పాక్‌ను తక్కువ అంచనా వేయొద్దు: కోహ్లీ
బర్మింగ్‌హామ్: తెలివైన గేమ్ ప్లాన్‌తో రంగంలోకి దిగడంతో బంగ్లాదేశ్‌పై అలవోకగా విజయం సాధించామని కెప్టెన్ విరాట్ కోహ్లీ అన్నాడు. మ్యాచ్ ముగిశాక మీడియాతో మాట్లాడుతూ.. 'పాకిస్తాన్ అమోఘంగా పుంజుకుంది. వారి ఆటతీరు నిజంగా ప్రశంసనీయం. పాక్ ఫైనల్‌కు చేరిందంటే.. వారు ఎంతో శ్రమించారని చెప్పవచ్చు. బలమైన ప్రత్యర్థులను సైతం మట్టికరిపించి పాక్ ఫైనల్ బెర్త్ దక్కించుకుంది. దాయాది జట్టును తక్కువగా అంచనా వేస్తే భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని జట్టుకు సూచించాను. ఫైనల్ అనగానే ప్రతి జట్టు మైండ్ సెట్ మారిపోతోంది. ఏ జట్టుకైనా ప్రతిష్టాత్మక టోర్నీ ఫైనల్ అనగానే ఒత్తిడికి లోనవుతుంది.
అయితే ప్రత్యర్ధితో సంబంధం లేకుండా ప్రత్యే గేమ్ ప్లాన్‌తో బరిలోకి దిగుతాం. మాకు పాక్ బలాలే కాదు.. బలహీనతలు కూడా తెలుసు. వాటిని దృష్టిలో ఉంచుకుని ఫైనల్‌కు సన్నద్ధమవుతాం. కొన్ని రోజులుగా భారత్ మంచి క్రికెట్ ఆడుతోంది. చాంపియన్స్ ట్రోఫీలోనే అదే ప్రదర్శన రాబట్టి ఫైనల్లోకి ప్రవేశించాం. ప్రస్తుత జట్టుతో విజయాలు సాధిస్తున్నాం. అందుకే ఫైనల్లోనూ దాదాపు ఏ మార్పులు లేకుండా ఇదే జట్టుతో పాక్‌ను ఢీకొంటామని' కెప్టెన్ వివరించాడు. ఆదివారం జరగనున్న ఫైనల్లో చిరకాల ప్రత్యర్థులు భారత్, పాక్‌లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. లీగ్ దశలో భారత్ చేతిలో ఓటమితో పాటు తొలిసారిగా ఈ టోర్నీలో ఫైనల్ చేరిన పాక్‌పైనే పూర్తిగా ఒత్తిడి ఉంటుందని క్రికెట్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.