Comments
Please login to add a commentAdd a comment